Thursday, January 23, 2025

అయితే దేవుడిపై ఓట్లు.. లేకపోతే కెసిఆర్‌పై తిట్లు

- Advertisement -
- Advertisement -

అయితే దేవుడిపై ఓట్లు.. లేకపోతే కెసిఆర్‌పై తిట్లు
అడ్డగోలు హామీలు ఇచ్చి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది
కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే
బిఆర్‌ఎస్‌కు 12 నుంచి 13 ఎంపి సీట్లు గెలిస్తే
తెలంగాణ హక్కులు కాపాడగలుగుతాం
బిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు
మనతెలంగాణ/హైదరాబాద్: అయితే దేవుడిపై ఓట్లు.. లేకపోతే కెసిఆర్‌పై తిట్లు.. ఐదునెలలుగా ఇదే దుకాణం అంటూ సిఎం రేవంత్‌రెడ్డిపై బిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు మండిపడ్డారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కెసిఆర్ రోడ్ షో నిర్వహించారు. జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కెసిఆర్ కల్యాణలక్ష్మి రూ.లక్ష ఇస్తున్నడు… మేం తులం బంగారం కలిపి ఇస్తం అన్నారని, ఎక్కడైనా తులం బంగారం వచ్చిందా..? అని అడిగారు. రైతుబంధు అందరికి పడ్డదా..?, ముఖ్యమంత్రి 9వ తారీఖులోపల వేస్తం అన్నడు మరి వచ్చిందా..? అని ప్రశ్నించగా రాలేదని జనం నినదించారు. ‘ఇగ రాదు. ఆయననే కుట్ర చేసి ఎలక్షన్ కమిషన్‌కు తెలియజేసి.. మళ్లీ ఆయననే బ్యాన్ చేసిండు అని ఆరోపించారు. ఐదెకరాలు ఉన్నోడికి వేస్తా అని తర్వాత మాట్లాడుతారని, ఆరెకరాల రైతు, ఏడెకరాల రైతు ఏం తప్పు చేసిండు..? అని అడిగారు.

ఈ రకంగా రైతుబంధు ముంచిన్రు అని పేర్కొన్నారు. కరెంటు కోతలు ఉన్నయా..? పొలాలు ఎండినయా..? కామారెడ్డిలో బాగా ఎండినయట నిజమేనా.? మరి కరెంటు ఏమైందని అడిగారు. కెసిఆర్ ఉన్నప్పుడు తొమ్మిది సంవత్సరాలు రెప్పపాటు పోకుండా కరెంటు ఎంత బాగా వచ్చింది..? మరి ఇప్పుడు ఏం మాయరోగం వచ్చిందని ప్రశ్నించారు. మంచినీళ్లు సరిగా వస్తున్నయా..? మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదా..? బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కామారెడ్డిలాంటి పట్టణాల్లో ఒక్క రూపాయికే పేదలకు నల్లా కనెక్షన్ ఇచ్చి, గ్రామాల్లో ఉచితంగా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా నీళ్లు సరఫరా చేశామని గుర్తు చేశారు.

ఎక్కడికి పోయినయ్ నీళ్లు..? ఏం రోగం వచ్చింది దానికి..? దయచేసి అందరూ ఆలోచించాలని కోరారు. వడ్లు కొంటున్నరా..? రూ.500 బోనస్ వస్తున్నదా..? అని ప్రశ్నించారు. బోనస్ బోగస్ అయిపోయిందని విమర్శించారు. ఆడబిడ్డలకు రూ.2500 నెలకు ఇస్త అన్నడు వచ్చినయా..?అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని చెప్పి ఏ మాట కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. పాత రైతుబంధు కూడా ఇవ్వలేదని, పంటలు కోసే సమయం వచ్చినా ఇవ్వలేదని విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఉండాల్నా..? పోవాల్నా..? అని కెసిఆర్ అడిగారు. సిఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డి జిల్లాను తీసేస్తా అంటున్నడని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా ఉండాలంఏట ఎంపీగా గాలి అనిల్‌కుమార్ గెలవాలని అన్నారు.

