Sunday, December 22, 2024

ఇంట్లో జారిపడ్డ కెసిఆర్… యశోద ఆసుపత్రిలో చికిత్స

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మాజీ సిఎం కెసిఆర్ బాత్‌రూమ్‌లో కాలు జారిపడిపోయారు. దీని కారణంగా ఆయన నడుము భాగాన లైట్ క్రాక్ వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు యశోద వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది : హెల్త్ బులెటిన్ విడుదల కెసిఆర్ కోలుకోవడానికి ఆరు నుండి ఎనిమిది వారాల సమయం పడుతుందని యశోద ఆసుపత్రి వైద్యులు శుక్రవారం ప్రకటించారు. ఆయనను పరీక్షించిన తర్వాత యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.

బాత్రూంలో జారిపడడంతో ఆయన ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయిందని వైద్యులు ప్రకటించారు. ఈ గాయం నుండి కోలుకోవడానికి ఆయనకు ఆరు నుండి ఎనిమిది వారాల సమయం పడుతుందని యశోద ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆయనకు సిటి స్కాన్‌తో పాటు ఎడమ తుంటికి శస్త్ర చికిత్స చేసేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. అనంతరం కెసిఆర్‌కు డాక్టర్లు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్‌ను చేశారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పలువురు సందేశాలు పంపిస్తున్నారు.

కెసిఆర్ ఆరోగ్యంపై సిఎం రేవంత్ రెడ్డి ఆరా
కెసిఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని వైద్య,ఆరోగ్యశాఖాధికారులను ఆదేశించారు. కెసిఆర్‌కు మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి సూచించారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్‌కు వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ వెళ్లారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన తెలుసుకున్నారు. కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి యశోద ఆసుపత్రి వైద్యులు వివరించారు. కెసిఆర్‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని రిజ్వి ఆసుపత్రి వర్గాలకు తెలిపారు. కెసిఆర్ బాత్రూంలో జారిపడిన విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో కెసిఆర్‌ను గురువారం ఆసుపత్రికి పోలీసులు తీసుకువచ్చారు.

కెసిఆర్‌ను చూసేందుకు యశోద దవాఖానకు పోటెత్తిన అభిమానులు
కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి యశోద దవాఖానకు ఉదయం నుంచి అభిమానులు పోటెత్తారు. యశోద హాస్పిటల్ కేసీఆర్ అభిమానులు కార్యకర్తలు మంత్రులు మాజీ మంత్రులు ఎంఎల్‌ఎలతో నిండిపోయింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌ఎలు ఎంఎల్‌సిలు, మాజీ చైర్మన్లు ప్రజాప్రతినిధులు కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

కెసిఆర్‌ను పరామర్శించిన ఎంఎల్‌సి కవిత
యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్న కెసిఆర్‌ను ఎంఎల్‌సి కవిత పరామర్శించారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం వల్ల పెద్ద శస్త్ర చికిత్స జరుగనుంది. ఆయన త్వరగా కోలుకోవాలని బిఆర్‌ఎస్ కుటుంబ సభ్యులతోపాటు తాము కూడా ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఎంఎల్‌సి కవిత ట్వీట్ చేశారు.

కెసిఆర్‌ను పరామర్శించిన మాజీ మంత్రి జానారెడ్డి
కెసిఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తన సతీమణి, తనయుడు నాగార్జున సాగర్ ఎంఎల్‌ఎ జయవీర్ వెంకట్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. శుక్రవారం యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న కెసిఆర్‌ను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.

వారందరికీ ధన్యవాదాలు : కెటిఆర్ ట్వీట్
కెసిఆర్ ఆరోగ్యంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్వీట్ చేశారు. కెసిఆర్ బాత్రూంలో పడిపోవడంతో ఆయన కాలికి తీవ్ర గాయమైందన్నారు. హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

కెసిఆర్‌ను చూసేందుకు ఎవరూ ఆసుపత్రికి రావొద్దు : మాజీ మంత్రి హరీశ్ రావు
కెసిఆర్‌ను చూడటానికి లేదా పరామర్శించడానికి ఎవరూ ఆసుపత్రికి రావొద్దని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. హరీశ్ రావు యశోద ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పారు. గురువారం సాయంత్రం వైద్యులు హిప్ రిప్లేస్‌మెంట్ చేయనున్నట్లు వెల్లడించారు. కెసిఆర్ కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందన్నారు.

కెసిఆర్ ఆరోగ్యంపై ఆందోళన వద్దు : మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి
కెసిఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం బిఆర్‌ఎస్ నేతలతో సమావేశమయ్యారు. పలువురు నేతలు సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానన్నారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరూ అధైర్యపడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పి చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, ఎంపిపి కృష్ణానాయక్, మీడియా కన్వీనర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్ గాయంపై ఆవేదనగా స్పందించిన ప్రధాని నరేంద్రమోడీ
ఫాంహౌస్‌లోని బాత్రూంలో ప్రమాదవశాత్తు జారిపడి హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు. కేసీఆర్‌కు అయిన గాయం గురించి తెలిసి చాలా బాధపడినట్టు తెలిపారు. ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎపి సిఎం జగన్
కెసిఆర్ ఆరోగ్య ప్రిస్థితిపై ఎపి సిఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు ఫోన్ చేసి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గురువారం రాత్రి కెసిఆర్ ప్రమాదవశాత్తు బాత్‌రూంలో జారిపడడంతో కాలు విరిగిన విషయాన్ని తెలుసుకున్న జగన్ శుక్రవారం కెటిఆర్‌కు ఫోన్ చేశారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్షించారు.

కెసిఆర్ త్వరగా కోలుకోవాలి : జనసేనాని పవన్ కళ్యాణ్
కెసిఆర్ త్వరగా కోలుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆకాక్షించారు. కెసిఆర్‌కు గాయమైందని తెలిసి బాధపడ్డానని పేర్కొన్నారు. ఆయన సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్నో సవాళ్ళను అధిగమించిన కెసిఆర్ ఈ అనారోగ్య పరిస్థితులనూ మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. పూర్తి స్వస్థత పొంది మళ్ళీ ప్రజలకు, సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆశిస్తున్నానన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News