Monday, December 23, 2024

మోడీది ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌తో పదేళ్లుగా మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలను ఫూల్స్ చేస్తుందని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల ముందు పాకిస్తాన్ బూచి చూపి మోడీ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన కరీంనగర్‌లో గురువారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ‘ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీలు మీ ముందున్నయ్. ఇందులో దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మీ ముందున్నది. ఒక్కటే మాట మనవి చేస్తున్న. పదేళ్లనాడు ఈ దేశానికి ప్రధానిమంత్రి అయ్యిండు. దగ్గర దగ్గర 150 హామీలు ఇచ్చిండు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా? సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ ఏమన్నా అయ్యిందా? దేశ్‌కా సత్యనాశ్ అయ్యింది. అచ్చేదిన్ రాలేదు కానీ, సచ్చేదిన్ వచ్చినయ్. పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరల పెరిగినయ్. పేదలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చేదిన్ రాలేదు. వికసిత్ భారత్ కాలేదు కానీ, విఫల భారత్ అయ్యింది’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

యువకులు, విద్యావంతులు, మేథావులు, కరీంనగర్ పట్టణంలో, ఈ ప్రాంతంలో ఉన్న రచయితలకు దండంపెట్టి చెబుతున్న మోడీ చేసే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ క్యారీ అయితే ఈ దేశం ఇప్పటికే సర్వనాశనం అయ్యింది. మోడీ కన్నా ముందున్న 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55లక్షల కోట్ల అప్పు చేస్తే రూ.105లక్షల కోట్ల అప్పు చేసిండు. రూపాయి విలువ పడింది. ఎగుమతులు భారత్ నుంచి నిలిచిపోయాయి. దిగుమతులు భారీగా పెరిగాయి. విదేశీ మారకద్రవ్యం నిలువ తగ్గిపోయినయ్. సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక్కటీ చేయలేదు. ఏ ఒక్క వర్గానికి దళితులు, గిరిజనులకో, మహిళలకో, పేదలకో, మైనారిటీలకో.. రైతులకో మేలు జరుగలేదు’ అని ఆరోపించారు.‘ఢిల్లీలో ధర్నా చేస్తే 750 మంది రైతులను మోడీ పొట్టనపట్టుకున్నడు. యూపిలో ఎన్నికలుంటే అదే రైతులకు క్షమాపణలు వేడుకొని గట్టెక్కిండు. ఆయనకు అప్పుడు బిరుదు ఇచ్చారు. మాఫీకా సౌదాగర్ అని చెప్పి. ఈ రకంగా ఆయనకు ఓట్లు అక్కర ఉన్నప్పుడు డ్రామాలు, వేషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి, మతవిద్వేషాలు పెంచి, ఒకరకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతరు తప్ప బిజెపి అజెండాలో పేదల మాట ఉండదు.

కార్పొరేట్ల కోసం రూ.15లక్షల కోట్ల ప్రజల సొమ్మును బ్యాంకు రుణాలను ఆయన అబ్బసొత్తులా మాఫీ చేసిండు. కానీ రైతులకు రూపాయి ఇవ్వలేదు. ఎవ్వరికీ మేలు జరుగలేదు. అన్నీ వట్టి డైలాగులు, డబ్బాలో రాళ్లువేసి ఊపినట్లుగా లొడలొడ ఊపుడు తప్ప ఏ ఒక్కమాట నిజం కాలేదు. దయచేసి నా మాటను ఆషామాషీగా తీసుకోకుండా మేధావులు, విజ్ఞులు ఆలోచించాలని కోరుతున్నా’నని కెసిఆర్ అన్నారు. తాను గులాబి జెండా లేపిన్నాడు ఎస్‌ఆర్‌ఆర్ కాలేజ్ నుండి జై తెలంగాణ నినాదం ఇచ్చినానని వెల్లడించారు. నాటి ఉద్యమకాలంలో తనకు రాజీనామా చేయమని అనాటి కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరితే రాజీనామా చేసి పోటికి దిగానన్నారు. ఉప ఎన్నికల్లో రెండున్నర లక్షల మెజారిటీ ఇచ్చి తెలంగాణ వాదాన్ని గెలిపించిన చైతన్యవంతమైన గడ్డ కరీంనగర్ అని గుర్తు చేశారు. కరీంనగర్‌కు తనకు హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. అటువంటి ఉద్యమ స్పూర్తిని మల్లా చాటి ఎంపి అభ్యర్థిగా వినోదకుమార్‌ను గెలిపించాలని కోరారు. దేశంలో విద్యా చట్టం ప్రకారం కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వందలకొద్దీ దరఖాస్తులు పెట్టినా ఒక్క నవోదయ కాలేజీ మోడీ బిజెపి ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వమంటే ఇవ్వలేదని వెల్లడించారు. ఒక్క ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా లేదన్నారు. అటువంటి పార్టీకి ఎందుకెయ్యాలి ఓటు? అని ప్రశ్నించారు. కరెంటు మోటర్లకు మీటర్లు పెడితే రాష్ట్రానికి డబ్బులు ఇస్తానని తన మెడ మీద కట్టిపెట్టిండు,

