మీటర్లు పెట్టనందుకే నిధులు ఇవ్వలేదని నిర్మలా సీతారామన్ సిగ్గులేకుండా చెప్పారు
సూర్యాపేట సభలో సిఎం కెసిఆర్ కౌంటర్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపికి ఓటేస్తే మోరిలో పారేసినట్టే బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టనందుకే నిధులు ఇవ్వలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిగ్గులేకుండా చెప్పారని మండిపడ్డారు. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రే ఈ విషయాన్ని ఒప్పుకున్నారని చెప్పారు. తెలంగాణలో రైతాంగానికి తాము ఉచిత కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ప్రతి బాయి కాడ మీటర్ పెట్టాలని మోడీ అంటే సచ్చినా పెట్టనని చెప్పానని పేర్కొన్నారు. దీంతో తెలంగాణకు రావలసిన రూ. 25 వేల కోట్ల నిధులు కేంద్రం ఇవ్వలేదని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని, తాను ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని ఆగ్రహం వ్యకం చేశారు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని చట్టం ఉన్నా కేంద్రం ఇవ్వలేని మండిపడ్డారు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని, ఒక్క నవోదవ పాఠశాల ఇవ్వని బిజెపి పార్టీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వెయ్యాలి..? అని ప్రశ్నించారు. బిజెపికి ఓట్లు వేసే బదులు బిఆర్‌ఎస్ అభ్యర్థి జగదీశ్‌రెడ్డికి వేస్తే ఆయన మెజారిటీ అయినా పెరుగుతుందని అన్నారు.
ఉన్న విషయాన్ని నిర్మలా సీతారామన్ బయటపెట్టారు : హరీశ్‌రావు
మోటార్లకు మీటర్లు పెట్టనందుకే డబ్బులు ఇవ్వలేదు అన్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి- నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై హుస్నాబాద్ సభలో మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ గొంతులో పానం ఉన్నంత కాలం బోరు బాయి కాడ మీటర్ పెట్టా అని అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. నిర్మలా సీతారామన్ ఉన్న విషయాన్ని బయటపెట్టారని, దీంతో బిజెపికి ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ వాళ్ళు మీటర్లు పెట్టలేదు కాబట్టి డబ్బులు ఇవ్వలేదు అని నిర్మలా సీతారామన్ క్లియర్‌గా చెప్పారని స్పష్టం చేవారు. మోటార్లకు మీటర్లు అని బిజెపి, మూడు గంటలు కరెంటు అని కాంగ్రెస్ అంటున్నదని.. ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని మంత్రి హరీశ్ రావు ప్రజలను కోరారు.