Monday, January 20, 2025

నేరాలు జీరో కావాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: న్యూయార్క్ తరహాలో మన రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాలని, అందుకు పోలీసులు టెక్నాలజీ పరంగా అప్ డేట్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. న్యూయార్క్ నేరాల శాతం తక్కువగా ఉంటుందని, అదే తరహాలో మన రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాలని, అందుకు పోలీసులు టెక్నాలజీ పరంగా అప్ డేట్ కావాలన్నారు. హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మనందరికీ గర్వకారణమని, అత్యాధునిక పరిజ్ఞానంతో సిసిసి సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సిసిసి రాష్ట్రంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖల సమాచార సమన్వయానికి మూలస్థంభంగా ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులను ప్రమాదాలను నేరాలను గుర్తించడం,వాటిని ఎదుర్కునేందుకు అధికారులకు సమాచారాన్నిఅందించే అత్యున్నత సామర్థ్యం కలిగి ఉంటుదని తెలిపారు. పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదని, ఉత్తమమైన పని ఎక్కడ చేసినా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు.రాష్ట్ర అవిర్భావం నుంచే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ రావాలని చెప్తూ వచ్చానని, అది నెరడం ఆనందంగా ఉందన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచే పోలీస్ వ్యవస్థ, సంస్కారవంతమైన పోలీసు వ్యవస్థ నిర్మాణం కోసం సిసిసి ఎంతో ఉపకారిగా ఉంటుందని, రాష్ట్రంలో గుడుంబా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్మూలించడంలో పోలీస్ శాఖ పనితీరు ప్రశంసనీయమన్నారు. మున్ముందు పోలీసులు మరింత చురుకుగా పని చేయాలని, మంచిని సాధించడానికి సంకల్పంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. గతంలో రాష్ట్రంలో పనిచేసిన పోలీసు కమిషనర్‌లు గొప్ప సేవలందించారని, శాంతి భధ్రతల పరిరక్షణలో వారి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ ప్రమాదకరంగా పరిణమించాయని, వాటిని పూర్తిస్థాయిలో అరికట్టాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందన్నారు. రాష్ట్రంలో ఏలాంటి సమస్య ఎదురైనా పోలీసులు సమిష్టి ఆలోచనలతో వాటిని పరిష్కరించాలన్నారు. కమాండ్ కంట్రోల్ నిర్మాణంలో తమ వంతు సహకరించిన ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి, అధికారులకు, నిర్మాణ సంస్థకు, టెక్నాలజీని సమకూర్చిన ఎల్ అండ్‌టి కంపెనీ, భవన నిర్మాణంలో శ్రమించిన ప్రతీ కార్మికునికి సిఎం అభినందనలు తెలిపారు.
బంగారు భవితను డ్రగ్స్ నాశనం చేస్తోంది:
భవిష్యత్ తరాల బంగారు భవితను డ్రగ్స్ నాశనం చేస్తోందని సిఎం ఆవేదన చెందారు. నేరాన్ని నియంత్రించేందుకు పోలీసుశాఖ ప్రధాన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్యాల సాధనలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయని, రాష్ట్రంలో ఎక్కడ విపత్తు తలెత్తినా పోలీసుశాఖ ముందుంటుందని వెల్లడించారు. ఉత్తమ పోలీసు వ్యవస్థ ఉంటే సమాజం బాగుంటుందని, సమాజ హితం కోసం సంస్కరణలు తీసుకొస్తున్న పోలీసులకు సెల్యూట్ అని సిఎం అన్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో చాలా వరకు నేరాలు తగ్గాయని, నేర నియంత్రణలో హైదరాబాద్ పోలీసుల ప్రతిభ అద్భుతమన్నారు. అయినప్పటికీ నేరగాళ్లు కొత్త రూపాల్లో నేరాలకు పాల్పడుతున్నారని, నేరాల అణిచివేతకు ప్రభుత్వం పోలీసుశాఖకు సంపూర్ణ మద్దతుతో పాటు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఇండియాలో మనకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, అయితే మన వ్యక్తిత్వ పటిమ చాలా బలమైనదన్నారు. రాష్ట్ర పౌరులు, అధికారులు దేశానికి ఆదర్శంగా నిలవాలని, ఎంత చదువుకున్నా సంస్కారం లేకపోతే కష్టమన్నారు. రాష్ట్రంలో యువత కోసం గుడుంబా నిర్మూలన చేశామని, ఇందు కోసం అనేక చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే గతంలో పేటకో పేకాట క్లబ్బులుండగా వాటన్నింటినీ మూసివేశామన్నారు. రాబోయే రోజుల్లో పోలీసులు మరింత చురుకుగా పని చేయాలని, మంచిని సాధించడానికి మంచి సంకల్పంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణ పోలీసు శాఖ అద్భుత ఫలితాలు సాధించాలని, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు సేవ అందించే సంస్థ కావాలన్నారు.
