మన తెలంగాణ/ మహబూబ్‌నగర్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలైందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలేమయ్యాయని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ము ఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఎంపిల కోసం చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ..అధికారంలోని కాంగ్రెస్ పార్టీ తీరును దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతు బంధు ఇస్తామన్నారు వచ్చిందా? రైతులందరికీ రైతు బంధు కింద రూ. 15 వేలన్నారు వచ్చిందా? రైతులకు రుణమాఫీ కింద రూ.రెండు లక్షలు అన్నరు వచ్చిందా? ఇక రుణమాఫీ గో విందనేనా? వడ్లకు బోనస్, ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు… లూటీలు వస్తున్నాయి. కళ్యాణలక్ష్మి వచ్చిందా? మహాలక్షి కింద తులం బంగారం వచ్చిందా? మహిళలకు రూ.2500 వచ్చిందా. ఆసరా పింఛన్ నాలుగు వేలు అయ్యిందా?’ అని ప్రజలను ప్రశ్నించారు. ‘రెసిడెన్సియల్ విద్యాసంస్థల్లో విషాహారం పెడుతున్నారు. రోజుకొక విద్యార్థి చనిపోతున్నాడు… ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు..మా హయాంలో అంబేద్కర్ ఓవర్‌సీస్ స్కాలర్ షిప్‌లు ఇచ్చాము.. దానిని బొంద పెట్టా రు.. ప్రతి విషయంలో మోసం, దగా చేస్తోంది’ అని కెసిఆర్ ధ్వజమెత్తారు. ‘చివరికి చేనేతలకు ఇచ్చే 50 శాతం సబ్సడీని ఎత్తివేసి అన్యాయం చేశారు.. ‘
అన్ని వర్గాల ప్రజలను బాధలు పెడుతున్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను నాశనం చేస్తే ఊరుకోను ..యుద్ధం చేస్తా’ అని కెసిఆర్ ప్రకటించారు. ‘ఏమయ్యా ముఖ్యమంత్రి.. నన్ను పట్టుకొని నానా మాటలు అంటున్నవ్, నా గుడ్లు పీకి గోలీలు ఆడతావా? నాకు చంచల్ గూడ జైల్లో గది కట్టిస్తావా? నేను పది హేను సంవత్సరాలు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేసి .. ఆమరణ దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినోన్ని..నన్ను పట్టుకొని నానా మాటలు మాట్లాడతవా? పది సంవత్సరాలు బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంంలో ఒక్క గంట కూడా కరెంట్ పోలేదు..ఇప్పుడు కరెంటు కోతలు మొదలయ్యాయి’ అని కెసిఆర్ విమర్శించారు. ఒక పార్టీమో దేవుడి పేరు మీద ఓట్లడిగితే మరో పార్టీ దేవుని మీద ఒట్లు వేస్తున్నాయి.. దేవుని పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలెవరూ నమ్మరన్నారు. ‘మేము రైతులను ఆదుకునేందుకు రైతు బంధు పెట్టినం.. నీ అయ్య జాగీరా ఏమైనా? ఐదు ఎకరాలు ఉన్నవారికి మాత్ర మే ఇస్తానంటున్నవ్, మరి ఆరు, ఏడెకరాలు ఉన్న రైతులు ఎక్కడికి పోవాలి.. వారు రైతులు కాదా’ అంటూ నిలదీశారు. పాలమూరు జిల్లాలో 25 ఎకరాలు ఉన్న రైతు హైదరాబాద్‌లో ఆటో నడుపుతున్నాడు.. అలాంటి వారికి రైతు బంధు ఇవ్వద్దా అంటూ మండిపడ్డాడు..అసలు ఈ ప్రభుత్వం రైతు బంధును, రైతుబీమాను ఉంచుతుందో, ఊడ్చుతుందో తెలియదని ఎద్దేవా చేశారు.
