Monday, December 23, 2024

అమరం, అజరామరం మీ త్యాగం..

- Advertisement -
- Advertisement -

అమరుల త్యాగం వృథా కాలేదు. వారి ఆలోచన వృథా పోలేదు. వారి కల కలగానే మిగిలిపోలేదు. జీవితాన్ని త్యాగం చేయాలంటే మాటలు కాదు. ఏన్ని ఆలోచనలు.. ఎన్ని నిద్ర లేని రాత్రులు, ఎన్ని ప్రణాళికలు, అటు కుటుంబం, ఇటు సమాజం, అటు లక్ష్యం. ఇటు బాధ్యతలు. ఎంతటి వీరులయ్య మీరు. ఎంతటి శూరులయ్యా మీరు. మీ త్యాగం వెలకట్టలేనిది.. మీరూ అర్పించిన ప్రాణాలు తెలంగాణ నిర్మాణానికి పునాదులుగా మారాయి. మిమ్మల్నీ తలుచుకోవడం మా అదృష్టం. మిమ్మల్నీ స్మరించుకోవడం మా బాధ్యత. వీరులారా వందనం, అమర వీరులారా వందనం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అశువులు బాసిన త్యాగధనులరా వేల వేల వందనాలు.అరవై ఏండ్ల తెలంగాణ అస్తిత్వ ఉద్యమాలలో మీ పోరాటం, అమరం.., అజరామరం.. మీ త్యాగం.., మీ త్యాగ స్ఫూర్తి నిరూపమానం. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం మీ ప్రాణం వృథా కాలేదు. తెలంగాణ కలను నిజం చేయడంలో మీ జీవితాన్నీ త్యజించారు. ఎందరో తెలంగాణ బిడ్డలు అమరత్వం పొందారు.

2001 ఏప్రిల్ 27న తెలంగాణ తల్లి విముక్తి కోసం కెసిఆర్ నాయకత్వంలో జల దృశ్యంలో గులాబీ జెండా ఎగిరింది. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాట పయనంలో మీ త్యాగం ఫలితం వల్ల తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నది. బిడ్డలు చనిపోతుంటే చలించిపోయారు కెసిఆర్. నేను సచ్చిపోయిన పర్వాలేదు. నా తెలంగాణ బిడ్డలు ప్రత్యేక రాష్ట్రం వారి కండ్లరా చూడాలి. బిడ్డల కోసమే కదా నేను గులాబీ జెండా ఎత్తిన. తెలంగాణ తెచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో.. అంటూ కెసిఆర్ సార్ 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు కూర్చున్నారు. బిడ్డలారా, యువ విద్యార్థి బిడ్డలారా నేను మీ కోసం ఉన్నాను.. మీ కోసం రాష్ట్రం కోసం కొట్లాడుతున్న.

మీరు ఎవరు ఆత్మ బలిదానాలకు పాల్పడవద్దు అంటూ కెసిఆర్ మొండిగా ఆమరణ దీక్షను కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలతో సకల జనం రోడ్ల పైకి వచ్చారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి జ్వాలలై ఎగసిపడుతున్నాయి. ఒక వైపు కెసిఆర్ దీక్ష. మరో వైపు బిడ్డలు ప్రాణాలు. రాష్ట్రం తప్ప ఇంకో మెట్టు దిగేదు లేదు. తెలంగాణ గుండెలన్ని భగ్గుమన్నాయి. కెసిఆర్ దీక్షతో తెలంగాణ అట్టుడుకుతున్నది. బిడ్డల ప్రాణాల పోతుంటే తెలంగాణ తల్లి తల్లడిల్లిపోయింది. ఈ ధర్మ పోరాటంలో మన ఉద్యమానికి ఆనాటి కేంద్రంలోఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. తెలంగాణ ఉద్యమానికి, అమరుల త్యాగానికి, కెసిఆర్ దీక్ష ఫలితం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తక్షణమే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని డిసెంబర్ 9 అర్థరాత్రి అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. దీంతో కెసిఆర్ ఆమరణ దీక్ష విరమించి ప్రాణం త్యాగం చేసుకున్న అమరుల గుర్తు చేసుకుంటూ తల్లడిల్లి పోయారు. మళ్ళీ తెల్లారే సరికి ఆంధ్ర కుట్రలకు.. కేంద్రం శ్రీకృష్ణ కమిటీ వేయడం జరిగింది. దీక్షతో నిరసించిన కెసిఆర్ పానం మళ్ళీ పోరు బాట పట్టింది. తెలంగాణ జెఎసి ఏర్పాటు చేశారు. ఉద్యమానికి మరో స్థాయిలో పతాక స్థాయికి చేర్చి 2014 రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదం తెలపడం జూన్ 2న కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది అమరుల త్యాగం తెలంగాణ అని నినాదించారు.

