Saturday, November 2, 2024

సామూహిక విజయానికి దారులు

- Advertisement -
- Advertisement -

ఒక వూరును స్వయం సమృద్ధి గ్రామంగా తీర్చిదిద్దటానికి గ్రామ పాలకులు ఎంతో శ్రమించవలసి ఉంటుంది. గ్రామాన్ని తీర్చిదిద్దటానికి సర్పంచ్‌లుగా, వార్డు సభ్యులుగా, గ్రామ అధికారులు తమకున్న అత్యధిక సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ప్రజల తరపున విజ్ఞప్తి చేసి బాధ్యతలు తీసుకున్న ప్రజాప్రతినిధులు త్యాగం చేయక తప్పదు. ప్రజల కోసం పని చేయటం అన్నది ఉద్యోగం కాదు, గ్రామ జీవితాన్ని తన జీవితంగా మార్చుకొని నిరంతరం పని చేయవలసిన చర్య. అట్ల ప్రజల కోసం జీవితాలను అంకితం చేసిన వ్యక్తులను ప్రజలు మర్చిపోరు. తరతరాలు వాళ్ల సేవలను జనం తమ మనోఫలకాలపై భద్రంగా దాచుకుంటుంది. సర్పంచ్ అంటే కొన్ని ఆవాసాలు, కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతానికి నాయకత్వం వహించే పదవి మాత్రమే కాదు, మొత్తం గ్రామాన్ని సముదాయంగా చూస్తే అందులో ప్రజలకు ఏమాత్రం ఇబ్బందులు కలగకుండా వారి బాగోగులను ఎప్పటికప్పుడు కనిపెడుతూ వారి కుటుంబ పెద్దగా నిలిచే పెద్ద మనిషి.
గ్రామ ప్రజల కోసం ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొని నిలిచి ప్రజల పక్షంగా పని చేసిన సర్పంచులను గ్రామాలు మరచిపోవు. అలాంటి త్యాగధనులైన సర్పంచులు ఎంతో మంది ఉన్నారు. గ్రామాన్ని, గ్రామంలోని రోడ్లను, కాలువలను, డ్రైనేజీ విధానం, పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశాలు, ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలు, బహిరంగ ప్రదేశాలలో మల, మూత్ర విసర్జన చేయకుండా ఉండే దశకు రావటం, రోడ్ల వెంట, ఇంటి ముందట చెట్ల పెంపకం, కూరగాయల సాగు, పండ్ల చెట్లను పెంచడం, గ్రామంలో ఉన్న స్కూళ్లను శుభ్రంగా ఉంచటం, వూర్లో ఉన్న స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు కళకళలాడే విధంగా సున్నాలు వేసుకోవటం బడిలో పిల్లలకు మంచినీళ్లు అందే విధంగా చూడటం, స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలలో మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవటం, పార్కులను ఎంతో అందం గా, ఆహ్లాదంగా తీర్చిదిద్దటం,
ఉదయం, సాయంత్రం, వాకింగ్‌కు కావాల్సిన ప్రదేశాలకు స్థలాలు సన్నద్ధం చేసుకోవటం, ఆట స్థలాలు నిర్మించాలి. ఈ తరం పిల్లలు ఎంత ఎక్కువగా క్రీడల్లో, సాంస్క ృతిక కళల్లో పాల్గొనేటట్లు చేస్తే వాళ్లల్లో పోటీతత్వం పెరుగుతుంది. వూరును తీర్చిదిద్దుకున్న తీరును చూస్తే అందులో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ అభివృద్ధి కమిటీల నిర్వాహకుల కృషి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రజలందరినీ ఏకం చేసి ప్రతి పనిలో పాల్లొనేటట్లు చేయాలి. అందుకు సంబంధించిన ప్రేరణ నాయకత్వం వహించే నాయకులే కల్గించగలరు. గ్రామ పాలకులు సేవకులుగా మారి అడుగులు వేస్తే వారివెంట వూరే కదలివస్తుంది. ఇది అనుకున్నంత సులభం కాదని ఆచరణలో వున్న గ్రామ పాలకులందరికీ, ప్రజాప్రతినిధులకు బాగా తెలుసు. ఎంత కష్టమైన పనైనా తన భుజం మీద వేసుకుని బాధ్యతగా నడిచేవారే నాయకులు. చిత్తశుద్ధి, త్యాగం, ధైర్యనిరతి గల నాయకుల్ని, ప్రజా సేవకుల్ని ప్రజలు ఎప్పటికీ మరువరు. అందుకు నాయకుడే మోడల్‌గా మారాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా తమ పరిధిలో చేయాల్సిన పనిని చేయాలి. ఇది అందరి మనసుల్లోకి రావాలి. ఇందుకు స్థానిక నాయకులు కదలాలి. ప్రజల్ని కదిలించాలి. స్థానిక నేతలు మహత్సంకల్పంతో అడుగులు వేయాలి. ప్రజలందరినీ ఆ దారుల్లో నడిపించాలి. 2015 ఆగస్టు 17న ఆదర్శ గ్రామమైన గంగదేవిపల్లెలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడతుంటే ఆయన ప్రజలకు కలిగించిన ప్రేరణను చూసి తెలంగాణ సమాజం ముగ్దులైంది.
