Monday, February 24, 2025

బిసి అభ్యర్థులకు కెసిఆర్ మద్దతు ఇవ్వాలి: జాజుల

- Advertisement -
- Advertisement -

బిసి అభ్యర్థులకు మద్దతిచ్చి మీ విశ్వసనీయత నిలుపుకోండి
: ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు కోరుతూ కెసిఆర్‌కు జాజుల లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిసి అభ్యర్థులైన నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ నియోజక వర్గం నుండి పూల రవీందర్, అలాగే కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ నుండి ప్రసన్న హరికృష్ణ, ఇదే ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి మల్క కొమురయ్యలకు మద్దతు ఇచ్చి గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కెసిఆర్)ను కోరారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులను నిలుపునందున, బీసీల అభ్యర్థనను దృష్టిలో పెట్టుకొని చట్టసభల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఇంకా పెంచాల్సిన గురుతర బాధ్యతను మీ భుజాలకు ఎత్తుకొని ఈ ఎన్నికల్లో బీసీలకు మద్దతు ఇచ్చి బీసీల పక్షపాతిగా నిలబడాలని కోరారు. ఈ మేరకు కెసిఆర్‌కు ఆయన ఆదివారం లేఖ రాశారు. ప్రస్తుతం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులకు బిఆర్‌ఎస్ పార్టీ తరఫున మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి, ఉపాధ్యాయ యూనియన్లు ఏకపక్షంగా రెడ్డి సామాజిక వర్గానికి మద్దతుగా నిలిచాయని, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారిని గెలిపించాలని ఇప్పటికే ఆ రెండు పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఎమ్మెల్సీలుగా బీసీలకు అవకాశం ఇవ్వని కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అంతా ఏకమై ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల నుండి బీసీ అభ్యర్థులను బరిలో నిలపడం జరిగిందని జాజుల ఆ లేఖలో వివరించారు. ఇప్పటికే బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, మీ కుమార్తె కవిత కూడా బీసీ విషయాలపై తరచూ సభలు, సమావేశాలు నిర్వహిస్తుండడం, బీసీల కోసం తాను కూడా కొట్లాడుతానని ముందుకు రావడం అభినందనీయమేనని అన్నారు.

అయితే కవిత బీసీ వాదం ఎత్తుకున్నప్పటి నుండి బీసీ సమాజం నుండి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నానని ఆ లేఖలో వెల్లడించారు. నిజంగా కవిత బీసీల కోసం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే టిఆర్‌ఎస్ పార్టీ తరఫున, అలాగే కవిత స్వయంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని సవివరంగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. 60 శాతం పైగా ఉన్న బీసీ జనాభా నేడు చట్టసభల్లో 18 శాతం కూడా రాజకీయ ప్రాతినిథ్యం లేకుండా తరతరాలుగా అన్యాయం జరుగుతూనే వస్తున్నదని, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని బీసీ సమాజం ఎంతో విశ్వసించినప్పటికీ నేటి వరకు నెరవేరడం లేదని అన్నారు బీసీలను అన్ని రాజకీయ పార్టీలు కరివేపాకు లాగా వాడుకుని జెండాలు మోసే కార్యకర్తలుగా, ఓట్లు వేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారే తప్ప రాజకీయ అధికారంలో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడం లేదని పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్య పార్టీగా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయవేత్తగా, బీసీల విషయంలో సామాజిక న్యాయం సాధించే ఈ దశలో బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు టిఆర్‌ఎస్ పార్టీ తరఫున మద్దతు ప్రకటించాలని, ఈ చారిత్రక అవసరాన్ని మీకు ప్రత్యేకంగా గుర్తు చేస్తూ మీకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News