Tuesday, December 24, 2024

ఎందుకీ దుస్థితి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/సూర్యాపేట : అసమర్థ, అవివేక, తెలివి త క్కువ, కాంగ్రెస్ పాలకుల వల్లే ఈ దుస్థితి వచ్చిందని మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. టెక్నోక్రాట్ల స్థానంలో ఐఎఎస్‌లను తెచ్చిపెట్టారని వివరించారు. ఇది పాలకుల అసమర్థతా కాదా? అన్నది ప్రజలు ఆలోచించాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను ఆదివారం పరిశీలించిన ఆయన సూ ర్యాపేటలోని ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మా పాలనలో అద్భుతంగా నడిచిన వ్యవస్థ ఇప్పుడు ఎందుకు హఠాత్తు గా ఆగిపోయిందని ప్రశ్నించారు. తమ హయాంలో రైతుబంధు సకాలం లో రైతులకు అం దేదని పేర్కొన్నారు. రైతుబంధు విషయంలో కాంగ్రెస్ పాలకులు అనుమానాలకు తావిచ్చారు, 15 లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని తెలి పారు. పంటలు ఎండని జిల్లా అంటూ రాష్ట్రంలో లేదని, కానీ మంత్రులు కనీసం సమీక్ష కూడా చేయలేదని దుయ్యబట్టా రు. తాము అధి కారంలో ఉండగా ఒక్క ఎకరా ఎండి పో కుండా కా పాడుకున్నామన్నారు. మొన్నటి వరకూ కాలిపోని మోటార్లు ఇప్పుడు ఎందుకు కాలిపోతున్నా యని ప్రశ్నించారు.

రైతుల పక్షాన మాట్లాడే వాళ్లు లేరనుకుంటున్నారా? అని కెసిఆర్ ఆగ్రహం కనబర్చారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. పంట ఎండిపోతున్నా లక్షల ఎకరాల పంట ఎండిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. ప్రభుత్వాన్ని ఛేజ్ చేస్తా నని, పరిగెత్తిస్తానని హెచ్చరించారు. ప్రాజెక్టులు కొట్టుకుపోయాయంటూ డ్రామాలాడుతున్నారని, కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా? అని ప్రశ్నిం చారు. తాము పదేళ్లు అధికారంలో ఉండగా అభివృద్ధి పై దృష్టిపెట్టాము తప్పించి కక్ష సాధింపు చర్యలకు దిగలేద న్నారు. రాత్రింబవళ్లూ కష్టపడి కరెంటు తెచ్చామని, నీళ్లు తెచ్చామని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ఏమయిందని ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాలన్నారు. రైతులకు వెంటనే రుణమాఫీ చేసి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలన్నారు. రైతులను తాను ఒకటే కోరుతున్నానని ఆత్మహత్యలు చేసుకోవద్దని, మీ పక్షాన తాము ఉన్నామని ఆయన భరోసా ఇచ్చారు. ఏమీ ఇబ్బంది పడాల్సిన పనిలేదని, తాము ఈ ప్రభుత్వాన్ని వదిలపెట్టే ప్రశ్నేలేదని, వాళ్లని నిద్రపోనివ్వమని ఆయన వెల్లడించారు.

కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతుల ఆత్మహత్యలు –
తెలంగాణలో అన్నదాతలు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అంతా ఆలోచించాలని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. ’కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న తెలంగాణకు స్వల్ప కాలంలోనే ఈ దుస్థితి ఎందుకు రావాలి.?. సాగునీళ్లు ఇస్తారని నమ్మి రైతులు పంటలు వేసుకున్నారని ముం దే చెబితే వేసుకునే వాళ్లం కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇంత కష్ట కాలం వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.’ అని కెసిఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

’పదేళ్లలో రైతుల అనుకూల విధానాలు’
పదేళ్ల్ల బిఆర్‌ఎస్ పాలనలో రైతుల అనుకూల విధానాలు చేపట్టామని, వ్యవసాయాన్ని అద్భుతమైన దశకు తీసుకెళ్లామని కెసిఆర్ అన్నారు. ’రైతు బంధు పేరిట పెట్టుబడి సాయం అందించాం. సకాలంలో అన్నదాతలకు సాగునీరు అందించాం. పండిన ప్రతి గింజను కొన్నాం. ధాన్యం దిగుబడిలో పంజాబ్ ను దాటేశాం. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. మా హయాంలో తాగునీటి సమస్యను పక్కా ప్రణాళికతో అధిగమిం చాం. ప్రపంచం మెచ్చిన మిషన్ భగీరథ నిర్వహణలో లోపాలెందుకు వస్తున్నాయి.?. బీఆర్‌ఎస్ హయాంలో రోడ్లపై బిందెలు పట్టుకుని ఏ ఆడబిడ్డా కనిపించలేదు. ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు సైతం కనిపించలేదు. నేడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. భాగ్యనగరంలో కూడా నీళ్లు ట్యాంకర్లు ఎందుకు కనిపిస్తున్నాయి.?. ఎన్నో సమస్యలు అధిగమించి రైతులు, గృహ అవసరాలకు నిరంతరం కరెంట్ సరఫరా చేశాం

