మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ కక్ష తో తనను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ అంశాల పై విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆక్షేపించారు. గత ప్రభుత్వ విజయాలను తక్కువ చేసి చూపించడానికి ప్రస్తు త ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని పే ర్కొన్నారు. కమిషన్ ఏర్పాటు కూడా చట్టవిరుద్ధమని పేర్కొన్నా రు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అప్పటి రా ష్ట్రప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దు రుద్దేశాలను ఆపాదించారని అసహనం వ్యక్తం చేశారు. విద్యు త్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని ర కాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని తెలిపా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని, కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపుసెట్లు కాలిపోయిన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్ హాలిడే ప్రకటించారని గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదని, తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్ఠానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి కమిషన్‌కు కెసిఆర్ వివరణ ఇచ్చారు. ఈమేరకు శనివారం కెసిఆర్ కమిషన్‌కు సుదీర్ఘంగా 12 పేజీల లేఖ రాశారు.
విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వ్యవధి అడిగితే దయదలిచి ఇచ్చినట్లు కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి మాట్లాడడం బాధ కలిగించిందని కెసిఆర్ పేర్కొన్నారు. విచారణ పవిత్ర బాధ్యత అని అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి, పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాలని తెలిపారు.కానీ గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందనట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్ తీరు ఉందని, విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్లు మాటలున్నాయని అన్నారు. విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదని, కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని తెలిపారు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా
వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డికి కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. కమిషన్ విధివిధానాల్లో లేని అంశాలపై కూడా మాట్లాడడం పరిధి దాటి వ్యవహరించడం, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ధోరణికి నిదర్శనమని కెసిఆర్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డగా జస్టిస్ నరసింహారెడ్డికి అప్పటి విద్యుత్ కోతల పరిస్థితి తెలుసు అని, చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మారడానికి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో ఆయన చూశారని తెలిపారు. రాజకీయ కక్షతో తనను, అప్పటి తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. వాస్తవానికి కమిషన్ పిలుపు మేరకు లోక్‌సభ ఎన్నికల తర్వాత జూన్ 15లోగా తన అభిప్రాయాలు సమర్పించాలని అనుకున్నానని అయితే, విచారణ పూర్తి కాకముందే సంప్రదాయాలకు విరుద్ధంగా జూన్ 6వ తేదీన నిర్వహించిన మీడియా సమావేశంలో తన పేరు ప్రస్తావించారని కెసిఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేంద్రం నుంచి అనుమతులు తీసుకొని ముందుకెళ్లాం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్న విద్యుత్ పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు, ప్రభుత్వ ఆలోచనలు, నిర్ణయాలకు గల కారణాలు సహా అనేక అంశాలను కెసిఆర్ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పనిచేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విజయాలను ఆషామాషీగా సాధించలేదని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తు కొనుగోళ్ల విధానంలో కావచ్చు లేదా రాష్ట్రంలో నూతన విద్యుదుత్పత్తి కేంద్రాలను నెలకొల్పే విషయంలో కావచ్చు..అన్నింటిలో అన్ని రకాల చట్టాలను, నిబంధనలను పాటిస్తూ, కేంద్ర, రాష్ట్ర అనుమతులను సాధిస్తూ, ముందుకువెళ్లామని తెలిపారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ, వీటన్నింటికీ అవసరమైనటువంటి కేంద్ర ప్రభుత్వ,
కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులను పొంది, ముందుకు పురోగమించామన్నారు. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం ఏర్పడిన, న్యాయ ప్రతిపత్తి కలిగిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఎస్.ఇ.ఆర్.సి)ల తీర్పులకు లోబడే అన్ని చర్యలూ తీసుకున్నామని చెప్పారు. ఆ చర్యలపై ఏదేని ఒక వ్యక్తికిగానీ, లేదా వ్యక్తులకుగానీ, సంస్థలకుగానీ అభ్యంతరాలు ఉంటే ఇ.ఆర్.సి.లు నిర్వహించే పబ్లిక్ హియరింగుల్లో తమ ఆక్షేపణలను తెలియజేయవచ్చని, ఏదేని విషయంపై వారి అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఇ.ఆర్.సి. తీర్పు వెలువడినచో వారు ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు అప్పీలు చేసుకోవచ్చని అన్నారు.
టిడిపి ఎంఎల్‌ఎగా రేవంత్‌రెడ్డి ఇఆర్‌సికి అభ్యంతరాలు తెలిపారు
ఛత్తీస్‌ఘడ్ నుంచి రాష్ట్ర విద్యుత్తు సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై నాటి తెలుగుదేశం ఎంఎల్‌ఎ రేవంత్‌రెడ్డి తెలంగాణ ఇ.ఆర్.సి.కి తన అభ్యంతరాలు తెలియజేశారని, ఆయన ఆక్షేపణలను పరిశీలించి, పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే, తెలంగాణ విద్యుత్తు సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఇ.ఆర్.సి. ఆమోదముద్ర వేసిందని కెసిఆర్ గుర్తు చేశారు. అప్పటికీ రేవంత్‌రెడ్డికి తెలంగాణ ఇ.ఆర్.సి. నిర్ణయాలపై అభ్యంతరాలో, ఆక్షేపణలో ఉండి ఉంటే, ఎలక్ట్రిసిటీ అప్పిలేట్ ట్రైబ్యునల్‌కు వెళ్లే అవకాశం, తదనంతరం సుప్రీంకోర్టును కూడా సంప్రదించే స్వేచ్ఛను చట్టం ఆయనకు కల్పించిందని, కానీ ఆయన ఆనాడు ఎలాంటి అప్పీలుకూ వెళ్లిన దాఖలాలు లేవని చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజకీయ మార్పుల కారణంగా రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, అనంతరం గత ప్రభుత్వ విద్యుత్ విజయాలను సాధించిన దురుద్దేశాలను ఆపాదిస్తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేసిందని మండిపడ్డారు.