సంకల్పానికి నిలువెత్తు సాక్షం ః
హైదరాబాద్ నగరంలో ఇంత మంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరని, సంకల్పంతో ఈ భవనాన్ని నిర్మించామని సిఎం తెలిపారు. ఈ భవనం ఈ ఫలితం మన కండ్ల ముందు నిలబడి నిలువెత్తు సాక్ష్యం ఇస్తోందని, ప్రస్తుతం మనం దాని ముందు మాట్లాడుతున్నామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సంకల్ప బలానికి ప్రతీకని, చిత్తశుద్ధితో ఈ భవనాన్ని తీర్చిదిద్దామన్నారు. వ్యక్తులుగా మనం చాలా గొప్పవాళ్లమని, కానీ టీమ్‌గా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతున్నామన్నారు. లీకేజీ ఆఫ్ డైనమిజం కూడా చాలా ఎక్కువని, మనం ఆఫీసుకో, ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఎవరైనా ఏదైనా అంటే ఆ మాటను పట్టుకుని ఓ ఐదు నిమిషాలు ఆలోచిస్తామన్నారు. ఈనేపథ్యంలో సాయంత్రం దాకా అదే మనసులో ఉంటుందని, 25 శాతం ఇమిడియట్ పాస్ట్‌కు, మరో 25 శాతం ఫ్యూచర్ కు లీక్ అవుతూ వర్తమానంలో 50 శాతం లైవ్‌గా పని చేస్తుంటామన్నారు. దీంతో మనకు కావాల్సిన, రావాల్సిన ప్రొడక్టివిటీ రాదన్నారు. అందుకే ఏం చేసినా రసించి చేయాలని పెద్దలు చెప్తుంటారని, ఈక్రమంలో భోజనం చేస్తే కూడా రసించి చేయాలని చెప్తారన్నారు. చిత్తశుద్ధి, వాక్శుద్ధి, సందర్భశుద్ధి, ఆ పట్టుదల, ఏకగ్రాత మీద చిత్తశుద్ధి ఉంటే సాధించకుండా ఏది ఉండదని, వీటిని పాటిస్తే కచ్చితంగా విజయాలను అందుకుంటామని కెసిఆర్ స్పష్టం చేశారు.
సిఎంకు సాదర స్వాగతం ః
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించేందుకు సిఎం కెసిఆర్‌కు ద్విచక్ర వాహనాలతో పోలీసులు స్వాగతం పలికారు. హోంమంత్రి మహమూద్ అలీ, డిజిపి మహేందర్‌రెడ్డి, సిఎస్ సోమేశ్‌కుమార్‌తో కలిసి పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సిఎం కమాండ్ కంట్రోల్ సెంటర్ శిలాఫలకం వద్ద పూజలు చేసి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సిఎం అధికారులతో కలియతిరుగుతూ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు. ప్రతి ఫ్లోర్‌లో విశేషాలను సిఎం పోలీసు ఉన్నతాధికారులకు అడిగి తెలుసుకున్నారు.ఈక్రమంలో పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం కోసం ఏర్పాటు చేసిన మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సిసి టివి మానిటరింగ్, వార్ రూం వంటి వ్యవస్థల గురించి ముఖ్యమంత్రికి పోలీసు అధికారులు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన లక్షలాది సిసి కెమెరాల అనుసంధానం, ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే గుర్తించే అంశాలను సిఎం కు వివరించారు. నేరాలు జరిగినప్పుడే కాకుండా నేరాలు జరిగేందుకు దోహదం చేసే పరిస్థితులను ముందుస్తుగానే ఎట్లా అంచనావేస్తారో అందుకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఎట్లా ఉపయోగిస్తారోననే విషయాలను సిఎం కెసిఆర్ అధికారులు సోదాహరణంగా వివరించారు. తద్వారా ప్రమాదాల నివారణ, నేరాలను అరికట్టడం ఎంతగా సులవవుతుందో ఈ క్రమంలో పలు శాఖలతో ఏకకాలంలో ఎలా సమన్వయం చేసుకోగలమో వివరించారు. కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా ప్రభుత్వంలోని మున్సిపల్ ఆర్ అండ్ బి రూరల్, అగ్రికల్చర్ తదితర శాఖలకు చెందిన సమాచారాన్ని అవసరం మేరకు ఎట్లా సమన్వయం చేసుకోని ఇచ్చిపుచ్చుకోవచ్చన్న విషయాలను సిఎంకు తెలియజేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారులపై పరిస్థితి ఎలా ఉంది? చూపించండని సిఎం అడగడంతో, వెంటనే పోలీసు అధికారులు ఆయా ప్రదేశాలలోని పరిస్థితులను కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే వారికి చూపించి విశ్లేషించడం జరిగింది. కమాండ్ కంట్రోల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీహెచ్. మల్లారెడ్డి, రాజ్యసభలో టిఆర్‌ఎస్ పక్ష నేత ఎంపి కె.కేశవరావు, ఎంఎల్‌సిలు పివి వాణీదేవి, సిరికొండ మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నవీన్ రావు, ఎంఎల్‌ఎలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, బేతి సుభాష్ రెడ్డి, గణేష్ గుప్తా, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్, రవీంద్రనాయక్, జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, ఫీర్జాదీగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్‌లు సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, రోడ్లు భవనాల శాఖ ఇఎన్‌సి గణపతి రెడ్డి, నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ తదితరులు పాల్గొన్నారు.