. అప్పట్లో కరెంట్ పోతే వార్త. ఇప్పుడు మాత్రం ఉంటే వార్త. అగ్రగామిగా ఉన్న రాష్ట్రానికి ఎందుకు చెదలు పట్టాయి.?. ప్రభుత్వ అసమర్థత వల్లే.. మళ్లీ జనరేటర్లు, ఇన్వెర్టర్లు వస్తున్నాయి. రాత్రింబవళ్లు కొట్లాడి నేషనల్ పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేయించాం. ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. 7 వేల మెగా వాట్ల స్థాపిత సామర్థ్యాన్ని 18 వేల మెగావాట్లకు పెంచాం. ఇప్పుడు రామగుండం నుంచి తాజాగా 1600 మెగావాట్ల సామర్థ్యం కూడా అదనంగా వచ్చింది. యాదాద్రిని ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కానీ లేకుంటే అది కూడా పూర్తయ్యేది. గత 8 ఏళ్లుగా బోరు బండ్లు బంద్ అయితే, ఇప్పుడు పల్లెల్లో బోర్ల హోరు వినిపిస్తోంది. ఇప్పటికీ సాగర్‌లో 14 నుంచి 15 టిఎంసిల నీరు వాడుకునే అవకాశం ఉంది.’ అని కెసిఆర్ వెల్లడించారు.

సిఎం రేవంత్ పై విమర్శలు
కేంద్ర మంత్రులు తియ్యగా మాట్లాడితే కెఆర్‌ఎంబికి అంతా అప్పగించేశారని, ఈ ముఖ్యమంత్రికి రైతుల బాధ పట్టదని, ఢిల్లీ యాత్రలే సరిపోతు న్నాయని కెసిఆర్ ఎద్దేవా చేశారు. ’ఒక్కరినో.. ఇద్దరినో మీవైపు గుంజుకుని ఆహా ఓహో అనొద్దు. అధికారం వస్తుంటుంది. పోతుంటుంది. బిఆర్ ఎస్ సముద్రమంత పార్టీ. ప్రభుత్వం మారిన నాలుగో నెల వరకూ నేను ఏమీ మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు లక్షల ఎకరాలు ఎండుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. వాగ్దానాలు అమలు చేయకుంటే మిమ్మల్ని నిద్రపోనివ్వం. డిసెంబర్ 9 నాటికి రుణాలన్నీ మాఫీ చేస్తామన్న సిఎం ఏరీ.?. పోలీసులకు నా విజ్ఞప్తి ఒక్కటే. మీరు అతిగా పోవొద్దు. మేమూ ఇలాగే చేసుంటే కాంగ్రెస్ పార్టీ ఉండేదే కాదు. రైతులకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు.’ అని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.

ఏప్రిల్ 6న నిరసన దీక్షలు
అన్ని పంటలకు రూ.500 బోనస్ డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 6న రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్ శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు కెసిఆర్ వెల్లడించారు.
రైతులకు ప్రతి ఎకరాకు రూ.25వేలు పరిహారం ఇవ్వాలి
ఎండిపోయిన పంటలకు ప్రతి ఎకరానికి రూ.25వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ డిమాండ్ చేశారు. ఈ నష్టపరిహారం ఇచ్చేదాకా వేటాడుతాం.. వెంటాడుతాం.. ధర్నాలు చేస్తామని వెల్లడించారు. అవసరమైతే ఎక్కడికక్కడ గ్రామాల్లో మీ ఎంఎల్‌ఎలు, మంత్రులను నిలదీస్తామని స్పష్టం చేశారు. ఒకప్పుడు పంటలు నష్టపోతే కేంద్రానికి నివేదిక పంపించాల్సి ఉండేది.. మూడు నెలల తర్వాత అధికారులు వచ్చి పరిశీలించి, రిపోర్టు రాయాలి, అయినా రైతులకు పరిహారం అందే పరిస్థితి ఉండేది కాదన్నారు. అందుకే ఆనాడు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని మార్చేశా అని వెల్లడించారు. భయంకరమైన రాళ్ల వాన పడి మహబూబాబాద్, ఖమ్మం, ఇలా చాలా జిల్లాల్లో పంట నష్టం జరిగితే స్వయంగా వెళ్లి పరిశీలించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడప్పుడే రైతులు బలపడుతున్నరు కాబట్టి వాళ్ల పరిస్థితి దిగజారవద్దని, చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఎకరానికి 10వేలు నష్టపరిహారం ఇచ్చా అని వెల్లడించారు.

