Monday, January 20, 2025

ఉపా చట్టానికి వ్యతిరేకంగా కెసిఆర్ కేంద్రంతో పోరాడాలి: హరగోపాల్

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్  ః ప్రజల హక్కులను హరించివేసే క్రూరమైన ఉపా చట్టాన్ని రద్దు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పోరాడాల్సిన అవసరం ఉందని హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపు నిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఉపా చట్టాన్ని రద్దు చేసేలా ఆయా రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం డిటిఎఫ్ రాష్ట్ర మహాసభల సందర్భంగా కరపత్రం విడుదల కోసం ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఆయన పత్రికా, మీడియాతో మాట్లాడారు. ఉపా చట్టమనేది చాలా క్రూరమైనదని,దీనికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన ఉపా చట్టాన్ని తనతో పాటు మరో ఐదుగురిపై మాత్రమే రద్దు చేసిందని, ఇంకా 152 మందిపై కేసు అలాగే ఉందన్నారు.

ఈ 152 మంది కూడా ఎలాంటి దేశ ద్రోహానికి పాల్పడిన వారు కాదని,వారంతా అమాయకులని చెప్పారు. ఇలాంటి వారిపై ఇంకా ఉపా చట్టాన్ని ప్రయోగించడమంటే ప్రజాసామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. ప్రజాస్వామ్య వాదులు, అన్ని రాజకీయ పార్టీలు కూడా 152 మందిపై ఉన్న ఉపా చట్టాన్ని ఎత్తివేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని, అప్పట్లో ఎవరినైనా ఏ కారణం లేకుండా అరెస్టు చేసి 3 నెలల పాటు ఎలాంటి విచారణ చేయకుండా జైలులో నిర్భంధించవచ్చని,అలాంటిది బిజెపి ప్రభుత్వం దానిని 6 నెలలకు పెంచిందన్నారు. ఎక్కడైనా ఒక వ్యక్తిమీద నేరం రుజువు చేయాలంటే పోలీస్ అధికారులు తగిన సాక్షాలు కోర్టులో ప్రవేశ పెట్టి శిక్ష పడేలా చేయాల్సి ఉంటుందన్నారు.

ఉపా చట్టంలో నేరం మోపబడిన వ్యక్తే తాను నేరం చేయలేదని రుజువు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో జర్నలిస్టు ఒక వార్త సేకరణ కోసం వెళ్తే అతనిపై అకారణంగా రెండు సంవత్సరాలు జైల్లో ఉంచారన్నారు. భీంకోర్‌గావ్ కేసులో సమాజానికి మేలు చేసే మేధావులను,లాయర్లను జర్నలిస్టులను, ప్రొఫెసర్లను అకారణంగా నిర్భంధించారన్నారు. ఇప్పటికీ 5 సంవత్సరాలు దాటినా వారిపై ఇంతవరకు చార్జిషీట్ దాఖలు చేయలేక పోయారన్నారు. ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని రద్దు చేసేలా కేంద్రంపై రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News