Sunday, January 19, 2025

నీళ్ల కోసం చావోరేవో: కేసీఆర్

- Advertisement -
- Advertisement -

కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైందని మాజీ ముఖ్యమంత్రి, బీఅర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపునిచ్చారు. నీళ్లు లేకపోతే బతుకు లేదని చెబుతూ, కృష్ణా జలాల కోసం మరో పోరాటం చేయాలన్నారు.  నల్లగొండ శివారులోని మర్రిగూడ బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన ‘చలో నల్లగొండ’ బహిరంగ సభలో  మాట్లాడారు.

జై తెలంగాణా అంటూ ప్రసంగం మొదలు పెట్టిన కేసీఆర్ మీరు అనుమతిస్తే, కూర్చుని మాట్లాడతానంటూ సభికులను కోరారు. ఆ  తర్వాత కూర్చునే ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు.  ‘కొందరు సన్నాసులు ఈ సభ తమకు వ్యతిరేకం అనుకుంటున్నారు. కానీ ఇది రాజకీయ సభ కాదు. పోరాట సభ. నీళ్లకోసం ఉవ్వెత్తున మనం ఎగసిపడకపోతే ఎవరూ మన రక్షణకు రారు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు, కేంద్ర మంత్రులకు, మన నీళ్లను ఎత్తుకుపోయేవారికీ ఈ సభ ఒక హెచ్చరిక. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇది జీవన్మరణ సమస్య. కాలు విరిగినా, కట్టె పట్టుకుని ఎందుకు వచ్చానంటే, ఈ సమస్య తీవ్రతను గుర్తించే. నల్లగొండ జిల్లాలో లక్షా యాభై వేల మంది ఫ్లోరోసిస్ బాధితులు ఉండేవారు. అప్పట్లో ఫ్లోరైడ్ ఉద్యమ నేతలతో కలసి కొందరు ఫ్లోరైడ్ బాధితులను ఢిల్లీ తీసుకువెళ్లి , ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి ఇవీ మా బతుకులంటే ఎవరూ పట్టిచుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నల్లగొండను జీరో ఫ్లోరైడ్ చేసింది. తెలంగాణాకు నేనేమీ తక్కువ చేయలేదు. నిమిషం కూడా కరెంటు పోకుండా చూశాను. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్లు అందించాను. నల్లగొండలో లక్షల టన్నుల వడ్లు పండించే స్థితికి తీసుకొచ్చాను’ అని కేసీఆర్ చెప్పారు.

పాలిచ్చే బర్రెను వదిలి, దున్నపోతును తెచ్చుకున్నారు

కృష్ణా జలాలపై మాట్లాడుతూ ట్రిబ్యునల్ వేసేందుకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తే, వందలాది ఉత్తరాలు రాశామనీ, వారం రోజులపాటు లోక్ సభలో కార్యకలాపాలు జరగనియ్యలేదనీ చెప్పారు. ఆ ఒత్తిడికి తలవొగ్గి ట్రిబ్యునల్ వేశారని కేసీఆర్ చెప్పారు. ‘అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ట్రిబ్యునల్ ముందు గట్టిగా వాదించి మన అవసరాలు చెప్పి, మా వాటా ఇంత రావాలని కొట్లాడాలి. మగాడు చేయాల్సిన పని అది. ఇప్పటి ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ అప్పనంగా సంతకం పెట్టేసింది. ఆ వెంటనే హరీశ్ రావు గర్జించాడు. నాలుగైదు రోజులు అబద్ధాలాడారు. దాంతో బడ్జెట్ పై చర్చను పక్కనబెట్టి తీర్మానం చేశారు. అయినా తప్పు చేశారు. తీర్మానంలో సాగు, తాగు నీళ్ల గురించి చెప్పారే గానీ కరెంటు ఉత్పత్తి గురించి పేర్కొనలేదు. మరి మీకేం కోపం వచ్చిందో గానీ పాలిచ్చే బర్రెను వదిలి, దున్నపోతును తెచ్చుకున్నారు’ అని జనాన్ని ఉద్దేశించి అన్నారు.

