హైదరాబాద్: రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్లం కాదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. మృత్యువు నోట్లో తలదూర్చి మరీ తెలంగాణను సాధించుకున్నామన్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ ఏజెండా దేశమంతా అమలు కావాలని కోరారు. పబ్లిక్ గార్డెన్స్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను సిఎం కెసిఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ శుభాకాంక్షలు తెలిపారు. ఎనిమిది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘన విజయాలు కళ్లముందే కనిపిస్తున్నాయని, 75 ఏళ్లలో ఏ రాష్ట్రం సాధించిన విజయాలను తెలంగాణ సాధించిందని ప్రశంసించారు. ఎన్నో రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని కొనియాడారు. పన్ను మినహాయింపు, ప్రోత్సహకాలు ఇవ్వాలని చట్టంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని, కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీపై అతీగతీ లేదని, ఐటిఐఆర్‌ను కేంద్రం రద్దు చేసిందని కెసిఆర్ మండిపడ్డారు. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజించాలని చెప్పినా మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు మన దేశంలో వైద్య విద్యను అందించాలని లేఖలు రాశామని, తెలంగాణ విద్యార్థులకు వైద్య, విద్యకు అయ్యే ఖర్చును భరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి చెప్పామని, కానీ మోడీ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదన్నారు.
తెలంగాణ రైతాంగం పండించిన పంటను కొనుగోలు చేయడంతో కేంద్రం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో సహా ఢిల్లీలో ధర్నా చేసి ఫలితం లేదని, ధాన్యం సేకరణపై 24 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పినా కూడా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు నూకలను తినాలని కేంద్ర మంత్రి అవహేళన చేసిన విధంగా మాట్లాడారని, దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణపై ఒకే విధానం తీసుకరావాలని డిమాండ్ చేశారు. కేంద్రం సహకరించినా, సహకరించకున్నా తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసిందన్నారు. రైతులను ఎల్లప్పుడూ కాపాడుకుంటామని, ప్రగతి శీల రాష్ట్రంపై కేంద్రం వివక్ష బాధాకరమన్నారు. భారత రాజ్యాంగం రాష్ట్రాలకు విశేష అధికారాలు ఇచ్చిందని, మోడీ ప్రభుత్వం రాష్ట్రాల అదికారాలను హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారియా, పూంచ్ కమిషన్‌ల సూచనలను బుట్టదాఖలు చేశాయని, ప్రస్తుతం మోడీ ప్రభుత్వం విధానం బలమైన కేంద్రం ఉండాలని, బలహీనమైన రాష్ట్ర ప్రభుత్వాలు ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, రాష్ట్రాలను బలహీనపరిచేందేకు కేంద్రం కుట్రలు పన్నుతోందని, రాష్ట్రాల వాటాగా రావాల్సిన పన్నులను సెస్సుల రూపంలో వసూలు చేస్తోందని ధ్వజమెత్తారు.
కేంద్రం ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాలను అతిక్రమించి విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాలకు లోబడి ఉన్న తెలంగాణపై ఆంక్షలు తగవని, రాష్ట్రాలపై విధిస్తున్న ఆంక్షలను కేంద్రం వెంటనే ఎత్తివేయాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బోర్లకు మీటర్లు పెట్టనన్నారు. బోర్లకు మీటర్లు పెడితే రూ.25 వేల కోట్లు కోల్పోతామన్నారు. అధికారంలోకి ఒక కూటమి బదులు మరో కూటమి రావడం ముఖ్యం కాదని, దేశంలో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలని ఆశించారు. కులం, మతం రొంపిలో కుమ్ములాడుకుంటున్నారని, దేశంలో మత పిచ్చి తప్ప వేరే చర్చ లేదని, మత ఘర్షణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనుకోవడం ప్రమాదమని హెచ్చరించారు. దేశం చాలా ప్రమాదంలో ఉందని, అంతర్జాతీయ పెట్టుబడులు వెనక్కి పోతే మన పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
కుల, మత విద్వేషాలుంటే దేశం వంద ఏళ్లు వెనక్కి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, దేశంలోకి ప్రాజెక్టులు, పెట్టుబడులు రావాలన్నారు. దేశంలో నిత్యం ఘర్షణలు, కత్తులు, కోట్లాటంలో దేశం నాశనమవుతుంటే బాధ్యతగలవారు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవడం తన విధి అని చెప్పారు. అదే సమయంలో దేశం కసం విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి రాజీపడే ధోరణేలేదన్నారు.