Saturday, November 9, 2024

కెసిఆర్ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

- Advertisement -
- Advertisement -

దమ్మున్న నాయకుడు, ఇచ్చిన మాట తప్పని నేత. ప్రజలకు సేవ చేయడమే రాజకీయం అనే రాజకీయవేత్త సిఎం కెసిఆర్. పరిపాలనలో కొత్త దృక్పథం, పనుల్లో పారదర్శకత, నిర్ణయాల పట్ల నిబద్ధత ఇవన్నీ ఉన్న నాయకుడు ప్రజల్లోకి వెళ్లడానికి ఆలోచించడు. నే చేసిన పాలన ఎలా ఉందో చెప్పండి… సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి అంటూ నిఖార్సయిగా మాట్లాడే ఏకైక ముక్కుసూటి మనిషి కెసిఆర్ నేమో! దాచిపెట్టడాలు, దాటవేతలూ లేవు. శిలాఫలకం వేస్తే రెండు వారాల్లో పని ప్రారంభం కావాల్సిందే అని ప్రకటించే గట్స్ చూసి అధికారులే నివ్వెరపోతున్నారు. తాత్సారాలు, నాన్చివేత ధోరణలు ఈ నాయకుడి దగ్గర పనికి రావు. పని మాత్రమే మాట్లాడుతుంది. మన పాలనతోనే ప్రజలను గెలవగలం అంటున్న మహానేత తన పనికి మార్కులు వేయించుకునేందుకు ప్రజల సమక్షానికి వెళ్లబోతున్నారు.

తన తొమ్మిదిన్నరేళ్ళ పాలనపై ప్రజల తీర్పు కోసం సిద్ధమవుతున్నారు. దేశంలో ఏ రాజకీయనాయకుడు ఇప్పటి వరకు చేయని సాహసం కెసిఆర్ చేశారు. ఎన్నికలు జరగడానికి ఇంకా మూడు నెలలు వ్యవధి ఉండగానే బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులను ముందుగానే ప్రకటించి చరిత్ర సృష్టించారు.అదీ తెగింపంటే. అదీ తన పాలనపై తనకున్న విశ్వాసం అంటే. నిజంగా పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా? పక్కదారి పడుతున్నాయా? అధికారులు ప్రజలు మెచ్చేలా పని చేస్తున్నారా? ప్రజా సమస్యల పట్ల సరైన రీతిలో స్పందిస్తున్నారా? క్షేత్రస్థాయిలో పథకాల అమ లు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? ఇవన్నీ స్వయంగా తెలుసుకుని, లోపాలుంటే సరిదిద్దుకున్న కెసిఆర్ ఎన్నికల సంగ్రామానికి సిద్ధమయ్యారు. అన్ని పార్టీలకన్నా ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి విపక్షాలకు సవాల్ విసిరిన యోధుడు కెసిఆర్.

ముచ్చటగా మూడోసారి తన పాలనపై ప్రజాభిప్రాయాన్ని కోరుకోవడమే అసలైన నాయకుడి లక్షణం. అదే కెసిఆర్ విజయ రహస్యం అనుకోవచ్చు. గత తొమ్మిదిన్నరేళ్ళ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలే బిఆర్‌ఎస్ గెలుపుకి శ్రీరామ రక్షని కెసిఆర్ భావన.అందుకే ఒక్కసారే 115 మంది అభ్యర్ధుల పేర్లను వెల్లడించి సంచలనం సృష్టించారు. ఇప్పటికే అనేక అంశాల్లో నంబర్ వన్‌గా నిలిచి చరిత్ర సృష్టిస్తున్న కెసిఆర్ మోడల్ పాలన ఎన్నికల రంగంలోనూ తనదైన ముద్ర వేస్తూ రాజకీయ ప్రత్యర్ధులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కక్ష్యలోని ముఖ్య ఘట్టం ల్యాండింగ్ పూర్తయింది. ఎలాంటి ఆందోళనలు లేకుండానే కుదుపులకు లోను కాకుండానే సేఫ్ ల్యాండింగ్ కావడం ద్వారా తెలంగాణ ప్రజల మనసును కెసిఆర్ గెలిచారు. తెలంగాణ భవిష్యత్తుకు భరోసానిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఫలితాలను నల్లేరు మీద నడకగా మార్చేశారు. ఎన్నికల యుద్ధం జరగడానికి ఇంకా మూడు నెలల ముందే బిఆర్‌ఎస్ శంఖారావ ప్రతిధ్వని ప్రతిపక్షాల గుండెల్లో గుబులు రేపింది.

యుద్ధం చేయక ముందే ప్రత్యర్ధిని ఓడించిన దార్శనికతతో, అత్యంత సూక్ష్మజ్ఞానంతో కూడిన సైద్ధాంతిక, తాత్వికతతో కెసిఆర్ ప్రదర్శించిన రాజనీతికి దేశ రాజకీయ విమర్శక లోకం సైతం జేజేలు పలకడం విశేషంగా పేర్కొనవచ్చు. ఎటువంటి గజబలం గానీ, రథబలం గానీ, అశ్వబలం గానీ, వందలాది అక్షౌహిణుల సైన్యం గానీ మాకు వద్దే వద్దు.. మా వైపున కృష్ణుడుంటే చాలు.. మా విజయం ఖాయం అని ఆనాడు పాండవులు కోరుకున్నట్టుగా బిఆర్‌ఎస్ గెలుపుకు కెసిఆర్ ఒక్కరుంటే చాలు. లక్షల అక్షౌహిణులతో సమానం. రాబోయే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్ధులు అత్యధిక మెజారిటీతో గెలిచేందుకు హ్యాట్రిక్ విజయాన్ని సాధించేందుకు కెసిఆరే బలం బలగమని చెప్పాలి.

కెసిఆర్ సంక్షేమ పాలన పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణ చెక్కుచెదరలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పేదలకు నిరంతరాయంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90% మందికి నేరుగా అందుతున్న నగదు సాయం, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక పాలన.. బిఆర్‌ఎస్ జనాదరణను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో వందకు పైగా అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం అసాధ్యం కాదని కెసిఆర్ నమ్మకం నిజమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే ఊపును కొనసాగించడం, ఓ రకంగా అంతకంటే ఎక్కువగా సీట్లను గెలుచుకునే అవకాశాన్ని, పరిస్థితులను సృష్టించుకోవడం ముఖ్యమంత్రిగా కెసిఆర్ కే చెల్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News