Monday, December 23, 2024

దేశానికి దిక్సూచి ‘పోషకాహార కిట్’

- Advertisement -
- Advertisement -

ముద్దుగా, బొద్దుగా ఆరోగ్యంగా ఉండే బిడ్డను కనాలని కోరుకునే ప్రతి తల్లీ, తాను తీసుకుంటున్న ఆహారంలో ఏ మేరకు పోషకాలు ఉంటున్నాయో చూసుకోవాలి. బిడ్డ అందం తల్లిదండ్రుల క్రోమోజోముల మీద ఆధారపడి ఉన్నప్పటికీ, ఆరో గ్యం మాత్రం గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకునే ఆహార పదార్థాలను బట్టి వుంటుంది. గర్భం దాల్చింది మొదలు ప్రసవం జరిగే వరకూ తల్లిలో శారీరకంగా ఎన్నో మార్పులు జరుగుతుంటాయి.ఈ క్రమంలో గర్భంలో పెరిగే శిశువుకు తగినంత పోషణ లభించవలసింది తల్లి రక్తం ద్వారా బిడ్డ పెరుగుదలకు ఎదురయ్యే పోషకాహార సమస్యలను గుర్తిస్తూ తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వివిధ రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఎముకలలో శక్తి నిల్వ వుండి ప్రసవం సులభం అవడానికి పోషకాహారం తోడ్పడుతుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తూ ‘పోషకాహార కిట్ల’కు రూపకల్పన చేసింది. గర్భిణుల్లో రక్తహీనత అధికంగా ఉన్న తల్లులను గుర్తించి వీటిని అందించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

కుటుంబం, సమాజం ఆరోగ్య పోషణ స్థాయిలను పదిలపరుచుకోవడానికి గర్భిణి ఆహారం, ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలి. పుట్టబోయే బిడ్డ శరీర అవసరాలకు కావలసిన పోషకాహారాలు అందించగలిగినప్పుడే తల్లీ, బిడ్డ క్షేమంగా ఉంటారు. అయితే మన తెలంగాణ రాష్ర్టంలో రక్తహీనత గర్భిణుల పాలిట శాపంగా మారింది. ప్రత్యేక రాష్ర్టం ఏర్పడే నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉండగా, ప్రస్తుతం 66 శాతానికి పెరిగింది. మాతృ మరణాల రేటు (ఎంఎంఆర్) గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్) స్పష్టం చేసింది. తెలంగాణ ఏర్పడే నాటికి (2014లో) నాటికి 92 రేట్ ఉండగా, 2020 నాటికి 43కు తగ్గింది. 201719లో 56 ఉండగా, వైద్య ఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్య వల్ల తగ్గుదల నమోదైంది. అతి తక్కువ మరణాలతో దేశంలో తెలంగాణ మూడవ స్థానంలో నిలిచింది. కేరళ, మహారాష్ర్ట మొదటి రెండు స్థానాలు ఆక్రమించాయి.

జాతీయ సగటు 97 ఉండగా, ఇది తెలంగాణ కంటే రెట్టింపు. రాష్ర్టం ఏర్పడే నాటి నుంచి ఇప్పటి వరకు 49 పాయింట్లు తగ్గింది. ఈ తగ్గుదల వెనుక ప్రభుత్వం వైద్య రంగంలో తీసుకుంటున్న చర్యలు ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయి.తల్లీ, బిడ్డ మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘మిడ్ వైఫరీ (ప్రసూతి సహాయకులు) వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ‘ఫర్ ఎవ్రి చైల్డ్ ఎ హెల్దీ స్టార్’ హాష్ ట్యాగ్‌తో హైదరాబాదు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువు ఫోటోను జతచేసి యూనిసెఫ్ ట్వీట్ చేసింది. దీంతో ప్రసవ సేవలు అందించడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా, దిక్సూచిగా నిలిచినట్లయింది.

రక్తహీనత వల్ల ప్రసవాలు సంక్లిష్టంగా మారుతున్న పరిస్థితిని గుర్తించి ఆరోగ్యం, పోషణకు కావలసిన చర్యలను ప్రభుత్వం చేపట్టింది. రక్తహీనతను నివారించడం వల్ల మాతృ మరణాలు గణనీయంగా తగ్గించవచ్చని జరిపిన అధ్యయనాలను అమలులోకి తీసుకు వస్తూ పోషకాహార పదార్ధాలతో కూడుకున్న ‘కెసిఆర్ పోషకాహార కిట్లు’ను అందజేస్తున్నది. కిలో పౌష్టికాహార మిశ్రమ పొడి, కిలో ఖర్జూరం, ఐరన్ సిప్ 3 సీసాలు, 500 గ్రాముల నెయ్యి, ఆల్‌బెండజోల్ మాత్రలు, ఒక ఖాళీ కప్పు, ప్లాస్టిక్ బకెట్‌తో కూడుకున్న కిట్‌ను తయారు చేసి గర్బిణిలకు అందజేస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో 1.25 లక్షల మంది గర్భిణులకు ఒక్కొక్కరికి రెండేసి కిట్లను అందజేశారు. ఒక్కో కిట్‌కు రూ.1.962 చొప్పున రూ.50 కోట్లు వ్యయం చేస్తున్నది. ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లను పోషకాహారం ద్వారా అందించి రక్తహీనత తగ్గించడం ఈ కిట్ల ప్రధాన లక్ష్యం.

