Sunday, December 22, 2024

ఇద్దరూ దద్దమ్మలే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని, బిజెపికి 200 సీట్లు కూ డా దాటవని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి క ల్వకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన చేపట్టిన బస్సు యాత్ర సోమవారం రాత్రి ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా  ఖమ్మం నగరంలోని జెడ్‌పి సెంటర్‌లో తరలివచ్చిన వేలాది ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..తమ పార్టీకి 370 నుంచి400 సీట్లు వస్తాయని బిజెపి నేతలు చెబుతున్నప్పటికీ ఆ పార్టీకి 200 మించి సీట్లు రావని యావత్ ప్రపంచం మొత్తం కోడై కూస్తోందని అన్నారు. తెలంగాణలో తమ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాష్ట్రంలో 12 పార్లమెంట్ స్దానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఖమ్మం నుంచి నామాను గెలిపిస్తే కేంద్రంలో అధికారంలోకి వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అవుతారని, ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. తెలంగాణ ఆశాజ్యోతి గోదావరి నదిని ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు, కర్నాటకు తీసుకెళ్తుంటే..ఈ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి, ఎంపిలు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడం లేదన్నారు. ఇలాంటి దద్దమ్మలు మనకు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.

గోదావరి నదిపై ఇచ్చంపల్లి ప్రాజెక్టును కట్టి నీటిని తమిళనాడు, కర్నాటకు తీసుకెళ్తుంటే ఎందుకు మాట్లాడం లేదని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తల తెగిపడ్డా ఒప్పుకోనని అనాడు మాట్లాడనని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలోని మంత్రులకు, బిజెపి నేతలకు ఓట్లు, సీట్లు తప్ప రైతులు పంటలు, కన్నీళ్ళు పట్టవన్నారు. మోడీ గారడీలు, చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా ప్రాజెక్టులు రక్షించలేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు, హామీలు, హక్కులు తెచ్చుకోవడానికి తమ పార్టీ పెగులు తెగేదాకా కోట్లాడుతుందని అన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణను పూల పొదరిల్లులాగా ఒక్కొక్కటి పేర్చుకుంటూ వచ్చానని, కులం, మతం, వర్గ భేదం లేకుండా పేదలు, రైతులు, మహిళలు అన్ని వర్గాలకు సంక్షేమం కార్యక్రమాలను చేపడితే కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలలకే చిన్నాభిన్నం చేసిందన్నారు. ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఇప్పుడు ఒట్ల మీద ఒట్లు వేస్తున్నారని మండిపడ్డారు. భద్రాద్రి రామయ్య, బాసర సరస్వతి, యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ్మస్వామి మీద ఒట్టు మీద ఒట్టు ముఖ్యమంత్రి పెడుతున్నారని, ఇది పద్ధతేనా? అని ఆయన ప్రశ్నించారు.

ఎన్‌టిఆర్ రాజకీయాల్లోకి రాకముందే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన సంక్షేమం ఏమీలేదని, దున్నేవాడిదే భూమి, తినేవాడితే విస్తరి, అమ్మను ఆవునూ చూపి ఓట్లను గుద్దుకుందన్నారు. ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాతనే ప్రజా సంక్షేమం ప్రారంభమైందన్న చరిత్రను ఆయన గుర్తు చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పేదోడికి పట్టడు అన్నం దొరకిందని, పేదలకు పక్కా ఇళ్ళు, జనతా వస్త్రాలు, భూమి శిస్తు రద్దు వంటి పథకాలు చారిత్రక సత్యమని అన్నారు. కాంగ్రెస్ పేదలకు సంక్షేమ పాలన అందించలేదని ఆయన విమర్శిస్తూ ఎన్‌టిఆర్ ను మించిన సంక్షేమాన్ని తెలంగాణ వచ్చిన తరువాత చేసుకున్నామని తెలిపారు. 24 గంటల పాటు కరెంట్, రైతుబంధు, గుంట భూమి ఉన్న రైతుకు ఐదు లక్షల బీమా, కళ్యాణలక్ష్మి పథకాలను చేపట్టామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మితో పాటు ఇస్తామన్న తులం బంగారం తుస్సుమందని, ఇది అడిగితే కాంగ్రెస్ నేతలు కస్సుమంటున్నారని విమర్శించారు.

