Thursday, January 23, 2025

ఆలస్యం వద్దు.. హస్తిన వైపు అడుగేయండి

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి

బిజెపి దుష్ట పాలనకు ఆయనతోనే విరుగుడు మత రాజకీయాలు, దళితులపై
దౌర్జన్యాలు పెరిగిపోయాయి దేశంలో మోడీ మోసాలు, అమిత్ షా ఆగడాలు
ఎక్కువయ్యాయి జాతి శ్రేయస్సు కోసం కెసిఆర్ ప్రధాని కావాలి.. బంగారు
భారత్‌గా తీర్చిదిద్దాలి పివి తరహాలో సమర్థ నాయకత్వం, శక్తి సామర్థాలు
ఆయనలో పుష్కలం సిఎం పిలుపునిస్తే ఏ త్యాగాలకైనా సిద్ధం సంఖ్యా
బలం కాదు.. సంకల్ప బలం ముఖ్యం కార్మిక, కర్షక వర్గాలు కెసిఆర్‌ను
ముక్తకంఠంతో ఆహ్వానిస్తున్నాయి టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుల ఏకగ్రీవ విజ్ఞప్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే….జాతీయ పార్టీ పెట్టాల్సిందేనని రాష్ట్రంలోని అన్ని జిల్లాల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. ఆయన వస్తేనే దేశానికి సరికొత్త దశా, దిశను చూడగలుగుతామన్నారు. ఆయన రాకకోసం యావత్ దేశ ప్రజలు సైతం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. అప్పుడే దేశానికి పట్టిన బిజెపి దుష్టపాలన విరగడ అవుతుందన్నారు. అది ఒక్క కెసిఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. ఆయన నేతృత్వంలోనే దేశం బంగారు భారత్‌గా తీర్చిదిద్దేందుకు సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిష్ట సమయంలో… మార్పు కోసం కెసిఆర్ క్రియా శీల పాత్ర పోషించాలన్నారు. చీకటి మయం అవుతున్న భారత్‌లో ఆయన కాంతి రేఖలు వేదజల్లాలని అభిలాషించారు.

శుక్రవారం తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్ పార్టీల జిల్లాల అధ్యక్షులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలోని అన్ని వ్యవస్థలను నాశనం పట్టిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని సాధ్యమైనంత త్వరగా ఇంటికి పంపాల్సిన అవసముందన్నారు. అందుకు కెసిఆర్ వంటి నాయకత్వం దేశానికి చాలా అవసరమని పేర్కొన్నారు. కెసిఆర్… ఆగే బడో, హమ్ తుమారా సాత్ హై అంటూ వారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మోడీ మోడల్ అంబానీ ఆదానీలకు ఉపయోగ పడేది తప్ప దేశానికి ఉపయోగపడేది కాదని వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కెసిఆర్ నినాదం జై జవాన్… జై కిసాన్ అని వ్యాఖ్యానించారు.

ఆయన మాట్లాడే ప్రతి మాటను…చెబుతున్న ప్రతి అంశాన్ని దేశ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం కోసం, కార్మిక వర్గం కోసం జాతీయ రాజకీయాల్లోకి రావాలని ముక్త కంఠం తో కోరుకుంటోందన్నారు. దేశాన్ని పివి తరహాలో సమర్ధంగా నడిపించే శక్తి సామర్ధ్యాలు ఆయనకు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఇక కెసిఆర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నారు. ప్రస్తుతందేశంలో మత రాజకీయాలు పెచ్చు మీరుతున్నాయన్నారు. అలాగే దళితులపై దాడులు పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దౌర్జన్యాల నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కెసిఆర్ వెంటనే జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నారు.