గర్భిణికి 1327 వారాల మధ్య జరిగే రెండవ ఎఎన్‌సి చెకప్ సమయంలో మొదటిసారి, 2834 వారాల మధ్య చేసే మూడో ఎఎన్‌సి చెకప్ సమయంలో రెండవసారి ఈ కిట్లను అందజేస్తారు. ఇదే తరహాలో కౌమార బాలికల్లో సంభవిస్తున్న రక్తహీనతను అధిగమించేందుకుగానూ బాలికలకు పౌష్టికాహార కిట్లను అందజేస్తున్నది. ఖర్జూరం, నెయ్యి, ప్రొటీన్ బిస్కట్లతో ప్రత్యేకంగా రూపొందించిన కిట్‌ను 15 రోజులకు ఒకటి చొప్పున 300 రోజులకు సరిపడా పంపిణీ చేస్తున్నది. 11 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న బాలికలకు ఏకకాలంలో ఈ కిట్లను తెలంగాణ స్త్రీ,శిశు సంక్షేమశాఖ అందిస్తున్నది. ఇప్పటికే జాతీయ కుటుంబ సర్వే మేరకు 15 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్న యువతుల్లో రక్తహీనత శాతం ఆధారంగా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ‘బాలా మృతం’ పేరిట పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. అయితే భవిష్యత్తు పరిస్థితులను అంచనా వేసి ముందుగా కౌమార దశలోని బాలికల ఆరోగ్య సమస్యను అధిగమించేందుకు వారికి అత్యున్నత పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం లక్ష్యంగా ఎంచుకుంది.

సాంఘిక, మతపరమైన అలవాట్లను పక్కనబెట్టి మామూలు రోజుల కంటే కూడా గర్భవతిగా ఉన్నప్పుడు పోషక విలువలు కలిగివున్న అన్ని రకాల ఆహార పదార్థాలకు ప్రాధాన్యతనివ్వాలి. గర్భవతిగా ఉన్న తొలి దశలో సహజంగా తల నొప్పి, తిప్పడం, వాంతులు రావడం జరుగుతుంటుంది. ఒక్కోసారి ఆహారం కూడా నోట్లోకి పోదు. అయినా కూడా ప్రతి రోజూ తీసుకునే ఆహార పదార్థాల్లో గింజ ధాన్యాలు 445 గ్రాములు, పప్పు దినుసులు 55 గ్రా., ఆకు కూరలు 100 గ్రా., కాయగూరలు 40 గ్రా., దుంపకూరలు 50 గ్రా., పాలు 200 గ్రా., చక్కెర, బెల్లం 30 గ్రా., నూనె నెయ్యి 25 గ్రా., ఒక గుడ్డు ఆహారంలో ఉండాలని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సూచించింది. ఇందువల్ల గర్భిణి శరీరంలో 2200 కేలరీల శక్తిజనకాలు, 60 గ్రా. మాంసకృత్తులు, వెయ్యి మి.గ్రా. కాల్షియం, 400 మి.గ్రా. ఐరన్ లభ్యమవుతుంది. ఈ పోషకాలు తక్కువైతే గర్భంలో పెరిగే శిశువుకు తగినంత శక్తి, శరీర నిర్మాణానికి, పెరుగుదలకు కావలసినంత పోషణ లభించక వివిధ వ్యాధులకు గురయ్యే అవకాశముంటుంది.

ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. అట్టడుగు వర్గాలకు చెందిన గర్భిణులు ఆహారానికి సరైన ప్రాధాన్యతనివ్వకపోవడం వల్ల ఈ వ్యాధికి గురవుతున్నారు. దీంతో ప్రసవ సమయంలో కాళ్లు, చేతులు, ముఖం వాపుకు రావడం, రక్తపోటు సంభవించడంతో పుట్టే శిశువులు శ్వాసకోశ వ్యాధి, పచ్చ కామెర్లకు గురవుతుంటారు.
ఒక్కోసారి శిశువు మరణించే అవకాశముంటుంది. ఐరన్ లోపాన్ని నివారించడానికి ఆకుకూరలు ఎక్కువగా వాడాలి. శిశువు ఎముకలు, కండరాల పటిష్టతకు గర్భిణిలు ఎక్కువగా పాలు, ఆకుకూరలు, రాగులు వంటి కాల్షియం అందించే పదార్థాలు తీసుకోవాలి. పప్పు దినుసులు, పండ్లు విరివిగా వాడడం వల్ల కంటి జబ్బులు, నోరు, నాలుక, పెదిమలు పగుళ్లను నివారిస్తుంది. పోషక విలువలు కలిగి వున్న ఆహార పదార్థాలు తీసుకోవడం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఖర్చుతో కూడుకున్నది కావడంతో తెలంగాణ ప్రభుత్వం పోషకాహార కిట్లపై దృష్టి సారించింది. వీటి వినియోగం వల్ల ప్రసవ మరణాలు గణనీయంగా తగ్గిపోవడంతో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ర్టం ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News