పదేళ్ళపాటు రెప్పపాటు కూడా పోని కరెంట్ ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు ఉన్నాయా అని ఆయన సభకు వచ్చిన ప్రజలను ప్రశ్నించారు. తులం బంగారం ఇస్తున్నారా, రుణ మాఫీ అయ్యిందా, మహిళలకు నెలకు రూ.2500 ఇస్తున్నారా , రైతు బంధు వచ్చిందా అని ప్రశ్నించగా జనం నుంచి లేదు..లేదు అనే సమాధానం రాగా మరి యుద్ధం చేద్దామా, పోరాడుదామా.. అని సభికులతో అన్నారు. ఎంతోమందితో చర్చించి ప్రారంభించిన రైతుబంధును అయిదు ఎకరాలకు మించి ఇవ్వమని అంటున్నారని ఆరేడు ఎకరాలు ఉన్నవారు కోటీశ్వర్లా అని ఆయన ప్రశ్నించారు. 20 ఎకరాలు తరువాత ఉన్న వారికి ఇవ్వబోమని అంటే ఒక అర్థం ఉంటుందని, కానీ అయిదెకరాలకే రైతు బంధు ఇవ్వమంటే ఇది ఎక్కడి న్యాయం అని ఆయన ప్రశ్నించారు.

డిపూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క.. ఆయన వట్టి విక్రమార్క అని కెసిఆర్ విమర్శించారు. మహబుబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్ నివాసంలో భోజనం చేస్తుంటే కరెంట్ పోయిందని తాను ట్విట్టర్లో పెడితే ఈరోజు భట్టి విక్రమార్క కరెంట్ పోలేదని అబద్ధాలు చెబుతున్నారని ఆయన అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీల కరెంట్, నీళ్ళ కొరత కారణంగా హాస్టళ్ళను మూసివేస్తున్నామని నోటీస్ పెట్టిన చీఫ్ వార్డన్‌ను సస్పెండ్ చేస్తామని షోకాజ్ నోటీస్ జారీ చేశారని ఆయన చెప్పారు. నాడు బిఆర్‌ఎస్ హయాంలో ఎక్కడ చూసినా వరి కోతలు ఉంటుండె..ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా కరెంట్ కోతలు ఎదురవుతున్నాయన్నారు. కరెంట్ కోతలు ఉన్నాయా లేదా అని సభికులను కూడా అడిగి తెలుసుకున్నారు. ఆగస్ట్ 15లోగా రుణ మాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు లేఖ రాసి అమరవీరుల స్థూపం వద్దకు వస్తే ముఖ్యమంత్రి తోక ముడిచారని విమర్శించారు. నాగార్జున సాగర్‌లో 495 అడుగుల నీరు ఉన్నా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పంట ఎండిపోకుండా నీరు ఇచ్చానని, ఇప్పుడు 510 అడుగుల నీరు ఉన్నా పంటలను కాపాడలేక ఎండబెట్టారని అన్నారు.

నేలకొండపల్లిలో పంటలు ఎండిపోయాయని, భక్తరాందాస్ ప్రాజెక్టు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఖమ్మం నగరంలో రోజూ మంచినీరు ఇచ్చేవారమని, ఇప్పుడు కనీసం మూడు రోజులకు కూడా నీరు ఇవ్వకుండా మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయని అన్నారు. చేతకాని, చేవలేని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ణప్తి చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేస్తే గోదావరిలో వేసినట్లే నని, కా్ంరగ్రెస్‌కు వస్తే ఏం జరిగిందో అసెంబ్లీ ఎన్నికల్లో తేలిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో వదలిలెయ్యండి,, ఇక్కడ బిఆర్‌ఎస్‌ను గెలిపించి మరింతత శక్తిని ఇవ్వాలని కోరారు. దేశం,రాష్ట్రం భవిష్యత్తు నేడు యువతపైనే ఆధారపడి ఉందని బ్రహ్మాండంగా ఆలోచించి బిఆర్‌ఎస్‌ను బలపర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎంఎల్‌ఎలు సండ్ర వెంకట వీరయ్య, మదన్ లాల్, బానోతు హరి ప్రియ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News