“గంగదేవిపల్లెకు నేను రాలేదు. సిఎంను రప్పించే గంగమ్మ తల్లులు ఇక్కడున్నారు. ఈ వూరు కోసం మీరు చేసిన కృషి, మీ పనులే నన్నిక్కడకు రప్పించాయి. పదిమంది కలిసి చేతులు కలిపితే గొప్ప ఆవిష్కరణలు జరుగుతాయి. కలిసి పని చేస్తే సాధ్యం కానిది లేదు. గంగదేవిపల్లికి రెండు చేతలు జోడించి శిరసు వంచి నమస్కరిస్తున్నా” అని సిఎం వినమ్రంగా చెప్పి మొత్తం తెలంగాణ సమాజాన్ని పల్లెప్రగతిలో పాల్గొనేటట్లు చేశారు. ఇది గొప్ప స్ఫూర్తి కల్గిస్తుంది. సంకల్పం నెరవేరే దాకా పట్టువదలకుండా పని చేయాలన్న స్ఫూర్తిని వదలకూడదు. అనేక సమస్యలుంటాయి. ఒక పని చేయటానికి అడుగు ముందుకు వేస్తే వెనక్కి గుంజేసే వాళ్లు కూడా అడుగడుగునా ఉంటారు. ఇది ఆచరణలో వున్న సర్పంచ్‌లు, వార్డు సభ్యులు అనేక చోట్ల అడ్డంకులు కలిగించే వారిని నిత్యం ఎదుర్కొంటూనే ఉంటా రు. దీనికి కూడా గంగదేవిపల్లిలో సిఎం పురాతన కథ ఒకటి చెప్పి మొత్తం స్థానిక పాలకులకు స్ఫూర్తి కలిగించారు.
“రామాయణంలో రామ రావణ యుద్ధ సమయంలో రాక్షసుల బలాన్ని ఎదుర్కొనేందుకు రాముడు వేసిన రామబాణానికి రాక్షసులందరూ పోగా కొంత మంది సగం ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ “అయ్యా మాగతేంది? మేం చావకుండా బతకకుండా ఉన్నాం” అని రామున్ని వేడుకున్నారు. ‘మీరేం భయపడకండి, రేపు కలియుగమంటూ ఒకటి వస్తుంది. అప్పుడు మీరు ఊరుకో నలుగురు చొప్పున పుడతారు’ అని వరమిస్తాడు. అగో..గా వరంతో పుట్టినోళ్లే ఊర్లల్లో ఉంటారు. మనం మంచి పని చేసిన అడ్డుపడతారు” అని కెసిఆర్ చెప్పడంతో సభలో కరతాళ ధ్వనులు మోగాయి. “అలాంటి వారిని అస్సలు లెక్క చేయవద్దు. మనం పోతుంటే వత్తరు. అడ్డుపడతరు. ఇటువంటి ప్రతీప శక్తులకు, నెగిటివ్ ఫోర్సెకు భయపడి మనం చేయాలనుకునే మంచిపని, ధర్మమైన పని ఆపకూడదు. ధైర్యంగా ముందు కు సాగుతూనే ఉండాలి” అని కెసిఆర్ గంగదేవిపల్లి సభలో ఇచ్చిన పిలుపు ప్రతి సర్పంచ్‌కు, ప్రతి పంచాయతీ పాలక మండలికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
మానవీయ విలువలతో అల్లుకున్న మానవ సంబంధాల గూడు గ్రామం. మనుషుల మధ్య ఐక్యతను తేవాలి. కుల మతాల బెర్రలను చెరిపేస్తూ పల్లె ప్రజలంతా ఐక్యమత్యంగా ఉండే మన తెలంగాణ సంస్క ృతిని ప్రతి వారిలో నాటాలి. గెలిచే ఒక వూరి అభివృద్ధి విజయం మరొక వూరి అభివృద్ధికి సామాజిక సాంస్క ృతిక తలుపులు తెరుస్తుంది. వూరు విజయం అంటే అది ఆ పల్లె ప్రజలందరి సామూహిక విజయం. వూరును గెలిపించటమంటే ఆ వూరి ప్రజలందరి జీవితాలను వెలిగించటమే అవుతుంది. వూరి ప్రగతికోసం జరిగే కృషిని రాజకీయ రంగులు పులిమి వంద వంకర్లు తిప్పి మాట్లాడేవాళ్లు ఉంటారు. అడుగులు వేస్తున్నప్పుడు కొన్ని సార్లు తడబడవచ్చును. దాన్ని చూసి అసలు అడుగులే ఆపివేయాలనటం ఎంత అసంబద్ధమో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రోత్సహించాలి. కానీ నిరుత్సాహపరచకూడదు. నిరుత్సాహక శాస్త్రాలను చదువుకున్న నిత్య నిరాశావాదుల నిరాశ్రయ సంగీతం వినవలసిన అవసరం లేదు. తెలంగాణ పల్లెలిప్పుడు సహజ వికాస స్వయం ప్రతిపత్తి కేంద్రాలుగా తీర్చిదిద్దబడే దశకు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఈ దశలో ముందుకు సాగి గెలిచే పల్లెల విజయాలన్నీ ఇతర పలెల్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. ఇది నడుస్తున్న గ్రామీణ తెలంగాణ వర్తమాన చరిత్ర.

జూలూరు
గౌరీశంకర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News