Monday, December 23, 2024

సాహస యాత్ర 2.0

- Advertisement -
- Advertisement -

Corona again in india అందరూ చిమ్మచీకటిని నిందిస్తూ కూచొనేవారే అయినప్పుడు అది మరింత చిక్కనై వారి సహనాన్ని పరీక్షిస్తుంటుంది. మరిన్ని జడలు విరబోసుకొని వికటాట్టహాసం చేస్తుంది. అటువంటప్పుడే కాంతి ఖడ్గధారుల అవసరం కలుగుతుంది. ఎంతో విజ్ఞతతో నిర్మించి తీర్చిదిద్దుకొన్న సెక్యులర్, ప్రజాస్వామిక చైతన్య దీప్తికి హాని తలెత్తింది. దేశాన్ని మంచి దారిలో నడిపించవలసిన పాలకులు భారతీయత పేరుతో జాతి నవనాడులలోనూ మతోన్మాదాన్ని దట్టిస్తున్నారు. ప్రజల అమాయకత్వంలో వేళ్ళు ఊడలు తన్నుకొని వున్న బలమయిన ఈ శక్తులను బహుముఖమైన వ్యూహబలంతో గాని యెదుర్కోడం, యెదుర్కొని ఓడించడం సాధ్యం కాదు. అటువంటి లోతైన శాస్త్రీయమైన ప్రతి వ్యూహ బలంతో అసమాన రాజకీయ యోధుడు, మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అడుగులు వేస్తున్నారు.

సకల జనహిత దృష్టితో ప్రజా క్షిపణులను ప్రయోగించి స్వరాష్ట్రాన్ని సాధించుకొన్న పోరాట అనుభవంతో అంతే జనాభ్యుదయ దృష్టితో రాష్ట్రానికి విశిష్టమైన పాలన అందిస్తున్న చాకచక్యంతో ఆయన జాతీయ రాజకీయ యుద్ధ రంగంలో అడుగు పెడుతున్నారు. ఇందుకోసం కెసిఆర్ జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులపై గాఢమైన అధ్యయనం చేశారు. వాటిని క్షుణ్ణంగా అవగాహన చేసుకొన్నారు. ముదిరిపోయిన మతోన్మాద రోగాన్ని నిర్మూలించి దేశానికి సరైన ప్రగతి ఔషధంతో చికిత్స చేయవలసిన అవసరముందని గ్రహించారు. అందుకు ఇదే సమయమని భావించారు. అనేక ప్రాంతాలు, మతాలు, భాషలు, ఆచార వ్యవహారాల కలనేతగా మనుగడ సాగిస్తున్న దేశంలో మత చిచ్చు రగిలించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బిజెపి ఎనిమిదేళ్ల పాలనలో దాపురించిన అభివృద్ధి నిరోధక స్థితిని తొలగించి దేశానికున్న సకల వనరులను సద్వినియోగం చేయడం ద్వారా మంచి మార్పును తీసుకు రావాలని సంకల్పించారు.

గత కాలపు వైషమ్యాలను తవ్విపోసి లవ్ జిహాద్, హిజాబ్ , బుల్డోజర్ వంటి కుత్సిత పన్నాగాలు రచించి కుట్ర పాలన సాగిస్తున్న కాషాయ శక్తుల విష కౌగిలి నుంచి జాతిని కాపాడాలని వ్యూహ రచన చేసుకున్నారు. యుపిఎ అవినీతి పాలనను అంతమొందించి తమపై ఎన్నో ఆశలతో అప్పగించిన అధికారాన్ని బిజెపి పాలకులు దుర్వినియోగం చేస్తున్న సంగతి తెలిసిందే. జాతి అల్లుకొని అల్లారు ముద్దుగా చూసుకొంటున్న ఫెడరల్ నీతినీ వారు కబళిస్తున్నారు. విద్యారంగంలో కేంద్రీకృత విధానాన్ని ప్రవేశపెట్టి దాని వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని బలి తీసుకొంటున్నారు. దానిలో విద్వేషానల పూరితమైన కాషాయ కాలుష్యాన్ని నింపుతున్నారు. మరొక వైపు ఆర్ధిక రంగంలో ప్రై ‘వేటు’ను పదునుగా నూరి ప్రజల ఆస్తులకు తల కొరివి పెడుతున్నారు. నిరంతర నాణ్యమైన వుచిత విద్యుత్తుతో రైతు ఇంట ఆత్మహత్యల ఘోర విషాద గతానికి తెర దించి ఆనందాల పంటలు పండిస్తున్న సాగు సంబురాన్ని సమాధిగతం చేయబూనారు. విద్యుత్తును కార్పొరేట్ పెట్టుబడి శక్తులకు ధారాదత్తం చేసి దగ్ధ భారతానికి తెర లేపుతున్నారు. రైతు కాళ్ళ కింది నేలను కదిలించి నాగేటి చాళ్ళల్లో మృత్యు బీజాలు నాటడానికి తెచ్చిన మూడు చట్టాలను ప్రాణాలు పణంగా పెట్టి మహోద్యమ పాదాల కింద రాచి నేల మట్టం చేసిన వీర రైతులపై పగబూని వారిపై దుష్ట పావులు కడుపుతున్నారు.

దాదాపు దశాబ్ద కాలంగా ఎన్నడూ లేని స్థాయిలో నిరుద్యోగం పడగ విప్పి ప్రళయ నాట్యం చేస్తున్నది. పెట్రోల్, డీజెల్‌ను సామాన్యులు కొనుక్కోలేని స్థితికి కొండెక్కించి చోద్యం చూస్తున్నారు. ద్రవ్యోల్బణం, ధరల పగ్గాలు వదిలేసి వాటి చేత ఆకాశ విహారం చేయిస్తున్నారు. అన్నింటా ప్రైవేటు దుర్లాభాలకే విశేష ప్రాధాన్యమిస్తూ సామాన్యుల జీవితాలతో క్రూర క్రీడ సాగిస్తున్నారు. దేశానికి బిజెపి పాలన ఇక ఎంతమాత్రం కొనసాగరాదని కెసిఆర్ దృఢ నిర్ణయానికి వచ్చారు. ప్రతిపక్ష శక్తులన్నింటినీ కలుపుకొని కేంద్ర పాలక పీఠంలోని దుష్ట శక్తిని దునుమాడాలని ఆయన మహా సంకల్పం వహించారు. ఈ ప్రయత్నంలో భావైక్యత గల వారందరినీ కలుసుకొన్నారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులను, దేవెగౌడ, లాలూప్రసాద్, అన్నా హజారే వంటి ఉద్దండులతోనూ సమావేశమయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ఏడు వందలకు పైగా అమర రైతు కుటుంబాలకు, దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన గల్వాన్ లోయ యోధాగ్రేసరుల కుటుంబాలకు మూడేసి లక్షల రూపాయల తోడ్పాటునందించిన నేత కెసిఆర్ యిప్పుడు దేశం కోసం నడుం బిగించారు. మరణం అంచుల్లోకి వెళ్లి స్వరాష్ట్రం కోసం సవిజయంగా కెసిఆర్ సాగించిన సాహసయాత్ర మొదటిది కాగా, రానున్న కురుక్షేత్ర సంగ్రామంలో కుట్రల కుత్సితాల బిజెపి కురు సేనను చీల్చి చెండాడడానికి పాశుపతాది మహాస్త్రాలతో మరో ఫల్గుణుడై పాంచజన్యం పూరించి మొదలుపెట్టిన ఈ సాహస యాత్ర రెండవది. ఇది దిగ్విజయంగా సాగుతుందని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News