చోటా, బడేబాయ్‌కి ఓటేసినా ఒక్కటే
ఇక్కడ బిజెపి, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. దయచేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని ప్రజలను కెసిఆర్ కోరారు. ‘నరేంద్ర మోడీ వంద నినాదాలు చెప్పిండు . ఒక్క నినాదమైనా నిజమైందా? మోడీ అంతా కట్టు కథలు, పిట్ట కథలు చెప్తున్నాడు’ అని కెసిఆర్ ఎద్దేవా చేశారు. బేటి పడావో బేటి బచావో జరిగిందా? సబక్ కా సాల్ సబ్‌కా వికాస్.. డిజిటల్ ఇండియా జరిగిందా? అచ్చేదిన్ వచ్చిందా.. సచ్చేదిన్ వచ్చిందా? అమృత్‌కాల్ వచ్చిందా? ఆత్మనిర్భర్ బార్ అయ్యిందా? జన్ ధన్ యోజన్ కింద రూ.15 లక్షలు పడ్డాయా? ఎవరికైనా ఏమన్నా న్యాయం జరిగిందా. పసల్ బీమా ఏ రైతుకన్నా వచ్చిందా? ఇవన్నీ చేసినందుకు మోడీ విశ్వగురువా ?’ అంటూ కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు కోసం వంద ఉత్తరాలు రాసినం
‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హో దా ఇవ్వాలని కేంద్రానికి వంద ఉత్తరాలు రాసినం, బతిమాలినం.. అయినా స్పందించలేదు. ఏమమ్మా.. డికె అరుణ.. మీరు జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు కదా? జాతీయ హోదా ఎందుకు అడగలేదు’ అని కెసిఆర్ నిలదీశారు. మరి ఏమి మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. దేశంలో రూపాయికి విలువ లేకుండా చేసిన ఘనత మోడీకే దక్కిందన్నారు. ప్రపంచంలో డాలర్ కింద రూపాయి పనికి రాకుండా పోయిందని.. ఇది మోడీ పాలనా ఫలితమేనని అన్నారు. దేశ వ్యాప్తంగా పది హేను లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. రైతులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమాలు చేస్తే వారిపై నల్ల చట్టాలు తెచ్చారని, ఫలితంగా దాదాపు 700 మంది రైతులు చనిపోయారని,..రైతులకు పోలీస్ సంకెళ్లు వేశారని అన్నారు. తాను పోయి పంజాబ్, చండీగఢ్‌లో రైతులకు సహాయం చేశానని కెసిఆర్ అన్నారు. కేంద్ర చట్ట ప్రకారం రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని నవోదయ పాఠశాలలు ఇవ్వాల్సిన కేంద్రం తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలేదని ఆరోపించారు.,
పేద రాష్ట్రానికి ఒక్క నవోదయ ఇవ్వని బిజెపికి ఒక్క ఓటు ఎందుకు వేయాలని నిలదీశారు. దేశ వ్యాప్తంగా 150 మెడికల్ కళాశాల్లో ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదని, మరి బిజెపికి ఎందుకు వేయాలని ప్రశ్నించారు. తెలంగాణ భవిష్యత్ యువత చేతుల్లో ఉంది. అన్ని విషయాలను ఆలోచన చేసి ఓటెయ్యాలని కోరారు. ‘ఇవన్నీ పోనీ… మోడీ ఒక మాట చెప్పాడు. నీవు వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు పెట్టాలన్నాడు… నా ప్రాణం పోయిన, తలకాయ తెగినా మీటర్లు పెట్టనన్నాను. ..మోడీకి ఓటేస్తే మీటర్లు పెడతారు. ఇప్పుడు చోటే భాయ్ బడే భాయ్ నరేంద్రభాయ్ ఒకటే… బిజెపికి ఓటేసినా కాంగ్రెస్‌కు ఒటేసినా ఒక్కటే’ అని అన్నారు. ‘మోడీ తెలంగాణలోని ఏడు మండలాలను గుంజుకొని ఆంధ్రాలో కలిపాడు… తెలంగాణకు ఉన్న పవర్ ప్లాంటును ఎపికి ఇచ్చాడు.. తెలంగాణ ఉద్యమం మేము చేస్తుంటే ఆంధ్రాలో ఆనాడు రఘు వీరా రెడ్డి పాదయాత్రకు వస్తే డికె అరుణ మంగళహారుతులు పట్టలేదా.. ఎందుకు బిజెపి ఓటెయ్యాలి’ అని కెసిఆర్ ప్రశ్నించారు. మన కళ్లు మనమే పొడుచుకుంటే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, మనకు అన్యాయం జరిగితే యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సభలో పార్టీ లోక్‌సభ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సభలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంఎల్‌ఎలు లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి.. పట్నం నరేందర్ రెడి తదితరులు పాల్గొన్నారు