Thursday, December 26, 2024

త్వరలో కాంగ్రెస్‌పై ప్రజల్లో తిరుగుబాటు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రెండున్నర దశాబ్దాల బిఆర్‌ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని అన్నారు. ఎటువంటి ఆటంకాలనైనా అలవోకగా దాటుకుంటూ ప్రజాదరణను మరింతగా పొందుకుంటూ పార్టీ ముందడుగు వేస్తుందని కెసిఆర్ పునరుద్ఘాటించారు. బుధవారం నాడు ఎర్రవల్లి నివాసంలో తనను కలిసేందుకు మహాబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాల నుండి వచ్చిన కార్య కార్యకర్తలు నాయకులతో కెసిఆర్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన అటునుంచి పదేండ్ల ప్రగతి పాలన దాకా తాను ఎదుర్కున్న కష్టాలను కార్యకర్తలకు వివరించారు.

ఆనాడు తెలంగాణను అష్ట దిగ్భందనం చేసిన సమైక్యవాద శక్తులు, వారి మీడియాతో సహా సమస్త రంగాలు.. వాళ్లు రాసిందే రాత గీసిందే గీతగా నడిచేదని గుర్తుచేశారు. అత్యంత శక్తివంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకుంటూ, తెలంగాణ వ్యతిరేకతకు, సమైక్య వాదానికి సింబాలిక్ గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబు నాయుడును ఎదిరించి నిలవడం అంటే అషమాషీ వ్యవహారం కాదని అన్నారు. అటువంటి సమైక్య వాద కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి తెలంగాణను సాధించి, కలబడి నిలబడిన తెలంగాణ సమాజం, భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితిలనైనా అధిగమిస్తుందని కెసిఆర్ భరోసా వ్యక్తం చేశారు. గెలుపు ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం మనకు ఎల్లవేళలా అండగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని కార్యకర్తల జై తెలంగాణ నినాదాల నడుమ కెసిఆర్ ప్రకటించారు.శత్రువుల ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బిఆర్‌ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి ఓటమితో దిష్టి తీసినట్టయిందని పేర్కొన్నారు. తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టాలని కార్యకర్తల హర్షధ్వానాల నడుమ కెసిఆర్ ప్రకటించారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంఎల్‌సిలు మధుసూదనాచారి, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు,కోటిరెడ్డి, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, జీవన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీతా రెడ్డి, నలమోతు భాస్కర్ రావు, రమావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, బూడిద బిక్షమయ్య గౌడ్, కంచర్ల కృష్ణారెడ్డి, తిప్పన విజయసింహా రెడ్డి, ఒంటెద్దు నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వంపై ప్రజలు తిరుగబడే రోజులు త్వరలోనే రానున్నాయి
ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన అలవిగాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని కెసిఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేసినామని నాలిక కరుసుకుంటున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో మున్నెన్నడూ లేనివిధంగా ప్రశాంతమైన పాలన ద్వారా పదేండ్లపాటు సంక్షేమం అభివృద్ధిని అందిస్తూ అన్ని తీర్లా అండగా నిలబడ్డ బిఆర్‌ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటున్నదని కెసిఆర్ తెలిపారు.

కెసిఆర్ మీద ద్వేషంతో, అసంబద్ధ ప్రకటనలతో,ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగబడే రోజులు త్వరలోనే రానున్నాయని స్పష్టం చేశారు. తన చేష్టలతో తానే ప్రజలచేత ఛీ కొట్టించుకోవడమే యాబై ఏండ్ల కాంగ్రెస్ వైఖరి అనీ, ఈ నేపథ్యంలో ప్రజలు అనతికాలంలోనీ కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందారనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నదని సోదాహరణలతో కెసిఆర్ వివరించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకొని జనం దోలాడుకుంటా బిఆర్‌ఎస్ పార్టీకోసం వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు ఓపికతో ప్రజా సమస్యలపైన పోరాడుతూ వారికి అందుబాటులో ఉండాలని కార్యకర్తలకు అధినేత కెసిఆర్ పిలుపునిచ్చారు.

ముందస్తు సమాచారంతో మాత్రమే కలిసేందుకు రావాలి: కార్యకర్తలకు కెసిఆర్ విజ్ఞప్తి
తనను కలుద్దానికి పిలిచినోళ్లు పిలవనోళ్లు వేలమంది రోజూ వస్తున్నారని,వారి అభిమానానికి కెసిఆర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే అంతమందికి ఐదారు గంటలపాటు నిలబడి ఫోటోలు దిగాలంటే కాలు విరిగిన తనకూ ఇబ్బందే అయితున్నదని పేర్కొన్నారు. ఒక్క మనిషి వేలమందితోని నిలబడి ఫోటోలు దిగితే ఎంత కష్టమో మీరే చెప్పండి అంటూ పార్టీ కార్యకర్తలను, తన అభిమానులను ఉద్దేశించి కెసిఆర్ వ్యాఖ్యానించారు. అందుకే సందర్శకులను ముందస్తు సమాచారం మేరకు మాత్రమే ఆహ్వానించాలనుకున్నామని వెల్లడించారు. వారానికి రెండు నియోజకవర్గాల పేర్లు చెబుతామని, చెప్పిన వాళ్లు మాత్రమే వస్తే లొల్లి లేకుంట వాళ్లతో కడుపునిండ మాట్లాడుకొని పంపియ్యొచ్చని అన్నారు. తనపై ఇంతగా చూపిస్తున్న అభిమానానికి కెసిఆర్ మరోసారి మరోమారు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News