తన ప్రాణం పోయినా మంచిదే కాని తాను కరెంటు మోటర్లకు మీటర్లకు పెట్టనన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోయిన సారి నలుగురు బిజెపి ఎంపిలు గెలిసిండ్రు, నాలుగు రూపాయల పనైనా చేయలేదన్నారు. తనతో కొట్లాడి కరీంనగర్ ను అభివృద్ధి చేసింది మన బిఆర్‌ఎస్ నాయకులేనని స్పష్టం చేశారు. బండి సంజయ్ కరీంనగర్‌కు ఏంజేసిండు? అని ప్రశ్నించారు. బండి సంజయ్ గట్టిగా మాట్లాడితే ఆయన మాట్లాడేది హిందీ నా ఇంగ్లీషా అర్థం కాదని ఎద్దేవా చేశారు. ఆసొంటోడు కావాల్నా గొప్ప కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టి ప్రజల కోసం పనిచేసే వినోద్ కుమార్ నా ఎవలిని గెలిపించాలి, వినోద్ కుమార్ నే గెలిపించాలి, ఇక్కడ బిజెపిని గెలిపించి, ఇప్పటికే దెబ్బతిన్నాం ఇక ముందు అట్లా కావద్దన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపింది
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో మన అర చేతిలో వైకుంఠం చూయిస్తున్నారని ఎద్దేవా చేశారు. మనం 30 వేల కోట్ల రుణ మాఫీ చేసినం , కరోనా కష్టకాలంలో కూడా రైతు సంక్షేమాన్ని మరువలేదన్నారు. తాము రాంగానే డిసెంబర్ 9 నాడే రెండు లక్షల రుణమాఫీ రేవంత్‌రెడ్డి చేస్తామన్నాడు, చేసిండా? అని ప్రశ్నించారు. వడ్లను కొంటున్నారా? బోనస్ వచ్చిందా? యేదీ రాలే యేదీ ఇయ్యాలే అంతా ఢోకా చేసినారు, మోసం చేసినారన్నారు. మనం ఎకరానికి రైతుబంధు పదివేలు ఇస్తే, పదిహేను వేలన్నారు, ఇచ్చిండ్ర అని ప్రశ్నించారు. పింఛను రెండు వేలిస్తే మేము నాలుగు వెలిస్తాం అన్నారు, ఇచ్చింద్ర? ఒక్క ఫ్రీ బస్సు మాత్రం ఇచ్చిండ్రు, కానీ మహిళలు జుట్లు జట్లు పట్టుకుని కొట్టుకునే టట్టు చేసిండ్రు అని అన్నారు.

ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బూటకపు వాగ్దానాలు మోసపు హమీలిచ్చి గెలిసినారన్నారు. కాళేశ్వరం పేరు మీద ఏదో చేస్తున్నారు రైతులకు నీళ్లియ్య చేత కాట్లేదని తెలిపారు. కాళేశ్వరాన్ని గొప్పగా చేసుకున్నాంమని, గోదావరిని రెండు వందల కిలోమీటర్ల మేర అమృత ధారలతో నింపుకున్నామన్నారు. మల్లా ఊర్లల్లకు క్రేన్లు పూడికలు తీద్దానికి వస్తున్నాయన్నారు. రైతులు ఆత్మహత్యలు మల్లా మొదలైనాయని తెలిపారు. మరి తొమ్మిదేండ్లు మనం ఆపకుంట ఇచ్చిన కరెంటు ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. టౌన్లలో ఒక్క రూపాయికే నల్లా కనెక్షను ఇచ్చినం, ఎక్కడికి పోయినాయి నల్ల నీళ్ళు? అని ప్రశ్నించారు. మల్ల రోడ్ల మీద బిందెలు కానొస్తున్నాయి, నీళ్ల ట్యాంకర్ల దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనాడు వడ్లు తడిసినా కొన్నామని గుర్తు చేశారు.
* ఇప్పుడు రైతుబంధు కేవలం ఐదు ఎకరాలకే ఇస్తారట అని ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News