9జిల్లాల్లో పథకం అమలు
శాసనసభలో మంత్రి హరీశ్‌రావు ప్రకటన
మహిళలల్లో రక్తహీనత తొలగించడానికి న్యూట్రిషన్ కిట్లు
2017 జూన్ 2నుంచి ఇప్పటివరకు
కెసిఆర్ కిట్ల ద్వారా 13,29,951మందికి లబ్ధి
రూ. 1.387కోట్ల 19లక్షల ఖర్చు
35% నుంచి 54శాతానికి పెరిగిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య
94% నుంచి 63శాతానికి తగ్గిన ప్రసవ సమయ తల్లుల మరణాలు
రూ.407కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 9 జిల్లాల్లో కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. శుక్రవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్‌లు కెసిఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. కెసిఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద 2017, జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు 13,29, 951 మందికి లబ్ధి చేకూరిందన్నారు. కెసిఆర్ కిట్ పథకం అమలు కోసం రూ. 1.387 కోట్ల 19 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.
రాష్ట్రంలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను పటిష్టం చేస్తున్నామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఈ పథకం ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 35 శాతంగా ఉంటే కెసిఆర్ కిట్ అమల్లోకి వచ్చిన తరువాత అది 54 శాతానికి పెరిగిందన్నారు. గతంలో ప్రసవాలకు వచ్చిన తల్లుల మరణాలు ప్రతి లక్షకు 94 శాతం ఉండేదని, ప్రస్తుతం దానిని 63 శాతానికి తగ్గించామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. తల్లుల మరణాలు దేశంలో సగటున 113 ఉండగా, కెసిఆర్ కిట్ అమలుతో రాష్ట్రంలో తల్లుల మరణాలు ఇవాళ 63 శాతానికి
తగ్గించామని మంత్రి తెలిపారు. శిశు మరణాలను కూడా తగ్గించుకున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులను పెద్ద ఎత్తున కల్పించామన్నారు. కొత్తగా 23 మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇలాంటి వారికి న్యూట్రిషన్ కిట్ అందిస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. త్వరలోనే న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. మహిళా అధికారులు వేరే రాష్ట్రంలో అధ్యయనం చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మొదటి విడతలో న్యూట్రిషన్ కిట్ పథకాన్ని కుమురం భీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల్, నాగర్‌కర్నూల్, ములుగు జిల్లాల్లో అమలు చేయబోతున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
రూ.407 కోట్లతో మాతా, శిశు సంరక్షణ కేంద్రాలు
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 56 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 2014 తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 28 శాతం మేర పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాతా, శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తోందని ఇందుకోసం రూ.407 కోట్లతో 23 మాతా, శిశు సంరక్షణ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. వీటిలో ఇప్పటికే 16 కేంద్రాల నిర్మాణం పూర్తయ్యిందన్నారు. శిశు మరణాల రేటు సైతం 39 శాతం ఉండగా 23 శాతానికి తగ్గించినట్టు ఆయన వెల్లడించారు. దేశంలో సగటు 35 శాతం ఉండగా, రాష్ట్రంలో 23 శాతం ఉన్నట్టు మంత్రి తెలిపారు.
మెదక్ జిల్లాలో 100 పడకలతో….
త్వరలోనే మెదక్ జిల్లాలో 100 పడకలతో మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణం తుదిదశకు చేరుకుందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. డాక్టర్లు, సిబ్బందిని పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. తల్లులు, పిల్లల ఆరోగ్యం కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రజల్లో చైతన్య తీసుకురావాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు.