ద్రోహులకు దడపుట్టేలా తెలంగాణ తెగువ చూపుదామని.. గులాబీ హోరెత్తించి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పుదామనిబి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ రజతోత్సవం తెలంగాణ ఇంటి పండుగ అని పేర్కొన్నారు. కుంభమేళా తరహాలో నిర్వహిస్తున్న ఈ వేడుకకు ప్రతి ఇంటి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్ రజతోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్‌లో రూపొందించిన కెసిఆర్ సైకత శిల్పాన్ని శుక్రవారం బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ఎంఎల్‌సి కవిత ఆవిష్కరించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ రవీందర్ యాదవ్ ఈ సైకత శిల్పంలో బిఆర్‌ఎస్ పార్టీ చీఫ్ కెసిఆర్ చిత్రం, ఛలో వరంగల్ అంటూ పిలుపునివ్వడం.. బిఆర్‌ఎస్ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించిన వివరాలన్నీ పొందుపరిచారు. సైకత శిల్పం రూపొందించిన రవీందర్ యాదవ్‌ను కవిత అభినందించారు. ఈ సైకత శిల్పానికి సంబంధించిన వీడియోను రవీందర్ యాదవ్‌తో కలిసి కవిత విడుదల చేశారు. పార్టీ ప్రస్థానం మొత్తం వివరించేలా సైకత శిల్పం బాగుందని.. పూరీ బీచ్‌లో ప్రముఖ సైకత శిల్పుల ఆధ్వర్యంలో దీనిని రూపొందించడం అభినందనీయమని అన్నారు.