నష్టపోయిన ఆ పొలంలోనే నిల్చుండి ప్రకటించడమే కాకుండా ఐదారు రోజుల్లోనే నష్టపరిహారం అందించానన్నారు. ఆనాడు దాదాపు 500 కోట్లను రైతులకు అందించామని చెప్పారు. అదే ఇవాళ రాళ్ల వాన పడితే అడిగే దిక్కులేదని మండిపడ్డారు. అకాల వర్షాలు పడి సుమారు లక్ష ఎకరాల్లో పంటలు ఎండిపోతే దాని గురించి మాట్లాడే దిక్కే లేదన్నారు. ఓ ఎమ్మెల్యే పోడు.. మంత్రి పోడు.. ముఖ్యమంత్రికి అయితే ఢిల్లీ యాత్రలతోనే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఏదేమైనా సరే, రణరంగమైనా సరే, ఈ ప్రభుత్వం మెడలు వంచి పరిహారం ఇప్పిస్తామని చెప్పారు. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయిన నాడు కూడా 470 కోట్ల బకాయిలు పెట్టిపోతే, మేం ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చామని తెలిపారు. అదే ఈనాడు తాము ఏ బకాయిలు పెట్టలేదన్నారు. 50 ఏండ్ల కాంగ్రెస్, టిడిపి పరిపాలనలో ఏనాడు ఇవ్వని 10వేలు నష్టపరిహారం అందిస్తే ఆనాడు దాన్ని ఎకసెకం చేసి మాట్లాడారని మండి పడ్డారు. 10 వేలు ఏమూల సరిపోద్ది, 20 వేలు ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ నాయకులు అన్న మాటలను గుర్తు చేశారు. మరి ఇవాళ ఏడ పడుకున్నరు, తలకాయ ఏడ పెట్టుకున్నారని నిలదీశారు.

గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నరా? వీళ్లు రైతులు కాదా? ప్రజలు కాదా? వీళ్ల గురించి పట్టింపు లేదా? అని మండిపడ్డారు. ప్రజల తరఫున మాట్లాడేటోళ్లు లేరని అనుకుంటున్నారా? ఒక మహాసముద్రం అంత బిఆర్‌ఎస్ పార్టీ ఉంది.. ఊరుకోదని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వందకు వంద శాతం రైతుల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పంటలను మీరే ఎండబెట్టిర్రు కాబట్టి, మీ అసమర్థత వల్లే ఎండిపోయినయి కాబట్టి నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని వెల్లడిం చారు. వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి ఎన్యుమరేట్ చేయాలని సూచించారు. ఏ జిల్లాల్లో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ రైతు పంట ఎంత ఎండిపోయిందనే లెక్కలు తీయాలని అన్నారు. ధరలు అన్నీ పెరిగినయ్ కాబట్టి.. ఎకరాకు రూ.25వేలు నష్టపరిమారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం ఇచ్చే దాకా వేటాడుతాం వెంటాడుతాం.. ధర్నాలు చేస్తామని మాజీ సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు.

మళ్లీ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్..? నీటిమోతలెందుకు ?
మళ్లీ బిందెలు ఎందుకు ప్రత్యక్షమవుతున్నయ్ ? ఎందుకు నీటిమోతలు స్టార్ట్ అయ్యాయంటూ రేవంత్‌రెడ్డి సర్కారుని మాజీ సిఎం కెసిఆర్ నిలదీశారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్ పాలనలో అద్భుతంగా మారి, ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థాయికి చేరుకొని ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి ? దీనికి కారణం ఏంటీ. ప్రపంచ దేశాలు, యూఎన్‌ఓ, 15-16 రాష్ట్రాలు కొనియాడి అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ. రాష్ట్రంలో ఎందుకు మంచినీళ్ల కొరత రావాలి ? చీఫ్ సెక్రెటరీ స్టేట్‌మెంట్‌లో సోర్సెస్ అన్నీ బారాబరి ఉన్నయ్.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అద్భుతంగా ఉండవచ్చని చెబుతున్నరు’ అని అన్నారు. ‘హైదరాబాద్ సిటీలో ఒక రూపాయికే నల్లా కన్షెన్ ఇచ్చి.. 20వేల లీటర్ల ఫ్రీ నీరు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంట్లో నల్లాపెట్టి నీరిచ్చాం. దీనికి జర్నలిస్టులే సాక్షి. దానిలో ఎందుకు లోపం వస్తుంది. ఏంది కారణం ? మేం అసెంబ్లీలో ఛాలెంజ్ చేశాం. నేను స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ టర్మ్‌లోగా భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని, ఓట్లు అడగదని ఛాలెంజ్‌గా చెప్పి పథకాన్ని పూర్తి చేశాం.