ఇఆర్‌సి సంస్థలు వెలువరించిన తీర్పులపై విచారణ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయిందన్నారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరమని జస్టిస్ నరసింహారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి, విషయాలను సమగ్రంగా పరిశీలించకుండా పలు అసంబద్ధ వ్యాఖ్యలు చేయడాన్నిఆక్షేపిస్తూ అభ్యంతరాలు తెలుపుతున్నట్లు కెసిఆర్ లేఖలో పేర్కొన్నారు. ఆసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. 2017 వరకు సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవన్న వాస్తవాన్ని విస్మరించారని చెప్పారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించారని, విచారణార్హతను కోల్పోయారు కావున బాధ్యతల నుంచి విరమించుకోవాలని కెసిఆర్ సూచించారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం తమ విధి
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం తమ పార్టీ విధానమని కెసిఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బిహెచ్‌ఇఎల్‌కు నామినేషన్‌పై పనులు ఇచ్చినట్లు సమర్థించుకున్నారు. అత్యంత తీవ్ర కరెంట్ సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణను బయటపడేయాలంటే ఛత్తీస్‌ఘఢ్ విద్యుత్ సంస్థలతో పిపిఎ చేసుకోవడం, దాని ద్వారా పిజిసిఐఎల్ వద్ద కారిడార్ బుక్ చేసుకోవడం తప్ప మరో మార్గం లేకపోయిందని చెప్పారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుకండా మార్వా నుంచి విద్యుత్ కొనుగులులో వ్యవహారాన్ని తప్పు పట్టేలా ప్లాంటే లేదన్నట్లు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఛత్తీస్‌ఘఢ్ నుంచి ఆశించిన మేర కరెంట్ సరఫరా కాకపోవడంతో రెండో వెయ్యి మెగావాట్ల కారిడార్‌ను రద్దు చేసినట్లు కెసిఆర్ తెలిపారు. దాంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని వివరించారు.
ప్రజల అవస్థలు పరిగణనలోకి తీసుకొని అప్పటి ప్రభుత్వ చర్యలను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల్లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై కూడా వ్యాఖ్యానాలు చేయడం విచారకరమని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఛత్తీస్‌ఘఢ్‌తో రూ.3.90కే యూనిట్ చొప్పున కరెంట్ కొంటే అది ఎక్కువ ధర ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చిందని ఎలా వ్యాఖ్యానిస్తారని అడిగారు. విద్యుత్ కేంద్రాలను ఎక్కడ స్థాపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయమని అన్నారు.
దురుద్దేశం ఆపాదించే విధంగా నిందలు
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా బిహెచ్‌ఇఎల్‌కు నామినేషన్‌పై పనులు అప్పగించాయని, ఒక్క తెలంగాణ మాత్రమే బిహెచ్‌ఇఎల్‌కు నామినేషన్‌పై పనులు అప్పగించినట్లు మాట్లాడారని ఆక్షేపించారు. నవరత్న కంపెనీల్లో ఒకటైన బిహెచ్‌ఇఎల్ పనికిమాలిన, ప్రైవేట్ సంస్థ అన్నట్లు, ప్రభుత్వ రంగ సంస్థలన్ని బలోపేతం చేయడమే తప్పన్నట్లు మాట్లాడారని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పుపట్టాలనే ముందస్తు ఆలోచనా వైఖరికి అద్దం పడుతోందని ఆరోపించారు. అందువల్ల విచారణ కమిషన్ బాధ్యతల్లో మీరు ఉండడం ఎంతమాత్రం సమంజసం కాదని జస్టిస్ నరసింహారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. యాదాద్రి ప్లాంట్‌కు భూమి పూజ చేసింది 2016 జూన్ 8 నాడు.. అంటే తెలంగాణ ఏర్పడిన సరిగ్గా ఏడాదికి అని పేర్కొన్నారు. అయితే చాలాకాలం పాటు దీనికి పర్యావరణ అనుమతి లభించలేదని, ఆ తర్వాత కరోనా పెనుభూతం కమ్ముకున్నదని చెప్పారు.
దీంతో ప్లాంటు నిర్మాణంలో పాల్గొనే కార్మికులు చెల్లాచెదురయ్యారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులు ఆలస్యమైనట్టే ఇది కూడా ఆలస్యమైందని, అనంతరం దాదాపు 8 నెలల పాటు ఎన్‌జిటి స్టేతో పనులు ఆగిపోయాయని వివరించారు. ఇవన్నీ ప్రభుత్వం, నిర్మాణ సంస్థ చేతిలో లేని పరిస్థితులు అని, అయినా ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి తాము చిత్తశుద్ధితో ప్రయత్నించామని చెప్పారు. ఇందులో భాగంగానే కోల్ లింకేజిని సాధించామని, ప్లాంటును కూడా దాదాపుగా పూర్తి చేశామని తెలిపారు. 2024 మే మొదటి వారంలో రెండు యూనిట్లకు బాయిలర్లను లైటింగ్ చేయడం కూడా జరిగిందన్నారు. రైల్వే లైను లింకేజి పనులు కూడా 70 శాతం పూర్తయ్యాయని, ఈ వాస్తవాలను గుర్తించకుండా, ప్రాజెక్టు సకాలంలో పూర్తికాలేదని చెప్పడం అసమంజసమని పేర్కొన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా పనులు కానే కాలేదన్నట్టు దురుద్దేశం ఆపాదించే విధంగా నిందలు వేశారని కెసిఆర్ ఘాటు స్పందించారు.