Friday, November 15, 2024

సొంత ఎమ్మెల్యేల ఫోన్‌లను కూడా కెసిఆర్ ట్యాప్ చేయించారు

- Advertisement -
- Advertisement -

ఫోన్‌లను ట్యాప్ చేయడానికి వాడే పరికరాలను విదేశాల నుంచి తెప్పించారు
మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్ డైరెక్షన్‌లో ఫోన్ ట్యాపింగ్
అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ

మన తెలంగాణ/హైదరాబాద్: విపక్ష నేతలతో పాటు కాకుండా సొంత ఎమ్మెల్యేల ఫోన్‌లను కూడా కెసిఆర్ ట్యాప్ చేయించారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన బాగోతాలు ఒక్కోక్కటిగా బయటకు వస్తుండటంతో ఆ పార్టీ నాయకులు నీళ్లు మింగుతున్నారని ఆయన విమర్శించారు. ఫోన్‌లను ట్యాప్ చేయడానికి వాడే పరికరాలను విదేశాల నుంచి తెప్పించారని, ఆ పరికరాల ఖర్చు మొత్తం బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలదేనని తమ దగ్గర ఆ సమాచారం ఉందని ఆయన అన్నారు.

ప్రభాకర్ రావు విదేశాల నుంచి తెలంగాణకు వచ్చి జరిగిన విషయాన్ని పోలీసులకు చెబితే ఈ కేసులో పురోగతి వస్తదన్నారు. ఇది తెల్ల చొక్కా వేసుకున్న రాజకీయ నాయకులకు, ఖాకీ బట్టలు వేసుకున్న పోలీసుల నిబద్ధతకు పరీక్ష అని ఆయన అన్నారు. నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందులో భాగంగా తన హక్కులకు భంగం కలిగిందని డిజిపికి మొదటగా ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రోద్భలంతోనే ట్యాపింగ్: ఎమ్మెల్యే వంశీ కృష్ణ

అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రోద్భలంతోనే తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ఆయన పై చర్యలు తీసుకోవాలని డిజిపి, ఐజిపికి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, కెటిఆర్ డైరెక్షన్‌లో ఆ ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు.

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌లో 30 మంది అధికారులు, బిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌కు వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, సోషల్ ఎలిమెంట్స్‌కు వాడారన్నారు. వెంటనే విచారణ చేసి దోషులను శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతానన్నారు.

అందెశ్రీని విమర్శించే స్థాయి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు లేదు: ఎమ్మెల్యే నాగరాజు

వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పెత్తందారుల చేతుల్లోకి పోయాడని ఆయన ఆరోపించారు. ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు పోదాం అన్న నీ మాటలు ఎక్కడికి పోయాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఏనుగును విడిచి కారు ఎక్కాడని ఆయన ఆరోపించారు. స్వెరోస్ అనే సంస్థ పెట్టి దొంగలను పోషించారని, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మోసం పూరిత మాటలను దళితులు నమ్మొద్దన్నారు. దళితులకు న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. అందెశ్రీ ని విమర్శించడానికి సిగ్గుండాలని, కీరవాణి అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సంగీత దర్శకుడని, ఆయన్ను విమర్శించే స్థాయి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News