మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ప్రజలు
చెబుతున్నారు సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం
చేయాలి.. కూలగొడతామని పిచ్చిపిచ్చిగా
మాట్లాడుతున్నారు ప్రజలను కాపాడాల్సిన
పాలకులే భయభ్రాంతులకు గురి చేస్తారా?
తిట్టడం మాకు కూడా వచ్చు
ఇవాళ మొదలుపెడితే రేపటి వరకు తిడతా
అరెస్టులకు, కేసులకు భయపడేదిలేదు బిఆర్‌ఎస్
నాయకులు హైరానా పడొద్దు ప్రజలు బాధ్యత
ఇస్తే.. చిత్తశుద్ధితో సేవ చేయాలి కాంగ్రెస్
ప్రభుత్వంపై విరుచుపడిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోందని, అంతలోనే ఏం కోల్పోయారో తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చిందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మళ్లీ గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు చెబుతున్నారని ఉద్ఘాటించారు. సిద్దిపేటలో పాలకుర్తి నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ నేతలతో శనివారం కెసిఆర్ సమావేశమయ్యారు.సినీ నిర్మాత శ్రీనివాస్‌రెడ్డి, సినీ నటుడు రవితేజ బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కెసిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, మళ్లీ గులాబీ దళమే తెలంగాణలో అధికారానికి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గులాబీ నేతలు హైరానా పడాల్సిన అవసరం లేదని అన్నారు. సమాజాన్ని నిలబెట్టి, నిర్మాణం చేయాల్సిన రాష్ట్ర సర్కార్.. కూలగొడతామని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతోందని మండిపడ్డారు. తిట్టడం మాకు కూడా వచ్చు…ఇవాళ మొదలు పెడితే రేపటి వరకు తిడతా అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలను కాపాడాల్సింది పోయి, భయపెడతారా..? అని నిలదీశారు.
అక్రమ కేసులు ఎన్ని పెట్టిన భయపడాల్సిన పని లేదని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. అరెస్టులకు, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.కేసులపై న్యాయపరంగా పోరాడుదామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అందరూ కష్టపడి పని చేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ప్రజలు బాధ్యత ఇస్తే, అంతే బరువుతో సేవ చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో.. ఏం చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కెసిఆర్ మండిపడ్డారు. గతంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే 90 శాతం ఎక్కువే చేశామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడుతున్నారో అందరూ చూస్తున్నారని చెప్పారు. పాలన అంటే ఒట్టి మాటలతో నడిచేది కాదని అన్నారు. అధికారంలోకి రాగానే వాణ్ణి లోపల వేయాలి.. వీన్ని లోపల వేయాలని బిఆర్‌ఎస్ చూడదని పేర్కొన్నారు. అది చేస్తాం.. ఇది చేస్తామని పిచ్చి మాటలు తమకు రావా..? అని అడిగారు. ప్రజలు మీకు బాధ్యత ఇచ్చింది సేవ చేయడానికా..? లేక మాటలతో కాలయాపన చేయడానికా..? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తూర్పారబట్టారు.
త్వరలో పాలకుర్తికి వస్తా
ఇటీవల పాలకుర్తిలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన గిరిజన యువకుడు శ్రీనివాస్ ఇంటికి త్వరలోనే వస్తానని కెసిఆర్ ప్రకటించారు. శ్రీనివాస్ కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.