ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్ తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయి
ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోకాపేట్‌లోని హెచ్‌ఎండిఎ లే అవుట్ నియోపోలీస్‌లో
మొక్కను నాటిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్ తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రపంచ పర్యవారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోకాపేట్‌లోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) లే అవుట్ నియోపోలీస్‌లో సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మొక్క నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్ అందించిన మొక్కను సిఎం నాటారు. తెల్లాపూర్ హెచ్‌ఎండిఎ నర్సరీలో పెంచిన మూడేళ్ల వయస్సు కలిగిన 7.5 అడుగుల ‘పొన్న’ మొక్కను నాటి వర్మికంపోస్ట్ ఎరువు వేసి సిఎం నీరు పోశారు. పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పంచభూతాల్లో భాగమైన నీరు, ప్రాణవాయువును కొనుక్కొనే దుస్థితికి మానవాళి చేరడానికి మానవ తప్పిదాలే కారణమని సిఎం స్పష్టం చేశారు. ప్రకృతిని మనం కాపాడితే, ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సత్యాన్ని మరవరాదని అన్నారు.
రాష్ట్రంలో పచ్చదనం పెరిగి జీవ వైవిధ్యం పరిఢవిల్లుతున్నది
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేడు రాష్ట్రంలో పచ్చదనం పెరిగి జీవ వైవిధ్యం పరిఢవిల్లుతున్నదని సిఎం పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.70 శాతానికి పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక వెల్లిడంచడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ ప్రజల పర్యావరణ పరిరక్షణ దీక్షకు దర్పణం పడుతున్నదన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలవడం, బృహత్ ప్రకృతి వనాలపై నీతి ఆయోగ్ ప్రశంసలు, హరితహారం ద్వారా 273 కోట్ల మొక్కలను నాటడం ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నంగా రికార్డులకెక్కడం, ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్’ నివేదికలో పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ స్థానం దక్కడం వంటి విజయాలన్నీ పర్యావరణ పరిక్షణ పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న నిబద్ధతను స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. పర్యావరణహిత రాష్ట్రాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి కె.కేశవరావు,మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి,మల్లారెడ్డి,గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, హెచ్‌ఎండిఎ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎంపి సంతోష్‌కుమార్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్క నాటిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హరితహారం పితామహులు సిఎం కెసిఆరే స్వయంగా మొక్కను నాటడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం సృష్టికర్తగా తనకు ఇంతకంటే సంతోషకరమైనది మరొకటి లేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.