Friday, December 20, 2024

బలమివ్వండి…బరిగీసి కొట్లాడుతా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్ ప్రతినిధి : తెలంగాణలో దుర్మార్గమైన కాంగ్రెస్ పాలన సాగుతోందని, మీరు బలం ఇస్తే కాంగ్రెస్ మె డలు వంచి యుద్ధం చేసి ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా మీ కోసం పోరాడుతానని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో శనివారం రా త్రి ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ప్రజలను ఉద్దేశించి కెసిఆర్ ప్రసంగించారు. అంతకుముందు ఉయ్యలవాడ నుంచి బస్టాండ్ కూడలి వరకు భారీ జనసందోహం మధ్య మూడు కిలోమీటర్ల మేర రోడ్ షో సాగింది. అనంతరం బస్టాండ్ కూడలిలో ప్రజలను ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలు ఇచ్చి దుష్ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, వచ్చిన నాలుగు నెలల కాలంలో తమ హయాంలోని పథకాలను సైతం అమలు చేయలేక ..కొత్త హామీలు అమలు చేయక ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో నిరాశతో ఉన్నారన్నారు. రైతుబంధు రాక, కళ్యాణలక్ష్మి రాక, విద్యుత్ కోతలు, తాగునీటి కష్టాలతో పాటు రైతులు పండించిన ధాన్యం రోజుల తరబడి మార్కెట్ యార్డులలో,

కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాసినా కొనే దిక్కు దివానా లేదని విమర్శించారు. ఆరు నూరైనా తమ హయాంలో 24 గంటల విద్యుత్ ఇచ్చి తీరామని అన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ కోతలో శరణ్యమన్నారు.కరెంట్ కోతలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో 4 నెలల కాలంలో 225 మంది రైతులు ఆత్మహత్యలు, విద్యుత్ షాక్‌లు, రాత్రిళ్లు కరెంట్ పెట్టబోయి పాము కాట్లకు గురై ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇదంతా తాను చెప్పడం లేదని, నేను చెప్పినవన్నీ మీ కళ్ల ఎదుటే ఉన్నాయని అన్నారు. 14 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్ల పాటు బిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. కొత్తగా కాంగ్రెస్ వాళ్లు గడ్డపారలతో తవ్వే పనిలేదని.. ఉన్నవాటిని సక్రమంగా అమలు చేస్తే సరిపోతుందని, అది కూడా చేత కావడం లేదని అన్నారు. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాసంలో తాము భోజనం చేస్తుంటే రెండు పర్యాయాలు కరెంట్ పోయిందని.. ఏంది ఈ కరెంట్ పోకుడ.. అని ఆరా తీస్తే ప్రతిరోజు పదిసార్లు కరెంట్ పోతుందని చెప్పారని కెసిఆర్ అన్నారు. మిషన్ భగీరథతో రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికీ నీటిని అందించిన చరిత్ర తమదని అన్నారు. మళ్లీ బోర్లు, నీళ్ల ట్యాంకిలు, బిందెలు దర్శనమిస్తున్నాయని, ఇదంతా కాంగ్రెస్ పాలకుల చేతకానితనానికి నిదర్శనమన్నారు.

ఈరోజు తెలంగాణకు సుదినం
ఈరోజు తెలంగాణకు సుదినం అని, తెలంగాణ రాష్ట్రానికి శంకుస్థాపన జరిగిన రోజు అని కెసిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి వేరు పడితే తప్ప బతుకులు బాగుపడవని చేసిన పోరాటానికి ఈరోజు బీజం పడిన రోజుగా ఆయన అభివర్ణించారు. 14 ఏళ్లు ఉద్యమించి కెసిఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని తాను ఆమరణ దీక్షకు దిగితే కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందన్నారు. అనేక పర్యాయాలు ఉద్యమిస్తే తనను ఖమ్మం జైల్లో వేసారని ఆయన గుర్తు చేసుకున్నారు. తాను మహబూబ్‌నగర్ ఎంపిగా ఉన్నప్పుడు తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో కులం లేదు, జాతి లేదు, మతం లేకుండా అందరికీ సమన్యాయంతో గులాబీ జెండా అన్ని వర్గాలను చేరదీసి తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని కెసిఆర్ అన్నారు.

