Monday, December 23, 2024

పేరుపేరునా సమరయోధులను స్మరించుకోవాలి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

KCR speech in Telangana samaikyatha vajrotsavam

హైదరాబాద్: మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని, అడుగులు వేయటం ప్రారంభించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. సిఎం కెసిఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రానికి ముందు భారత దేశం వివిధ పాలకుల పరిధిలో ఉండేదన్నారు. ఏ దేశమైనా పరిణామ క్రమంలో సమగ్రరూపం సంతరించుకుందన్నారు. పేరుపేరునా సమరయోధులను స్మరించుకోవడం మన కనీస ధర్మమని చెప్పారు.

ఆనాటి అద్భుత ఘట్టాలు జాతి జనుల జ్ఞాపకాల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయని, తెలంగాణ సమాజాన్ని నిరంతరం ఉద్విగ్నపరుస్తూనే ఉన్నాయని, యావత్ సమాజం పోరాడిన సందర్భంలో ఆ సన్నివేశానికి కొందరు నాయకత్వం వహించడం ప్రపంచ పోరాటాలన్నింటిలో కనిపించేేవని, తెలంగాణలో సైతం ఆనాడు ఎందరో యుద్ధం చేసి అమరులయ్యారని,  ఇంకొందరు ఆ యుద్ధానికి నాయకత్వం వహించారని ప్రశంసించారు. మరికొందరు సాంఘిక, సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించారని, నేటి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీరయోధులందరినీ పేరు పేరునా తలుచుకోవడం మన కర్తవ్యమని కెసిఆర్ తెలిపారు.

ఆదిలాబాద్ అడవుల్లో తుడుం మోత మోగించి, అడవిబిడ్డలను ఒక్కటి చేసి, జల్ జంగల్ జమీన్ కోసం సింహగర్జన చేసిన ఆదివాసి యోధుడు కొమరం భీమ్ సాహసాన్ని సగర్వంగా తలుచుకుందామని,  భూస్వాముల ఆగడాలకు బలై పోయిన దొడ్డి కొమురయ్య అమరత్వాన్ని వినమ్రంగా గుర్తు చేసుకుందామని, తన సొంత భూమి వందల ఎకరాలను పేద ప్రజలకు పంచిన త్యాగశీలి, రైతాంగ పోరాటానికి తిరుగులేని నాయకత్వాన్ని అందించిన వీరాగ్రేసరుడు, మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూ కన్నా అత్యధిక మెజారిటీని సాధించిన మహా నాయకుడు రావి నారాయణరెడ్డికి ఘనమైన నివాళులర్పిద్దామన్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రేరణతో రాజకీయాల్లో అడుగిడి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ను స్థాపించి, పివి నరసింహారావు వంటి ఎంతోమంది నాయకులను తీర్చిదిద్దిన స్వామి రామానంద తీర్థను స్మరించుకుందామని కెసిఆర్ చెప్పారు. తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయ స్థాపనను యజ్ఞంలా నిర్వహిస్తూ, కఠోరమైన జైలు శిక్షలకు వెరవకుండా మొక్కవోని ధైర్యంతో పోరాడిన సర్దార్ జమలాపురం కేశరావు, వట్టికోట ఆళ్వార్ స్వామిల కృషిని కొనియాడుదామన్నారు.

భూపోరాటాలకు గొప్ప ప్రేరణనిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తిని ఆవాహన చేసుకుందామని, ఐలమ్మ పోరాటానికి దన్నుగా నిలిచి, ఉద్యమాన్ని మలుపు తిప్పిన వ్యూహకర్త, వందలాది ఎకరాల తన సొంత భూమిని పేదలకు పంచిన మానవతావాది, మచ్చలేని మహానాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డిని సవినయంగా స్మరించుకుందామని, జనగామ సింహంగా పేరు గాంచిన నల్లా నర్సింహులునూ, జీవితాంతం పీడిత ప్రజల గొంతుకగా నిలిచి, గీత కార్మికుల అభ్యున్నతికోసం జీవితాన్ని అంకితం చేసిన బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ల ప్రజా పోరాటానికి సేనానిగా నిలిచిన వీర యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి ఆరుట్ల కమలాదేవిల త్యాగాలను సదా స్మరించుకుందామన్నారు. పోరాటంలో పాలుపంచుకోవడమే కాకుండా ఆ పోరాట చరిత్రను గొప్పగా రికార్డు చేసిన దేవులపల్లి వేంకటేశ్వర రావుతో పాటు అట్టడుగు వర్గాల మేలు కోరిన ఉద్యమకారుడిగా, పార్లమెంటేరియన్ గా, శాసనసభ్యుడిగా ఎనలేని సేవలు అందించిన బద్దం ఎల్లారెడ్డి చైతన్యాన్ని పుణికిపుచ్చుకుందామన్నారు.

నిర్బంధాలకు ఎదురొడ్డి నిలిచిన అక్షర చైతన్య మూర్తులు సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండియాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతుల రచనల్లోని ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నిరంతరం నిలబెట్టుకుందామని కెసిఆర్ పిలుపునిచ్చారు. ఇంకా ఎందరో మహానుభావులు, తెలంగాణ సమాజంలో అద్భుతమైన రాజకీయ, సామాజిక చైతన్యాన్ని రగిలించారని, తమ త్యాగాలతో చరిత్రను వెలిగించారని, వారందరి ఉజ్వల స్మృతికి తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.

ఆసేతు హిమాచలం అన్ని వర్గాల ప్రజల్లో దేశం పట్ల విశ్వాసాన్ని నెలకొల్పడానికి నాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్ల నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైందని,  మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు భూమికగా, జవహర్ లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం, సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం, మతాలకు అతీతంగా దేశభక్తి భావనను పాదుకొల్పిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నేతలు చేసిన అవిరళ కృషి వల్ల ఒక్కొక్క చిక్కు ముడి వీడిపోయి భారతదేశం ఏకీకృతమైందని చెప్పారు.

భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుండి 1956 వరకు సొంత రాష్ట్రంగా వెలుగొందింది. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రం కొనసాగిందన్నారు.  మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని, అడుగులు వేయటం ప్రారంభించిందన్నారు.

1956లో దేశంలో జరిగిన రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా.. తెలంగాణ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ-ఆంధ్రలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ప్రజలలో తాము మోసపోయినామనీ, తాము దోపిడీకి గురువుతున్నామనే ఆందోళన గూడు కట్టుకుందని, ఇరుప్రాంతాల మధ్య భావ సమైక్యత చోటు చేసుకోలేదని సఖ్యత ఏర్పడలేదని అందువల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం అందుకు భిన్నంగా సాచివేత ధోరణిని అవలంభించింది.

ఎందరో మహానుభావుల కృషి వల్ల ఇవాళ మనం చూస్తున్న భారతదేశమన్నారు. 1948 నుంచి 1956 వరకు హైదరాబాద్ సొంత రాష్ట్రంగా వెలుగొందిందని, 1956లో జరిగిన పరిణామంలో భాగంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని గుర్తు చేశారు. అప్పటి నుంచి తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల మధ్య సఖ్యత లేకపోవడంతోనే ఉద్యమం ఎగసిపడిందన్నారు. కేంద్రం సాచివేత ధోరణి అవలంభించిందన్నారు. తెలంగాణ న్యాయమైన డిమాండ్లను ఆనాటి కేంద్రం పట్టించుకోవడంలేదని కెసిఆర్ విరుచుకపడ్డారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంత పోరాటం సాగించానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News