Monday, January 20, 2025

కెసిఆర్ అంటేనే కాలువలు, చెక్ డ్యాంలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : కెసిఆర్ అంటేనే కాల్వలు చెక్ డ్యాంలు, రిజర్వాయర్లని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కెసిఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు అని ఆమె అభివర్ణించారు. దేశమే గర్వపడేలా ప్రపంచ స్థాయి సాంకేతిక నైపుణ్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించారని అన్నారు. బుధవారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 81మీటర్ల నుంచి 613 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరంను తీర్చిదిద్దారని అలాంటి ప్రాజక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరిన పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడి నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు జాతీయ హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి తేవాలని ఆమె కోరారు. కెసిఆర్ అంటేనే అమ్మ తీరు ఆలోచించడం అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిపోయిన పొలాలను చూసి కెసిఆర్ దుఖించిన తీరును తాను చూశానని చెప్పారు. గతంలో ఎండిపోయిన పాలమూరు ఇవాళ పచ్చని పైట కప్పుకున్నదని సిఎం కెసిఆర్ సంతోషిస్తున్నారని తెలిపారు. మన బిడ్డలకు ఏమైనా సుస్తి చేస్తే వాళ్లు మంచిగయ్యేదాక వదిలి పెట్టమని, మన అమ్మ ప్రేమ అలా ఉంటుందన్నారు.


కెసిఆర్‌ది తెలంగాణ పట్ల రైతుల పట్ల తల్లి ప్రేమ అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేసే సమయంలో రిజర్వాయర్ల నిర్మాణం, కాలువల తవ్వకం వంటి ప్రతీ చిన్న అంశాన్ని క్షుణ్ణంగా ఆధ్యయనం చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు లేని కాలంలో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే నిజాంసాగర్ ప్రాజెక్టు ఉండేదని, తర్వాత కాలంలో ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడిన సందర్బాలు చూశామని గుర్తు చేశారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టును ఉపయోగించుకుని ఎస్సారెస్పీని పునరుజ్జీవ పథకం పెట్టుకొని చీచార్జ్ చేసుకున్నామని, హల్డీ వాగుతో నిజాంసాగర్ ప్రాజెక్టును నింపుకున్నామని పేర్కొన్నారు. ఎండ కాలమైనా, వర్షాకాలమైన చెరువులన్నీ నిండుకుండలా ఉండాలని, మత్తడి దంకాలన్నది సిఎం కెసిఆర్ ఆలోచనని స్పష్టం చేశారు.
అందుకోసం సాగునీటి రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అయి వారిని సిఎం కెసిఆర్ ఒప్పించారని అన్నారు. మహారాష్ట్రతో జరిగిన ఒప్పందం పై కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకంగా మాట్లాడారని, కానీ రోజు ఒప్పందం చేసుకోవడం వల్లనే నిజామాబాద్ జిల్లా నిండుకుండలా మారిందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో గతంలో జరిగినదానికంటే మంచి ఇప్పుడే జరుగుతోందన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఇక్కడి నుండి భారీ నీటి పారుదలశాఖ మంత్రిగా ఇక్కడి వ్యక్తి పని చేశారు. కానీ అప్పుడు వచ్చిన నిధులు ఇప్పుడు ఎన్ని ఆలోచించాలన్నారు. కాలువలు తవ్వ వేల కోట్లు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది అని అన్నారు. కెసిఆర్ హయాంలో జిల్లాకు 5వేల కోట్ల నీటి పారుదలకు కేటాయించారు. కెసిఆర్ హయంలో పారదర్శకత పాలన ఉంది. కాబట్టే 21 రోజుల పాటు ప్రతి శాఖలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి పరిస్థితిని చూసి కెసిఆర్ ఎంతో బాధపడేవారని, ఒక బిడ్డగా నాకు తెలుసునని ఆమె పేర్కొన్నారు.
కెసిఆర్‌కి తెలంగాణ రైతుల పట్ల తల్లి ప్రేమ ఉంది. కాళేశ్వరంతో ఎక్కువ లబ్ధ్ది పొందుతుంది. నిజామాబాద్ జిల్లాయేనని అన్నారు. ఎండాకాలంలో కూడా చెరువులు కళకళలాడుతున్నాయని, దీని వెనుక కెసిఆర్ శ్రమ ఎంతో ఉందన్నారు. కాళేశ్వరం నిర్మాణం అంటే అది భగీరథ ప్రయత్నం అని అన్నారు. లక్షా 80వేల ఎకరాలు జిల్లాలో కాళేశ్వరం ద్వారా సాగునీరు తెచ్చుకుంటున్నామని, ఇలాంటి గొప్ప ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గు చేటన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
గతంలో ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండేదని, కానీ తెలంగాణ వచ్చాక ఇంజనీరింగ్‌ల సంఖ్య పెంచుకున్నామన్నారు. ఇరిగేషన్, ఇంజనీరింగ్ విభాగాలను పటిష్ట పర్చుకున్నామని, అందుకే పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ జిల్లాలో 15 శాతం భూగర్బ జలాలు పెరిగాయన్నారు. కలలు కన్నా తెలంగాణ ఈరోజు మిలమిల మెరుస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ప్రెండ్లీ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని ఆమె గుర్తు చేశారు.
అప్పటి ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు, నిధుల కేటాయింపులు జరపలేదని, ఏనాడూ నిబద్దత చూపించలేదని విమర్శించారు. నీటి వనరులు లేకుండా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాలువలు తొవ్వి వేల కోట్లు దోపిడి చేశారని ఆరోపించారు. అప్పటి కాంగ్రెస్ పాలనలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడే ఈ ఘోరాలు జరిగాయని మండిపడ్డారు. అనంతరం సాగునీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు విశేషంగా కృషి చేసిన రిటైర్డ్ ఎస్‌ఈ ఆత్మరాం, డిప్యూటీ ఎస్‌ఈ ప్రవీన్‌కుమార్‌లను ఆమె సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ ఆకుల లలిత, మేయర్ దండునీతూకిరణ్, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News