మళ్లీ బిజెపి గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 అవుతుంది
అబ్ కీ బార్ చార్ సౌ పార్ అని బిజెపోళ్లు గ్యాస్ చెబుతున్నారని.. కేంద్రంలో మళ్లీ బిజెపి గెలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 అవుతుందని కెసిఆర్ పేర్కొన్నారు. ఇందులో అనుమానమే అవసరమే లేదని స్పష్టం చేశారు. ఈ దేశం మనది, రాష్ట్రం మనది, దయచేసి ఆలోచించి ఓటు వేయాలని యువతను విజ్ఞప్తి చేశారు. ఈసారి కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే అని తెలిపారు. బిజెపికి 200 సీట్లు కూడా రావని పేర్కొన్నారు. మనం ఇచ్చిన కరెంటు పోయింది.. మంచినీళ్లు పోయినయ్.. రైతుబంధు పోయింది.. రైతుబీమా కూడా ఉంటదో పోతదో తెలియదని చెప్పారు.

నిరుద్యోగులకు 4 వేల నిరుద్యోగ భృతి అన్నారు.. యువ వికాసం అని 5 లక్షలు బ్యాంక్ కార్డు ఇస్తామని అన్నారు..ఏ విద్యార్థికైనా ఇచ్చారా..? అని అడిగారు. ఇవన్నీ ఇయ్యకపోతే ఇయ్యకపోయారు.. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వట్లేదని విమర్శించారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 1100 పెట్టినం.. వాటిని జూనియర్ కాలేజీలు చేసినం.. అక్కడ పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెడతలేరు.. 125 స్కూళ్లలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అసలేం జరగుతుందని ప్రశ్నించారు. 5 నెలల్లో ఇంత ఆగమాగం ఉంటదా..? అని నిలదీశారు. కెసిఆర్ పోగానే కట్క బంద్ చేసినట్టే కరెంటు బంద్ అయితదా..? నల్లాలు బంద్ అయితయా..? రైతుబంధు బంద్ అయితదా..? అని ప్రశ్నించారు. డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయ్.. ఏం జరుగుతుందనేది దయచేసి ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు.

కామారెడ్డి జిల్లా చాలా చైతన్యం ఉన్న గడ్డ
కామారెడ్డి జిల్లా చాలా చైతన్యం ఉన్న గడ్డ.. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన పోరాటం చేసిన గడ్డ అని కెసిఆర్ పేర్కొన్నారు. ఇదే కామారెడ్డి పట్టణంలో పోలీసు కిష్టయ్య పిస్టోల్‌తో కాల్చుకుని అమరుడయ్యారని గుర్తు చేశారు. ఆనాడు చాలా కష్టపడి, అనేక సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.. పొదరిల్లులా చేసుకున్నాం.. వ్యవసాయం బాగా చేసుకున్నామని చెప్పారు.

తెలంగాణకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిశ్రమలు, ఐటీ రంగంలో విశేష కృషి చేసి బ్రహ్మాండమైన పెట్టుబడులు తెచ్చినం.. ఇవాళ కరెంటు కోతల కారణంగా పెట్టుబడులన్నీ వాపస్ పోయే పరిస్థితి వస్తుందని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఆస్థిత్వాన్ని రక్షించాలన్నా.. బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. బిఆర్‌ఎస్‌కు 12 నుంచి 13 పార్లమెంటు మెంబర్లను గెలిపించి ఇస్తే కాంగ్రెస్ మెడలు వంచగలుగుతాం.. హామీలు అన్నీ అమలు చేయించగలుగుతామని తెలిపారు. నదులను కాపాడగలుగతాం.. తెలంగాణ హక్కులు కాపాడగలుగుతామన్నారు. అందుకే దయచేసి విజ్ఞతతో ఆలోచించి గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News