Wednesday, January 22, 2025

ఆత్మీయ స్వాగతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : శీతాకాల విడిది కోసం సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు సిఎం పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌సిలు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులను, అధికారులను పేరుపేరునా రాష్ట్రపతికి కెసిఆర్‌పరిచయం చేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కె.టి.రామారావు, టి.హరీశ్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జి.జగదీష్ రెడ్డి, ఎస్.నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, సిహెచ్.మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభలో బిఆర్‌ఎస్ పక్షనేత కె.కేశవరావు, లోక్ సభలో బిఆర్‌ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, సిఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్‌పి చైర్మన్లు, పలు శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులందరూ రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలకడంతో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో సందడి నెలకొన్నది.కాగా ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దర్శనం కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి గవర్నర్ తమిళిసైతో కలిసి రాష్ట్రపతి ముర్ము హెలీకాఫ్టర్‌లో కర్నూలు జిల్లా శ్రీశైలంకు చేరుకున్నారు. అక్కడ రాష్ట్రపతికి కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి, ఎపి ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, ఎంఎల్‌ఏలు, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ డాక్టర్ హరి జవహర్ లాల్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవ స్థానం ఈఓ లవన్న, అర్చక స్వాములు వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

శ్రీశైలంలో ప్రత్యేక పూజలు
శ్రీశైలం ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత రత్నగర్భ గణపతి స్వామిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబికా అమ్మవారికి కుంకుమార్చన చేశారు. అక్కడి మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీశైలం సున్నిపెంట హెలీప్యాడ్ నుండి ప్రత్యేక కాన్వాయ్‌లో రోడ్డు మార్గాన సాక్షి గణపతి ఆలయానికి బయలుదేరి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం భ్రమరాంబికా గెస్ట్ హౌజ్‌కు వెళ్లారు. కొద్ది సేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబికా దేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ‘ ప్రసాద్ ’ పథకంలో భాగంగా శ్రీశైలం దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించి అక్కడి నుంచి నేరుగా సున్నిపెంట హెలీప్యాడ్‌కు చేరుకుని తిరిగి హైదరాబాద్‌లోని హకీంపేటకు చేరుకున్నారు.

రాజ్‌భవన్‌లో తేనేటి విందు
రాష్ట్రపతి నగరానికి వచ్చిన సందర్భంగా రాజ్‌భవన్‌లో తేనేటి విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎంఎల్‌ఎలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News