Wednesday, January 22, 2025

ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డయ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి అంటే మహావృక్షమని ఆ పార్టీ అధినేత, మాజీ ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. అ సెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కొంత నైరాశ్యంలో ఉ న్నామని, కానీ ఆ తర్వాత బస్సుయాత్ర మొదలుపెట్టగానే మళ్లీ అదే గర్జన కనిపించిందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు. కొందరు బిఆర్‌ఎస్‌ను ఖతం చేస్తం అంటున్నరని, 25 ఏళ్ల ప్రస్థానమున్న బిఆర్‌ఎస్‌ను ఖతం చేయడం ఎవరివల్లా కా దని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవ లం 1.08 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని చె ప్పారు. తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, అమరవీరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, ఈరోజు గొప్ప ఉద్విగ్నమైన క్షణమ ని కెసిఆర్ అన్నారు. తెలంగాణ అంశం హాస్యాస్పదంగా ఉండేదని, గతంలో చాలామంది ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. గతంలో తెలంగాణ అనే పదాన్నే పలకవద్దని స్పీకర్ అసెంబ్లీలో అన్నారని గుర్తు చేశారు. రాజకీయం నిరంతర ప్రవాహం అని, అధికారంలో ఉంటేనే రాజకీయం కాదు అని చెప్పారు. ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం అని పేర్కొన్నారు. లైన్‌మెన్‌లను హరీష్‌రావు పనిచేయ నివ్వట్లేదని సిఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని, అసలు ముఖ్యమంత్రి హరీష్‌రావా..? రేవంత్‌రెడ్డా..? అని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. అనవసరంగా బిఆర్‌ఎస్‌ను ఒడగొట్టుకున్నాం అనే ముచ్చట్లు వస్తున్నాయని, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం గులాబీ పార్టీనే అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. అనుకోకుండా గెలిచిన గెలుపును ఎలా మలుచుకోవాలో కాంగ్రెస్‌కు తెలియట్లేదని చెప్పారు.

ప్రజలకు ఆవేశం వస్తే ఎవరు ఆపినా ఆగరు అని, సమీప భవిష్యత్తులో పాలన బిఆర్‌ఎస్ భుజాలపైనే పడుతుందని అన్నారు. ప్రభుత్వ విజయం ప్రజా విజయం కావాలని వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ హయాంలో అన్నిరంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టామని కెసిఆర్ అన్నారు. దళితబంధు పథకం అతీగతీ లేదు అని మండిపడ్డారు. ఓట్ల కోసం రైతుబంధు ఇవ్వలేదని, చేప పిల్లలు, గొర్రె పిల్లలను పంపిణీ చేస్తే అపహాస్యం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశామని కెసిఆర్ స్పష్టం చేశారు. ఆరు నెలల్లో ఈ ప్రభుత్వం ఒక్క అంశంపైన కూడా విధానం ప్రకటించలేదని విమర్శించారు. అధికారిక చిహ్నం ప్రజల గుండెల్లో ఉంటుందని చెప్పారు. నా ఆయుష్షు ఉన్నంతవరకూ తెలంగాణ కోసమే పనిచేస్తానని కెసిఆర్ పునరుద్ఘాటించారు. గులాబీ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం అని, ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అని పేర్కొన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది
ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది అని, ఈ సమయంలో జయశంకర్‌ను స్మరించుకోకుండా ఉండలేమని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వంటి మనుషులు అరుదుగా ఉంటారని వ్యాఖ్యానించారు. తెలంగాణ భాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందరు హేళన చేశారని పేర్కొన్నారు. అలాగే ముల్కీ నిబంధనల అంశం చాలా ఏళ్లు న్యాయపోరాటంగా మారిందని, ముల్కీ నిబంధనలు సమంజసమే అని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ తీర్పుతో ఆంధ్రాలో జై ఆంధ్రా ఉద్యమం వచ్చిందని కెసిఆర్ గుర్తు చేశారు. ఉమ్మడి ఎపిలో తెలంగాణ వాళ్లను సిఎం కానీయలేదని అన్నారు. ఉమ్మడి ఎపిలో ముగ్గురు తెలంగాణవాళ్లే సిఎంలు అయ్యారని, తెలంగాణవాడు సిఎం కాగానే ఏదో ఒక గొడవ పెట్టి దించేసేవారని చెప్పారు. వ్యూహం లేకపోవడం వల్లే 1969లో ఉద్యమం విఫలమైందని వ్యాఖ్యానించారు. 2001లో కాదు, 1999లోనే ఉద్యమం ప్రారంభమైందని, ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఒళ్లు పులకరిస్తుందని అన్నారు. ఉద్యమం ప్రారంభించగానే పదవులు, పైసలు కోసం మెుదలుపెట్టారనే ప్రచారం చేసేవారని, ఉద్యమం కోసం ఎవరైనా పైసలు అడిగితే తనకు ఫోన్ చేయాలని చెప్పానని పేర్కొన్నారు. ఆఫీసుకు జాగా ఇచ్చారని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం కూలగొట్టారని, ఆఫీసు కోసం తెలంగాణలోనే తెలంగాణ వ్యక్తికి జాగా దొరకని పరిస్థితి ఉండేదని చెప్పారు.

ఎగ్జిట్‌పోల్స్ ఓ గ్యాంబ్లింగ్
ఎగ్జిట్‌పోల్స్ ఓ గ్యాంబ్లింగ్‌లా తయారయ్యాయని కెసిఆర్ విమర్శించారు. ఒక్కోటి ఒక్కోలా లెక్కలు చెబుతున్నారన్నారు. రాజకీయ ఫలితాలు వస్తుంటాయి పోతుంటాయి, గెలుపు, ఓటమి ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో పని చేస్తూనే ఉండాలని పేర్కొన్నారు. ఎగ్జిట్‌పోల్స్‌లో బిఆర్‌ఎస్‌కు 11 వస్తాయని ఒకరూ, ఒక సీటు వస్తాయిని ఒకరు చెప్పారని తెలిపారు. 11 సీట్లు వచ్చినంత మాత్రాన పొంగిపోయేది లేదని 3 సీట్లు వచ్చినా కుంగిపోయేదిలేదని స్పష్టం చేశారు. సిఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్ ఎంఎల్‌సి ఉప ఎన్నికల్లో గెలిచామని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. కానీ 100కు పైగా ఓట్ల మెజార్టీతో బిఆర్‌ఎస్ గెలిచిందని తెలిపారు. ఇక నూతన ఉద్యమ పంథాను ఆవిష్కరించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. రాజకీయ జయాపజయాలు తమకు లెక్కకాదని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News