దశాబ్దాలుగా గూడు కట్టుకుపోయిన మూసభావన, వివక్షను తరిమివేస్తూ విలక్షణ ఆలోచనలతో మానవీయ కోణంలో ప్రవేశపెట్టిన కెసిఆర్ సంక్షేమ పథకాలు రద్దు దిశగా రేవంత్ సర్కారు ఆలోచన చేస్తున్నది. కెసిఆర్ పథకాలను రద్దు చేస్తం అని నేరుగా చెప్పే దమ్ము ధైర్యం లేక ఆ పథకాల ఊసెత్తే సాహసం చేయడం లేదు. అంతేకాదు కాంగ్రెస్ రెండోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ కెసిఆర్ పథకాలకూ దమ్మిడి సొమ్ము కేటాయించకపోవడం వివక్ష, పక్షపాత ధోరణిని స్పష్టం చేస్తున్నది. 2025-26 వార్షిక బడ్జెట్‌లో రైతుబంధు పేరు మార్చి రైతుభరోసాకు అరకోరగా కేటాయించారే తప్ప కెసిఆర్ అమ్ముల పొదిలోని అస్త్రాలైన పథకాలను పేరెత్తే ధైర్యం చేయడం లేదు. అధికారంలోకి వచ్చిన తొలినాటి నుండే కెసిఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని చెబుతున్న సిఎం రేవంత్ రెడ్డి ఆచరణలో అమలు చేస్తూ ప్రతీకారం, కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నట్టు తేటతెల్లమవుతున్నది. కెసిఆర్ ఏ పథకం ప్రవేశపెట్టినా దాని వెనుక ఓ నేపథ్యం, ఓ కారకం ఉంటుంది అంటే ప్రజల కష్టాల్లోంచి పుట్టిన పథకాలను పదేండ్ల పాటు తెలంగాణ ప్రజలకు అందించారు. నిత్యం మనుషుల్ని చదివి పుస్తకాలతో మాట్లాడిన ప్రతీ సందర్భంలో ఒక్కో పథకానికి పునాది వేశారు. కెసిఆర్ సర్కారు అమలు చేస్తున్న ప్రతి పథకానికీ ఓ బలమైన నేపథ్యం ఉంది.
కెసిఆర్ జీవితానుభవాలతో అది ముడిపడి ఉంది. ఆయన అంతర్మథనంలోంచి పుట్టుకొచ్చి ఉంటుంది. ఏదో తండాలో పల్లెనిద్రకు వెళ్లినప్పుడు అనుకోని సంఘటనలో ఓ గిరిజనుడి ఇల్లు అగ్నిప్రమాదానికి బూడిదై కష్టార్జిత సొమ్మూ కాలిపోతే ఆ ఇల్లాలి ఏడుపులు కెసిఆర్‌ను ఉద్వేగానికి గురిచేశాయి. అప్పుడే, మనసులో ‘కల్యాణ లక్ష్మి’ కి బీజంపడింది. కాని తాము అధికారంలోకి వస్తే కెసిఆర్ కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామన్న రేవంత్ సర్కారు ఈసారి బడ్జెట్‌లో సున్నా కేటాయింపులు చేయడం విడ్డూరం. కెసిఆర్ దుబ్బాకలో చదువుకునే రోజుల్లో బీడీ కార్మికుల బతుకులు, వెతలను చూసి అధికారంలోకి వచ్చినంక పెన్షన్ స్కీమ్‌కు పునాది వేశారు. ఒంటరి మహిళలు, వృద్ధులు, నేత, గీత, బీడి కార్మికులతో పాటు దివ్యాంగులు పెన్షన్లు అన్నీ కలుపుకుని ఇవాళ పాత వాళ్లే 46 లక్షల మంది ఉన్నారు. వారందరికీ అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని బాసచేసి అందలమెక్కిన కాంగ్రెస్ మొండి చేయి చూపుతూ తన సహజ స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నది. కెసిఆర్ నాయకుడిగా కంటే రైతుగానే సీనియర్. రైతు కుటుంబంలో పుట్టి పొలాల మధ్య పెరిగి సేద్యం చేశారు. తీవ్రమైన కూలీల కొరత, కమ్ముకొస్తున్న కరవు, కరెంట్ కోతలు, పెట్టుబడి సాయం లేక అన్నదాతల వెతలనుండి పుట్టిన పథకాలే 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు సహా ఇతర పథకాలు.
