Sunday, January 19, 2025

రైతు’బంద్’ అయ్యింది: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /మిర్యాలగూడ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ‘బంద్’ చేసిందని, బోనస్ బోగస్ అయ్యిందని, కరెంట్ మాయమైందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు. బుధవారం రాత్రి నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పోరుబాట… మిర్యాలగూడ మాజీ ఎంఎల్‌ఎ నల్లమోతు భాస్కర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఏకరువు పెట్టారు. పార్లమెంట్ ఎన్నికలలో పది, పన్నెండు స్థానాల్లో బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే భూమి, ఆకాశం బద్దలయ్యేలా పోరాటం చేసి కాంగ్రెస్ మెడలు వంచి ఇచ్చిన హామీలను అమలు చేపిస్తామని అన్నారు. ఆనాడు నీళ్లు, నిధులు, కరెంటు కోసం రాష్ట్ర ప్రజల కోసం ఉద్యమిస్తే… 15 ఏళ్ల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా తెలంగాణ రాజ్యాన్ని సాధించుకున్నామని అన్నారు. ఆనాటి నుండి నేటి వరకు మన పోరాటం నీళ్ల కోసమని, ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులలో ఒకరు స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నప్పటికీ దద్దమ్మలాగా మారి నాగార్జునసాగర్ కట్టపై కేంద్రానికి, కెఆర్‌ఎంబికి పెత్తనం అప్పగించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.

ప్రజలందరికీ తెలుసని, 1956 నుండి నేటి వరకు మనకు శత్రువు కాంగ్రెస్ పార్టీని అని 56 ఏళ్ల నుండి ఆంధ్రప్రదేశ్‌లో కలిపి తెలంగాణ ప్రాంత ప్రజలను అనేక రకాలుగా గోస పెట్టింది కాంగ్రెసేనన్నారు. అసలు ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి నోటికి మొక్కెంత హామీలు ఇచ్చి 420 హామీ ఇచ్చి చక్కగా ఉన్న రాష్ట్రంలో ఉడుముల్లా చొచ్చుకొని మనకి అవస్థలు తెచ్చి పెడుతున్నారని అన్నారు. 18 పంటలకు చివరి భూముల వరకు కూడా బ్రహ్మాండంగా సాగర్ ఆయకట్టుకు నీరు ఇచ్చి బంగారు పంటలు పండించిన ఘనత తమ ప్రభుత్వానిని అన్నారు.. సాగర్‌లో నీరు ఉండి ఇవ్వగలిగే అవకాశం ఉన్నప్పటికీ ఈ దద్దమ్మలకు దమ్ము లేక ప్రాజెక్టును తీసుకెళ్లి కెఆర్‌ఎంబి చేతుల్లో పెట్టి పంటచేలను ఎండ పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత పంటలు ఎండే పరిస్థితి అంటే ఇదే మొదటిసారి అన్నారు. రైతుబంధులో దగా, రైతు బీమా ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో రైతులు ఉన్నారన్నారు.

‘రాష్ట్రంలో కెసిఆర్ ఉన్నన్ని రోజులు బ్రహ్మాండంగా రెప్పపాటు కూడా పోని కరెంటు కటక్కున బంద్ చేసినట్లే మాయమైంది. యాడికి పోయింది ఈ కరెంటు… మీరు ఏమైనా కొత్తగా గడ్డపారలు పట్టి కరెంటును ఉత్పత్తి చేస్తున్నారా… మేము సిద్ధం చేసి ఇచ్చిన కరెంటును కూడా సవ్యంగా నడిపించలేని అసమర్థులు రాజ్యమేలుతున్నారు’ విమర్శించారు. విద్యుత్ సరఫరా లోపాలు ఎందుకు వస్తున్నాయని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘మిషన్ భగీరథ మంచినీరు తెచ్చి అర్బన్ ఏరియాలలో, మున్సిపాలిటీల పరిధిలో అన్ని వర్గాల పేద ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాం, కేవలం ఒక్క రూపాయికి తాగునీటి నెల కనెక్షన్ ఇచ్చి పుష్కలంగా తాగునీరు అందించాం..కానీ నేడు ఈ మిషన్ భగీరథను ఎందుకు కొనసాగించలేకపోతున్నారు..ఈ తెలివి తక్కువతనం ఏంటి…రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు.

కెసిఆర్‌ను తిట్టాలి.. పబ్బం గడుపుకోవాలి
ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కెసిఆర్‌ను తిట్టాలి.. పబ్బం గడుపుకోవాలి ఆనే ఆలోచనే తప్ప.. ప్రజల సంక్షేమం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభు త్వ సహాయ సహకారం లేకుండా వ్యవసాయం ఉండదని తెలివిలేనివారు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో తొలిసారిగా రైతులకు అండగా ఉండాలని. అప్పులు తీరాలనే లక్ష్యంతో రాష్ట్ర బడ్జెట్ నుండి రూ. 15 వేల నుండి 16 వేల కోట్ల వరకు రైతుబంధు ఇచ్చామని, తాను ఇక్కడికి వస్తున్న దారిలో నల్గొండ సమీపంలోని ఆర్జాలబావి గ్రామం వద్ద తమ బస్సును రైతులు ఆపి ఐకెపి సెంటర్ వద్దకు తాము 20 రోజుల క్రితం ధాన్యం తెచ్చినప్పటికీ నేటికి కూడా కొనలేదని ఫిర్యాదు చేశారని, ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్ ప్రభు త్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ వడ్లు కొనబోమని మొండికేస్తే ముఖ్యమంత్రితో సహా జిల్లా రాష్ట్ర మంత్రులు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు. ఎంపిలతో ఢిల్లీలో ధర్నా చేసి రైతులకున్యాయం చేశామనన్నారు. ‘నీ తోకమట్ట బెదిరింపులకు కెసిఆర్ భయపడడు.. కెసిఆర్‌కు జైలు కొత్త కాదు.. పోరాటాలు మా రక్తంలోనే ఉన్నాయి’ అన్నా రు. ప్రజలు ఆలోచించి బిఆర్‌ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలను గెలిపించాలని పిలుపునిచ్చారు. పోరుబాట రోడ్డు షోలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపి లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News