జగిత్యాల: ముఖ్యమంత్రి కెసిఆర్ సారు పాలన మంచిగ చేస్తుండు.. ఇంటింటికి ఎదో ఒకటి ఇత్తుండు… ఆయన కడుపు సల్లగుండాలే అంటూ రోడ్డు పక్కన కంకులమ్మే నర్సమ్మ సిఎం కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవితకు చక్కగా వివరించింది. ఉమ్మడి కరీంనగర్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎల్. రమణ తండ్రి మృతి చెందగా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సోమవారం రమణను పరామర్శించేందుకు జగిత్యాలకు వచ్చారు.
పరామర్శ అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా మల్యాల మండలం నూకపల్లి వద్ద రోడ్డు పక్కన కంకులమ్మే నర్సమ్మ దగ్గర కవిత కంకులు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కవిత కెసిఆర్ పాలన ఎలా ఉందంటూ ఆరా తీయగా నర్సమ్మ వెంటనే బదులిస్తూ కెసిఆర్ పాలన బాగుంది బిడ్డా… తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో ప్రతి ఇంటికి మేలు కలిగింది.. ఆయన కడుపు సల్లగుండాలే… పది కాలాల పాటు పాలన జేయ్యాలే అంటూ కెసిఆర్ పాలనను మెచ్చుకుంది. నర్సమ్మ చెప్పిన విషయాలతో కవిత సంతోషపడగా ముఖ్యమంత్రి బిడ్డ తన వద్ద కంకులు కొనుక్కుని బాగున్నాయంటూ మెచ్చుకోవడంతో నర్సమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ముఖ్యమంత్రి బిడ్డ రోడ్డు పక్కన కంకులు అమ్మే నర్సమ్మ వద్ద ఆగి కంకులు కొనుగోలు చేయగా రోడ్డు వెంబడి వెళ్లే వాహనదారులు కవితతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరిని కవిత ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు. కాగా కవిత సాదాసీదాగా రోడ్డు పక్కన కంకులు కొనుగోలు చేయడంతో పాటు అందరితో అప్యాయంగా పలకరించిందంటూ వాహనాదారులు చర్చించుకున్నారు.