= పాలమూరు బాగుపడింది..సంతోషపడ్డాం
పాలమూరు బాగుపడుతుంటే సంతోషపడ్డామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న పాలమూరును వెనుకకు నెట్టే చర్యలకు దిగుతోందని కెసిఆర్ ధ్వజమెత్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 5 జిల్లాలను ఏర్పాటు చేసుకుని 5 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇదంతా ఈ కాంగ్రెస్ పాలకులకు సాధ్యమయ్యేదా అని ఆయన ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు చక్కగా నిర్మించుకుని సాగునీరు అందించుకున్నామని కెసిఆర్ అన్నారు.

= అందరికీ రైతు బంధు ఇస్తే అయ్యసొత్తు పోతుందా ..
వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ రైతుబంధు ఇస్తే అయ్యసొత్తు…జాగీరు ఏమైనా పోతుందా.. అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కెసిఆర్ దుయ్యబట్టారు. ఐదు ఎకరాలకే రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని 6 ఎకరాల రైతు ఏ పాపం చేశాడని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉన్న సమయంలో ఠంఛన్‌గా రైతుబంధు పడేదని టింగ్ టింగ్‌మంటూ సెల్ ఫోన్‌లు మోగేవని గుర్తు చేశారు. రైతుల సొమ్ము రైతులకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత కక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. నాలుగు నెలల నుంచి రైతు బంధు విషయంలో రైతుల విషయంలో ఈ ప్రభుత్వం అంత దుర్మార్గంగా ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.

= బిజెపి అక్కరకు రాని చుట్టం
తెలంగాణలో బిజెపి అక్కరకు రాని చుట్టమని కెసిఆర్ అన్నారు. నరేంద్ర మోడి పాలన అంతా అబద్ధాలమయమన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా సత్యనాష్ అయ్యిందని ఆయన దుయ్యబట్టారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, బేటీ బచావో బేటీ బటావో, బుల్లెట్ ట్రైన్, రైతు సంక్షేమం వంటివి ఒక్కటైనా అమలు అయ్యిందా అని ప్రజలను ప్రశ్నించి వారి హర్షధ్వానాల మధ్య అవేమీ రాలేదని చెప్పడంతో కెసిఆర్ బిజెపి తీరును, మోడి తీరును తీవ్రంగా ఎండగట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చి నాగర్‌కర్నూల్‌లో చెప్పింది ఏమిటని ప్రశ్నించారు. చట్టం ప్రకారం అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడి సర్కార్ తెలంగాణ పట్ల వివక్షపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. కొత్త రాష్ట్రం అవసరాలను గుర్తించి పథకాలను నిధులను కేటాయించాలని వందల లేఖలు రాసినా మోడి సర్కార్ పట్టించుకోలేదని కెసిఆర్ అన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణకు ఒక్క నవోదయ కళాశాల కూడా మంజూరు చేయలేదన్నారు. తాము ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలు తప్ప కేంద్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను సైతం ఏర్పాటు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. బిజెపికి తెలంగాణ బిడ్డలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. యువత ఆలోచన చేయాలని మోడి మాయమాటల్లో పడి తెలంగాణకు నష్టం చేసుకోవద్దని బిఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని యువతకు పిలుపునిచ్చారు.

= తల తెగిపడ్డా రైతుల మోటర్లకు మీటర్లు పెట్టనన్నా ..
కేంద్రంలోని మోడి సర్కార్ తెలంగాణలోని రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని తమపై ఒత్తిడి తెచ్చినా తల తెగి పడ్డా రైతుల మోటర్లకు మీటర్లు పెట్టబోనని తెగించి చెప్పానని కెసిఆర్ అన్నారు. రూ. 500 కోట్ల గ్రాంట్ కట్ చేస్తానని చెప్పినా రైతుల క్షేమం కోసం మీటర్లు పెట్టే ప్రక్రియను ఒప్పుకోలేదని అన్నారు. యువకులు, రైతులు ఆలోచించాలని, మోసపూరితమైన మాటలకు పోతే మన బ్రతుకులు ఆగమవుతాయని ఆయన అన్నారు. గ్రామ గ్రామానికి వెళ్లి యువకులు బిఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయాలో చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు.

=బతుకులు ఆగం చేసేటోడా…బ్రతుకులు కాపాడేటోడు కావాలా…?
తెలంగాణ ప్రజల బతుకులు ఆగం చేసేవారు కావాలా లేదా మన బతుకులు కాపాడేటోడు కావాలో ఆలోచన చేయాలని ప్రజలను కెసిఆర్ కోరారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను పదేళ్లలో నిర్మించుకున్నామని తిరిగి ఆగం చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ఆలోచించేది, తెలంగాణ కోసం పుట్టింది గులాబీ జెండా అన్నది గుర్తించుకోవాలన్నారు. మన కోసం మన పార్టీలు కావాలే తప్ప మనలను ఆగం చేసేటోడు వద్దన్నారు.

= ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా ఇవి ..
తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన స్థాయికి తగ్గి మాట్లాడడం సమంజసం కాదని కెసిఆర్ అన్నారు. ‘కెసిఆర్ నీ గుడ్లు పీకి గోటీలు ఆడుతా, నీ పంచె ఊడదీస్తా ’ అని మాట్లాడే మాటలు సిఎంకు తగవన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా, తెలంగాణ తెచ్చిన కెసిఆర్‌ను అట్లా మాట్లాడవచ్చా అని ఆయన ప్రశ్నించారు. ఎవరి మాట తీరు ఏదో ప్రజలు గుర్తిస్తున్నారన్నారు.

= మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ రెండు ఎంపిలు గెలుస్తున్నాం
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ రెండు పార్లమెంట్ స్థానాలలో తమ పార్టీ ఎంపిలు గెలవబోతున్నారని, ఈరోజు తమకు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారమని కెసిఆర్ అన్నారు. ప్రజలు బిఆర్‌ఎస్ వైపు ఉన్నారన్నది స్పష్టమవుతోందన్నారు. కిలోమీటర్ల కొద్ది తన రోడ్ షోకు బస్సు కదలకుండా జనం కదిలివచ్చారంటే నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌లలో బిఆర్‌ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవబోతున్నారనడానికి సంకేతమన్నారు.

= ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నిబద్ధత గల నాయకుడు
నాగర్‌కర్నూల్ బిఆర్‌ఎస్ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నత విద్యావంతుడని, ఐపిఎస్‌గా ఉండి తెలంగాణ గురుకులాలను తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి అని కెసిఆర్ అన్నారు. ఐపిఎస్ హోదాలో తెలంగాణ గురుకులాలను దేశంలోనే ఆదర్శంగా నిలిచారని ఎవరెస్ట్ శిఖరాలను గురుకులాల బిడ్డల ద్వారా అధిరోహించి ఆ రికార్డు నేటికీ బద్ధలు కాకుండా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆయన పనితీరును చూసి సిఎంగా తాను గురుకులాలలో ఇంటర్, డిగ్రీ స్థాయికి తీర్చిదిద్దే విధంగా సర్వ హక్కులు ఇచ్చానని అన్నారు. నాగర్‌కర్నూల్ ఎంపిగా గెలిపిస్తే ఢిల్లీలో మీ గొంతుకగా సంక్షేమం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం 7 నియోజకవర్గాల ప్రజల కోసం కష్టించి పనిచేసే వ్యక్తిని పార్లమెంట్‌కు పంపినవారు అవుతారన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విజన్ ఉన్న నాయకుడని ఈ ప్రాంతం పట్ల దేశం పట్ల అపారమైన గౌరవం, దీక్ష కలిగిన వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు.

= మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది…
తెలంగాణలో మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోందని కెసిఆర్ జోస్యం చెప్పారు. ప్రజల్లో బిఆర్‌ఎస్ పట్ల ఉన్న ఆదరణను చూస్తుంటే రాబోయేది మన ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నానన్నారు. 4 నెలల కాంగ్రెస్ పాలనతో జనాలకు అర్థమైపోయిందని కెసిఆర్ అన్నారు. కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో ధర్మమే గెలుస్తుందని, ఇది ముమ్మాటికి నిజమని కెసిఆర్ అన్నారు.

= నన్ను గెలిపించండి మీలో ఒకడిగా సేవ చేస్తా ః ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
నాగర్‌కర్నూల్ ఎంపిగా తనను గెలిపించాలని మీలో ఒకడిగా ఉండి సేవ చేస్తానని నాగర్‌కర్నూల్ బిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ ప్రాంతం బాగు పడాలంటే తనకు ఓటు వేయాలని అహర్నిశలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ హక్కుల కోసం నాగర్‌కర్నూల్ పార్లమెంట్ బిడ్డల కోసం పనిచేస్తానని అన్నారు. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడు తనకు ఉండాలని కోరుకుంటున్నానని, మీ ఉత్సాహం బట్టి చూస్తే తన గెలుపు ఎప్పుడో ఖాయమైందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గద్వాల ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎంఎల్‌ఎ విజేయుడు, మాజీ ఎంఎల్‌ఎలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి, సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News