అనుసంధానంతో నిఘా :
ఏడెకరాల స్థలంలో రూ.600కోట్ల వ్యయంతో అత్యాధునిక పరిజ్ఞానంతో కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఏర్పాటు చేసింది. ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలు వీక్షించేలా బాహుబలి తెరలను కేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే కేంద్రంలో అన్నిశాఖల సమన్వయానికి సైతం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలైనా సరే హైదరాబాద్‌లో ఉన్న ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీక్షించవచ్చు. అన్ని జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని సీసీటీవీ కెమెరాలు ఆయా జిల్లా కేంద్రాల్లోని మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో 5 టవర్లు ఏర్పాటు చేశారు. టవర్- ఏలో 20అంతస్థులు నిర్మించారు. ఇందులోని 4వ అంతస్తులో డిజిపి ఛాంబర్, 7వ అంతస్తులో సీఎస్, సీఎస్ ఛాంబర్లు ఉన్నాయి. 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. టవర్- ఏ పైన హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. టవర్- బీని 15 అంతస్తులతో నిర్మించారు. ఇందులో పూర్తిగా పోలీసుశాఖకు సంబంధించిన సాంకేతిక విభాగాల కార్యాలయాలు ఉండనున్నాయి. డయల్ 100, షీటీమ్స్, నార్కోటిక్స్, సైబర్ క్రైం కార్యాలయాలు టవర్-బి నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. 14 అంతస్తులో మ్యూజియం ఏర్పాటు చేశారు. అందులో పోలీసుశాఖ ప్రాశస్త్యం తెలియజేసేలా ఏర్పాట్లు చేశారు. 15వ అంతస్తులో 360 డిగ్రీలో నగరాన్ని చూసేలా ఏర్పాట్లున్నాయి. నగరంలోని ప్రజలు 15 అంతస్తులోకి ఎక్కి నగరాన్ని వీక్షించే అవకాశం కల్పించనున్నారు. నామమాత్ర ప్రవేశ రుసుం వసూలు చేయనున్నారు. టవర్ ఏ-బీలను అనుసంధానించేలా స్కైవాక్ ఏర్పాటు చేశారు. దేశంలోనే అతి బరువైన స్కైవాక్ ఇదేనని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. టవర్- సీలో మూడు ఫ్లోర్లు ఉన్నాయి. ఇక్కడ 480 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం ఏర్పాటు చేశారు. టవర్-డిలో రెండు ఫ్లోర్లు ఉన్నాయి. ఇక్కడ మీడియా కేంద్రంతో పాటు… ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 12 లిఫ్టులున్నాయి..టవర్- ఈలో కమాండ్ కంట్రోల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేశారు. పలు శాఖలను సమన్వయం చేసుకోవడంతో పాటు సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షించడానికి 4,5,6వ అంతస్తులలో ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ఏదైనా ఊహించని ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు, ఇతర శాఖల అధికారులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. పేలుళ్లు సంభవించినాదోపిడీలు, దొంగతనాలు చేసి నిందితులు పారిపోతున్నా ఏయే ప్రాంతాల గుండా వెళుతున్నారనే విషయాలను కమాండ్ కంట్రోల్లోని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి సంబంధిత పోలీసు అధికారులను అప్రమత్తం చేసి నిందితులను అదుపులోకి తీసుకునేలా ఈ కెమెరాలు ఉపయోగపడనున్నాయి.

KCR Speech at Inauguration of Integrated Command Control

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News