అమరుల త్యాగం వెలకట్టలేనిది. మలిదశ తొలి అమరుడు శ్రీకాంత్ చారితో పాటు, పోలీస్ కిష్టయ్య, యాదిరెడ్డి, సువర్ణ, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి, ఇషాం త్ రెడ్డి ఇలా ఎందరో తెలంగాణ బిడ్డలు రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసుకున్నారు. కెసిఆర్ ఆమరణ దీక్షకు సందర్భంలో నాటి ప్రభుత్వ దమనకాండకు నిరసనగా ఉగ్ర రూపం దాల్చిన ఉద్యమ సూరీడు అయి ఎల్‌బినగర్ చౌరస్తలో శ్రీకాంత్ చారి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని తెలంగాణ నినాదమై అంబేడ్కర్‌ను వేడుకున్నాడు. ఎంతటి ధీరత్వం. రాష్ట్రం కావాలంటే పార్లమెంట్ ఆమో దం కావాలి. మన భారత పార్లమెంటు సాక్షిగా చెట్టుకి ఉరి వేసుకుని యాదిరెడ్డి తెలంగాణ కోసం ప్రాణాలు వదిలిన త్యాగమూర్తి. పోలీస్ కానిస్టేబుల్ కృష్ణన్న త్యాగం మరవలేనిది. ఉద్యమంలో కామారెడ్డి నడిబొడ్డున తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు వదిలిండు. పాలమూరు బిడ్డ సువర్ణ కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని ప్రాణ త్యాగం చేసింది.

ఉస్మానియా యూనివర్సిటీలో సిరిపురం యాదయ్య ఆత్మహత్య చేసుకున్నడు. విలేకరి సునీల్, పావని, చింతకింది మురళీ, రవీందర్, సుమలత ఇట్ల ఒక్కొక్క అమరు వీరులది ఒక అంతిమ తీర్పులా అనేక మంది తెలంగాణ బిడ్డలు ప్రత్యేక రాష్ట్రం కోసం అశువులు బాశారు. అమరులకే మొదటి వందనం, నివాళులు అర్పించడం మొదటి కర్తవ్యం. ఎందుకంటే అమరుల త్యాగం గొప్పది. వారి ఆశయాలను, ఆకాంక్షల్ని నెరవేర్చాల్సి బాధ్యత మనపై ఉంది. అసెంబ్లీకి వెళ్లిన, సచివాలయం వెళ్లిన.. ఎక్కడ ఈ కార్యాలయంలోనైనా అమరులకు సెల్యూట్ చేసే పోవాలని అలా సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంసిలు, ప్రజా ప్రతినిదులు, అధికారులు.. తెలంగాణ ప్రజానీకం అంత అమరులకు ఘనమైన నివాలులు అర్పిస్తున్నము. అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది.

సాగునీటి రంగంలో విజయం సాధించింది. కాళేశ్వరం ఇతర ప్రాజెక్టుల ద్వారా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. పచ్చని పంట పొలాలు పసిడి సిరుల పంటలతో ఆకుపచ్చ తెలంగాణగా అవతరించింది. అనేక సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ వర్ధిల్లుతుంది. 90 వేల ఉద్యోగాలు నియామకం తుది దశకు చేరుకుంటుంది. దళిత బంధు ద్వారా దళిత బిడ్డలకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఐటి రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎన్ని ప్రగతి చిత్రాలు పునర్నిర్మాణం చేసుకుంది. మన ఆత్మగౌరవ నిలయం అంబేడ్కర్ సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం. వీటి మధ్యనే ఆకాశానికే వెలుతురై నిలిచిన అమరుల స్మృతి చిహ్నం. ‘అమరుల ప్రాణ త్యాగమే.. తెలంగాణకు ప్రాణం పోసింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నది అంటే అమరుల స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు పోతున్నారు.