ఆ తర్వాత ఐదేళ్లు బ్రహ్మాండంగా నడిపాం. బిందెపట్టుకొని ఆడబిడ్డ ఎక్కడా రోడ్డుపై కనిపించలేదు. అన్నీ మామయ్యాయి. మంచినీళ్లు ట్యాంకర్లు ఐదుసంవత్సరాల్లో కనిపించలేదు. ఎందుకు మళ్లీ బిందెలు ప్రత్యక్షమవుతున్నయ్ ? ఎందుకు నీటిమోతలు స్టార్ట్ అయ్యాయి. నీళ్ల ట్యాంకర్లు ఎందుకు విచ్చలవిడి వ్యాపారం చేస్తున్నయ్. హైదరాబాద్ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తుంది ? ఇవీ ఆలోచించాల్సిన విషయాలు’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒకటింబావు సంవత్సరంలో చాలా దారుణంగా ఉన్న విద్యుత్ రంగాన్ని సుమారు రూ.35వేలకోట్లు ఖర్చు చేసి రకరకాల పద్ధతులు అవలంభించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని సంప్రదించి మెదడును కరుగదీసి విద్యుత్ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. భారతదేశంలో అన్నిరంగాలకు 24గంటలు ఒక సెకండ్ కరెంటుపోకుండా ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానిది. మీరు అందరూ అనుభవించారు. నాడు కరెంటు పోతే వార్త.. ఈ రోజు కరెంటు ఉంటే వార్త అనేకాడికి వచ్చింది. విద్యుత్ అనేది చిన్న విషయం కాదు. నోటిమాటలు, పిట్టకథలు కాదు కదా. అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది.. ఏడున్నర, ఎనిమిదేళ్లు అద్భుతంగా ప్రజలకు సరఫరా చేశాం.

ప్రజలకు, పరిశ్రమలు, వ్యవసాయానికి, ఐటీకి, ఇతర రంగాలకు 24/7 కరెంటు సరఫరా చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ’ అని గుర్తు చేశారు. ‘ఒక అగ్రగామి రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది ఇయ్యాల. వంద రోజుల్లో ఇంత అస్తవ్యస్తం ఏందీ? దీంట్లో ఉన్న తమషా ఏందీ ? కొత్తగా నడిపించేది ఏమీ లేదు.. కొత్తగా మొద్దులు మోసేది లేదు.. కట్టెలు కొట్టేది లేదు. ఉన్న కరెంటును, మిషన్ భగీరథను వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చే హైదరాబాద్ నీళ్లు లేవు. మళ్లీ వాటర్ బిల్స్, ట్యాంకర్ల వ్యాపారం జరుగుతుంది. కొనలేక జనం చస్తున్నరు. మళ్లీ జనరేట్లర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నయ్. మళ్లీ స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది’ అంటూ కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కెసిఆర్ ప్రెస్‌మీట్‌లో పవర్ కట్..!
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌సిల మీటింగ్‌ల్లో కూడా పవర్ కట్స్ చూస్తూనే ఉన్నాం. తాజాగా బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రెస్‌మీట్‌లోనూ ఇదే రిపీట్ అయ్యింది. కెసిఆర్ మాట్లాడుతుండగా కరెంటు పోయింది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఆదివారం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. అనంతరం సూర్యాపేట జిల్లాలో ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఇలా కెసిఆర్ ప్రసంగం మొదలయ్యిందో లేదో కరెంటు పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కరెంటు రావడంతో ఇట్ల కరెంటు పోతా వస్త ఉంటది అంటూ సెటైర్ వేశారు. కెసిఆర్ అన్న మాట వినగానే సభ నవ్వులతో నిండిపోయింది. కరెంటు కోతలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అని కెసిఆర్ అన్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News