Wednesday, January 22, 2025

పనితీరే గీటురాయి

- Advertisement -
- Advertisement -

KCR Speech at TRSLP Meeting

వచ్చే ఎన్నికల్లోనూ ‘కారు’దే హవా
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 80స్థానాలు టిఆర్‌ఎస్‌వే
అన్ని సర్వేలూ ఇదే చెబుతున్నాయి
మునుగోడులో బిజెపికి మూడో స్థానమే
మన రాష్ట్రంపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుతున్న బిజెపి
టిఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం శాససనభ్యులుగా కొనసాగుతున్న వారిలో కొందరు పనితీరు ఆశించిన స్థాయిలో ఉండడం లేదని టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఇప్పటికే పలు రకాల సూచనలు, సలహాలు కూడా ఇచ్చామన్నారు. అయినప్పటికీ వారి పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. అలాంటి వారు తమ పనితీరును వెంటనే మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు. లేనిపక్షంలో వారి స్థానంలో ఇతరులకు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పనితీరు బాగున్న శాసనసభ్యులకు మరోసారి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా సిఎం భరోసా తెలుస్తోంది. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టిఆర్‌ఎస్ శాసనసభపక్షా సమావేశాన్ని ఉద్దేశించి సిఎం కెసిఆర్ మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మనలను టార్గెట్ చేశాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా సమాచారం. అయితే వారి బెదిరింపులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వారికి (బిజెపి) లొంగని రాష్ట్రాలపై పెద్దఎత్తున దాడులు చేయిస్తున్నారని సిఎం కెసిఆర్ ఆరోపించారు. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన, ఢిల్లీలో ఆప్, బిహార్‌లో ఆర్‌జెడి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులపై కేంద్రం ఇప్పటికే టార్గెట్ చేసిందన్నారు. వారిపై ఇడి, ఐటి దాడులను ఉసిగొలుపుతోందన్నారు. అదే విధంగా మన రాష్ట్రంపై కూడా దాడులు చేసే అవకాశం లేకపోలేదన్నారు. అందువల్ల అందరు అలెర్టుగా ఉండాలన్నారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ఇడి, ఐటి సంస్థ దాడులకు ఎవరు అధైర్య పడొద్దు…. భయపడవద్దన్నారు. వాళ్ళకు అవకాశం ఇచ్చే పనులను మాత్రం చేయవద్దని మంత్రులు, పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపీలకు సిఎం దిశా నిర్ధేశం చేశారు. వారి తాటాకు చప్పుళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని…. అవసరమైతే న్యాయపోరాటం చేద్దామన్నారు. తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తప్పిదాలను మనం సూటిగా ప్రశ్నిస్తుండడం వల్ల తెలంగాణను బిజెపి పెద్దలు టార్గెట్‌గా చేసుకున్నారన్నారు. ముఖ్యంగా మన పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధుల మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలకు కేంద్రంలోని బిజెపి సర్కార్ ఒడిగడుతోందని ఆరోపించారు. అయితే ఇతర రాష్ట్రాల్లో బిజెపి పాచికలు పారిన విధంగా మన రాష్ట్రంలో వారి పప్పులు ఉడకవన్నారు. తెలంగాణ ఏమైనా మహరాష్ట్ర అనుకుంటున్నారా? అని మండిపడ్డారు. ఆ రాష్ట్రంలో శివసేనా ప్రభుత్వాన్ని అస్థిర పరిచి వారికి అనుకూలంగా ఉన్న ప్రభుతాన్ని తెచ్చుకున్నారన్నారు. అలాగే ఢిల్లీ, బిహార్‌లో కూడా యత్నంచి విఫలమయ్యారన్నారు. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రయత్నాలకు ఒడిగట్టేందుకు బిజెపి శతవిధాలుగా యత్నిస్తోందన్నారు. అయితే మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కనిపించకపోవడం వల్లే దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించేందుకు యత్నిస్తోందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. కేంద్రంలో బిజెపి పెద్దలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మనలను ఎవరూ ఏమీ చేయలేరని సిఎం భరోసా ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లోనూ మనదే విజయం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని సిఎం కెసిఆర్ ఘంటా పథంగా సమావేశంలో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు…చేపడుతున్న అభివృద్ధి పథకాల పట్ల తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన 70 నుంచి 80 నియోజకవర్గాలను కైవసం చేసుకుని ముచ్చటగా మూడవసారి అధికారంలోకి వస్తున్నామన్నారు. పార్టీ నేతలు మరింతగా కష్టపడితే 90 నుంచి 100 సీట్లను గెలుచుకుంటామన్నారు. ఇప్పటికే పలు రకాల సర్వే సంస్థలు నిర్వహించిన అన్ని నివేదికలు టిఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయన్నారు. అయితే సర్వేలు మనకు అనుకూలంగా ఉన్నాయని …నేతలంతా ఇంట్లోనే పడుకుంటే మొదటికే మోసం వస్తుందన్నారు. అందువల్ల శాసనసభ్యులంతా నిత్యం ప్రజలతో మమేకం ఉండాలని ఆదేశించారు. ప్రజాక్షేత్రంలో ఉండి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. మీ వల్ల పరిష్కారం కాని సమస్యలను వెంటనే జిల్లా మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.
శాసనసభ్యులు తీసుకొచ్చిన సమస్యలపై మంత్రులు కూడా వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశించారు. అవసరమైతే వాటిని తన దృష్టికి కూడా తీసుకరావాలన్నారు. దళిత బంధు లబ్దిదారుల సంఖ్యను కూడా 1500లకు పెంచామన్నారు. ఇక సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్ణయించిన నేపథ్యంలో మూడు రోజుల పాటు ( 16,17,18) నిర్వహించిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని పార్టీ నేతలకు సిఎం కెసిఆర్ సూచించారు.
మునుగోడులో కారుదే హవా
త్వరలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలోనూ టిఆర్‌ఎస్ అభ్యర్ధి బంపర్ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. మనకు దారిదాపుల్లో కూడా ప్రతిపక్షాలు నిలవడం కష్టమన్నారు. కాగా రెండవ స్థానంలో కాంగ్రెస్, మూడవ స్థానంలో బిజెపిలు నిలువ నున్నాయని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించినట్లుగా సమాచారం. కాగా మునుగోడులో రెండు గ్రామాలకు ఒక శాసనసభ్యుడు చొప్పున ఇన్‌ఛార్జీగా నియమిస్తామన్నారు. ప్రతి ఓటును ముఖ్యమైనదిగానే భావించిన పార్టీ నేతలంతా శ్రమించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ సూచించారు.

KCR Speech at TRSLP Meeting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News