‘దద్దమ్మల రాజ్యంలో అట్లనే ఉంటది’

‘అధికారంలోకి వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏం చేయాలి? పోయిన గవర్నమెంటు కన్నా నాలుగు మంచి పనులు చేయాలి. కాని ఈ ప్రభుత్వం  ఒక్కటన్నా మంచి మాట చెబుతోందా? పొద్దున లేస్తే కేసీఆర్ ను తిట్టాలి. కేసీఆర్ ని తిడితే పెద్దోళ్లవుతారా? అసెంబ్లీలో ఎలా దుర్భాషలాడుతున్నారో చూస్తూనే ఉన్నారు కదా? అధికారం ఉన్నా లేకున్నా  తెలంగాణా ప్రజల పక్షాన పోరాడతాం. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది నెలల తర్వాత 24 గంటల కరెంటివ్వడం మొదలుపెట్టాం. కేసీఆర్ పోగానే కరెటు బందయింది. మరి కరెంటుకు ఏం రోగమొచ్చింది? దద్దమ్మల రాజ్యం ఉంటే అట్లనే ఉంటది. చవటల రాజ్యం ఉంటే అట్లనే ఉంటది’ అన్నారు. అసెంబ్లీలోనే ఈ ప్రభుత్వం జనరేటర్ పెట్టిందని ఎద్దేవా చేస్తూ, జనమంతా మా కరెంట్ ఏమైందని అడగాలని కేసీఆర్ సూచించారు.

ఈ ప్రభుత్వానికి రైతు బంధు ఇవ్వడానికి కూడా చేతకావట్లేదని అన్నారు. ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, రైతు బంధు అడిగితే అన్నదాతని చెప్పుతో కొట్టండని అంటున్నారని చెబుతూ చెప్పులు రైతులకు కూడా ఉంటాయని ఆయన అన్నారు. తాము రైతుల అకౌంట్లలో రైతు బంధు నిధులు వేసిన వెంటనే వాళ్ల ఫోన్లలో సమాచారం టింగు టింగుమని వచ్చేదని, ఇప్పడు నిధులూ లేవు, టింగుటింగుమని ఫోన్లు మోగడమూ లేదని ఎద్దేవా చేశారు. ‘కేసీఆర్ ని బయట తిరగనియ్యమని అంటున్నారు. మీరు అంత మొగాళ్లా? తెలంగాణా తెచ్చిన కేసీఆర్ నే తిరగనియ్యరా? చంపేస్తారా.. రండి చూద్దాం’ అని కేసీఆర్ సవాల్ విసిరారు.

కొత్తగా వచ్చిన ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతలన పూర్తి చేయాలి. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలి. గురుకులాల సంఖ్య పెంచాలి. మంచినీళ్లు, కరెంటు మంచిగా ఇవ్వాలని ఆలోచించాలనీ, ఆ విషయాలు పక్కనపెట్టి, రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

మేమూ మేడిగడ్డకు పోతాం

మేడిగడ్డకు వెళ్లిన కాంగ్రెస్, ఇతర పార్టీలవారిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ‘మేడిగడ్డకు ఎందుకు పోతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టంటే ఆటబొమ్మ అనుకుంటున్నారా? అది భారీ ప్రాజెక్టు. 250నుంచి 300 పిల్లర్లు ఉంటాయి. అందులో ఒకటో రెండో పిల్లర్లు కుంగాయని రాజకీయం చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు, మూసీ ప్రాజెక్టు గేట్లు గతంలో దెబ్బతినలేదా? ప్రాజెక్టులో ఉన్న నీళ్లను ఎత్తిపోసే ఆలోచనను పక్కనబెట్టి రాజకీయాలు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మేమూ మేడిగడ్డకు వెళ్తాం’ అని కేసీఆర్ అన్నారు.

పులిలా లేచి కొట్లాడతా

‘ఇది మునుపటి ఎడ్డి తెలంగాణా కాదు. టైగర్ తెలంగాణా. నా కట్టెకాలేవరకూ తెలంగాణాకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. పులిలా లేచి కొట్లాడతా. మీ అందరినీ కోరేదొకటే, పోరాటానికి సిద్ధంగా ఉండాలి. అవసరమైతే సద్దులు కట్టుకుని రావాలి. పిడికిలి బిగించాలి. ఈ మాట చెప్పేందుకే ఇంత దూరం వచ్చాను. మళ్లీ డబుల్ స్పీడ్ తో అధికారంలోకి వస్తాం’ అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News