తెలంగాణ ప్రజల శ్వాస, అస్తిత్వం, పోరాటం, ఆత్మగౌరవం, చైతన్యం, భావోద్వేగం, బలమైన ఆకాంక్ష. 2001లో కెసిఆర్ నాయకత్వంలో ఎగసిన మలి దశ ఉద్యమం 2009లో పతాక స్థాయికి చేరింది. ఎంతో మంది బిడ్డల ప్రాణ త్యాగాలతో స్వరాష్ట్రం సాకారమైంది. అమరుల త్యాగంతో ఆకాంక్ష నెరవేరింది.అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం.. విలువైన ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ఉజ్వలంగా స్మరించుకోవాలి. బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాల సంక్షేమ బాధ్యతను విధిగా తెలంగాణ ప్రభుత్వమే తీసుకుంది. అమరుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందింది. కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ప్రతి ఏటా అమరుల త్యాగం గుర్తు చేసుకుంటూ.. వారి కుటుంబాలకు సన్మానం చేయడం జరుగుతుంది. ఎన్ని జన్మలైనా.. ఎన్ని యుగలైనా.. తెలంగాణ అమరుల త్యాగం స్ఫూర్తి చిహ్నం వెలుగుతూ ఉంటుంది. రాష్ట్ర సచివాలయం ముందు జల దృశ్యంలో అమరుల స్మృతి చిహ్నం. తెలంగాణ బొడ్రాయి మన ఆత్మగౌరవ నిలయం సచివాలయం ఎదురుగానే అమరుల జ్యోతి వెలిగించారు సిఎం కెసిఆర్. 2001లో ఎక్కడైతే గులాబీ జెండా ఎగిరిందో ఆ జల దృశ్యంలోనే గులాబీ జెండా నీడలో నేడు తెలంగాణ అమర వీరులు సేద తీరుతున్నారు.

తల్లి తెలంగాణ ఒడిలో హాయిగా నిద్ర పోతున్నారు. ఇది అమరుల స్మృతి చిహ్నం.. అమరుల ప్రజ్వలించే జ్యోతిగా, ఆకాంక్షలను, ఆత్మగౌరవాన్ని నిల్పి వందలాది మంది త్యాగధనుల బలి దానాల చరిత్ర స్మరించుకోవాలని మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆకాంక్ష. మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన పోరాట యోధుడు కెసిఆర్. ఈ రోజు తెలంగాణ గడ్డపై తలెత్తుకొని ఇది నా తెలంగాణ అని అంటున్నామంటే అది కెసిఆర్ పోరాటతత్వం. ఆయన మస్తిష్కం నుండి పురుడు పొసుకున్నదే నేటి తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం. తెలంగాణ రాష్ట్రంలో ముందుగా అమరులను యాది చేసుకోవాలనే తన ఆలోచన. మలిదశ ఉద్యమం సాధించిన తెలంగాణ గొప్ప చరిత్ర భావితరాలకు ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ దృఢ సంకల్పానికి నిదర్శనమే అమరుల స్మృతి చిహ్నం. తెలంగాణ సాధనలో అశువులు బాసిన అమరవీరులను స్మరిస్తూ దీప శిఖ అమర రూపం, స్మృతివనం, జలదృశ్య అమర తారకం. తెలంగాణ అమరుల త్యాగం స్ఫూర్తి దేదీప్యమానంగా వెలుగుతూ ఉండే అఖండ అమర ద్వీపం. నిత్యం అమరులను మననం చేసుకుందాం.

తెలంగాణ అమర వీరులకు జోహార్లు జోహార్లు

చిటుకుల మైసారెడ్డి- 9490524724

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News