ముందుగా రాష్ట్ర ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్కసుమన్ మాట్లాడుతూ, భారత్‌దేశం కెసిఆర్ లాంటి విజన్ ఉన్న నేత చేతిలో ఉండాలన్నారు. దీని కోసం ఎలాంటి టాస్క్ ఇచ్చినా….దానిని సమర్థవంతంగా నెరవేర్చడానికి జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షులంతా సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయనకు ఒక పిలుపు ఇస్తేచాలు….ఎంతటి త్యాగాలకైనా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికైనా తాము రెఢీగా ఉన్నామన్నారు. కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అన్ని రంగాల్లో దూసుకపోతున్నదన్నారు. అలాగే దేశానికి ఆయన నాయకత్వం వహిస్తే….భారత్ కూడా ప్రపంచ దేశాలకే దిక్సూచిగా మారుతుందన్న విశ్వాసాన్ని బాల్కసుమాన్ వ్యక్తం చేశారు. కెసిఆర్ ఉద్యమదక్షుడు ….పాలనా దక్షుడన్నారు. పైగా పేదలకు సంపూర్ణంగా మేలు చేయాలన్న గట్టి సంకల్పం ఉన్న నేత అని ఆయన వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్లుగా దేశంలో ప్రధాని నరేంద్రమోడీ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంలోని బిజెపి పాలనలో దేశంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. మోడీ పాలన అంతా కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికే ఉపయోగపడుతోందని మండిపడ్డారు. దేశాన్ని ఆయన వందేళ్లు వెనకకు తీసుకెళ్లారని బాల్కసుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ తరుణంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని ఏకోన్ముఖంగా వినిపిస్తున్న మాట అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని వర్గాలు…. మేధావులు, వివిధ పార్టీల నేతలు కెసిఆర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. అందువల్ల జిల్లా అధ్యక్షులుగా తామంతా కెసిఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ దేశంలోనూ అమలు జరగాలని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ మోడల్ దేశానికి అవసరమన్నారు. కాగా రాహుల్ యాత్రపై స్పందించిన బాల్కసుమన్… ఆయన యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అదొక పాత చింతకాయ పచ్చడిగా అభివర్ణించారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.

గొప్ప వనరులున్న దేశానికి అసాధారణ తెలివి తేటలున్న కెసిఆర్ నాయకత్వం చాలా అవసరమని కావాలని పియుసి చైర్మన్, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి అన్నారు. జాతీయ సంపదను పేదలకు పంచిపెట్టాలంటే దేశానికి వంటి నాయకుడు కావాలన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడంతో కూడా ఆయనతోనే సాధ్యమవుతుందన్నారు. సంఖ్యా బలం ముఖ్యం కాదు…. సంకల్ప బలం ముఖ్యమన్నారు. అది కెసిఆర్‌లో పుష్కలంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం ఆయన సంకల్పంతో మొదలైందని… ప్రస్తుతం దేశ పునర్నిర్మాణం కూడా సంకల్పంతోనే సాధ్యమవుతుందన్నారు. అందుకే మునుగోడు సభ నుంచి నిజామాబాద్ సభ దాకా ప్రజలు కెసిఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నారన్నారు.
దేశంలో మోడీ మోసాలు… అమిత్ షా ఆగడాలు పోవాలంటే కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందేనని మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపి మాలోత్ కవిత అన్నారు. దేశంలోని ఆదివాసీలు, గిరిజనులు ఆయన నాయకత్నాన్ని కోరుకుంటున్నారన్నారు.

దేశంలోని దొంగల భరతం పట్టాలంటే కెసిఆర్ ఢిల్లీకి రావాలని సూర్యపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు లింగయ్య యాదవ్ అన్నారు. కాగా కెసిఆర్ విజన్ దేశానికి అవసరమని హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గువ్వల బాలరాజు, జయశంకర్ భూపాల పల్లి జిల్లా పార్టీఅధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చింతా ప్రభాకర్, పెద్దపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజీబ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి, రాజన్న సిరిసిల్లా జిల్లా పార్టీతోట ఆగయ్య, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధు, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు, కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణ రావు, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా 21మంది జిల్లా అధ్యక్షులు పాల్గొని కెసిఆర్‌ను జాతీయ రాజకీయాల్లో రావాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News