నిరుపేద మహిళలు గర్భం దాల్చిన తర్వాత కూడా కూలీ పనులు చేస్తుంటారు. అది తల్లి ఆరోగ్యానికి కానీ, శిశువు ఆరోగ్యానికి కానీ మంచిది కాదు. వారు కూలీకి వెళ్లే డబ్బులను భర్తీచేసేందుకు మానవీయ కోణంలో తీసుకొచ్చిందే కెసిఆర్ కిట్. అలాంటి పథకాల ఊసే లేదు. ప్రధానంగా తెలంగాణ ప్రజల కష్టాల్లోంచి పుట్టిన పథకాలకు ఈసారి పద్దులో దళితబంధు ప్రస్తావనే లేదు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుల గురించి మాటే లేదు. ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయం అందించి, వారు తమకు నచ్చిన, నైపుణ్యం ఉన్న రంగంలో వ్యాపారులుగా ఎదిగేందుకు కెసిఆర్ సర్కారు తీసుకొచ్చిన దళితబంధు చేయూత అందించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల హామీల్లో భాగంగా దళిత బంధును రూ. 12 లక్షలకు పెంచి అమలు చేస్తామని ప్రకటించింది. గత బడ్జెట్‌లో గాని, ఈ బడ్జెట్‌లో గాని దళిత బంధుకు నిధులు కేటాయించలేదు. తప్పుల తడకతో బోగస్ సర్వేలు చేసి బిసిల కోసం కులగణన పూర్తి చేశామని చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో వారి అభ్యున్నతిపై చర్చించలేదు. ఉప్పల్ భగాయత్, కోకాపేటల్లో కోట్లలో విలువ చేసే భూములను గతంలో కెసిఆర్ కేటాయించి భవనాలకు నిధులు మంజూరీ చేస్తే రెండు బడ్జెట్లలో వాటి ఊసేలేదు. కులవృత్తులపై ఆధారపడి జీవించేవారికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం కెసిఆర్ అందించి 4.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులని తేల్చారు. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన రెండు బడ్జెట్‌లలో ఈ పథకాన్ని పక్కనపెట్టి నిధులు కేటాయించలేదు. బిసిల కోసం ఫూలే పేరుతో ఎస్‌సి, ఎస్‌టిల కోసం అంబేద్కర్ పేరుతో ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లను బిఆర్‌ఎస్ సర్కారు అందించింది.
దీనికి విదేశీ విద్యానిధి పథకం పేరిట కెసిఆర్ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క విద్యార్థికి పైసా ఇవ్వలేదు. మాంసం ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉండాలని గొర్రెల పంపిణీ పథకం అమల్లోకి తెచ్చిన కెసిఆర్ రెండు విడతల్లో కలిపి 4.2 లక్షల యూనిట్లు పంపిణీ చేశారు. బడ్జెట్‌లో గొర్రెల పథకానికి చోటే కల్పించలేదు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం 2018-19 వానా కాలం పంట సమయంలో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత ఎకరానికి పంటకు రూ. 4000 చొప్పున రెండు పంటలకు కలిపి రూ. 8 వేల చొప్పున చెల్లించింది. 2018-19 వానా కాలంలో 50.25 లక్షల మంది రైతులకు 5236.29 కోట్లను అందజేసింది. ఆ తర్వాత పంటకు రూ. 5 వేలకు ప్రభుత్వం పెంచింది. అలా మొత్తంగా నిరుడు వానా కాలం వరకు రూ. 72,817.04 కోట్లను రైతులకు ఆర్థిక సాయాన్ని అందజేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరిట రూ. 15 వేలు ఇస్తామని ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 15 వేల సంగతి దేవుడెరుగు కెసిఆర్ సర్కారు ఇచ్చిన రూ. 10 వేలకు కూడా రైతులు నోచుకోవడం లేదు.
గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817
(చైర్మన్ టి- కెసిఆర్ సెంటర్)