అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామి
గ్రామీణ ప్రాంతాంల్లో ఆర్థిక పరిపుష్టి
రిజర్వేషన్లతో రాజకీయాల్లోకి మరింత మంది మహిళలు
మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ కు ముడిపెట్టడం సరికాదు
దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది
ఎన్‌ఐఎస్‌ఏయూ సభ్యులతో కల్వకుంట్ల కవిత ఇష్టాగోష్టి
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన తెలంగాణలో స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న కవిత నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని అసోసియేషన్,యుకె (ఎన్‌ఐఎస్‌ఎయు) సభ్యులతో సంభాషించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలు సమాధానాలు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం వంటి అంశాలపై కవిత తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే సకల జనుల సర్వే నిర్వహించామని, దాని వల్ల రాష్ట్రంలోని ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల వివరాలను సేకరించామని తెలిపారు. ప్రజలను పైకి తేవడానికి ప్రస్తుతం ఆ వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పారు. సిఎం కెసిఆర్ ప్రభుత్వం కులవృత్తులకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. ఉదాహరణకు చెరువులు మరమ్మత్తు చేసి ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం వల్ల రాష్ట్రంలోని మత్స్యకారుల జీవితాల్లో గణనీయమైన మార్పు సంభవించిందని వివరించారు. దళితబంధు వంటి పథకాల వల్ల ఆ వర్గాల్లో ఆర్థిక శక్తి పెరిగిందని, ఆ వర్గాల వారు పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదిగాయని చెప్పారు. వ్యవస్థీకృత డెలివరీలను ప్రోత్సహించడానికి గానూ శిశువులకు జన్మనిచ్చిన తల్లులకు కెసిఆర్ కిట్‌లు పంపిణీ చేస్తున్నామని, గర్భిణీ సమయంలోనూ మహిళలకు ప్రభుత్వం నెలకు రూ. వెయ్యి అందిస్తోందన్నారు.
తెలంగాణ విద్యావ్యవస్థలో సమూల మార్పులు
తెలంగాణ విద్యావ్యవస్థలోనూ సమూల మార్పులు వచ్చాయని ఎంఎల్‌సి కవిత పేర్కొన్నారు. క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నామని, ప్రభుత్వం అందించిన ప్రోత్సహంతో సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివే మాలవత్ పూర్ణ మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిందని ప్రస్తావించారు. మైనారిటీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పామని, తద్వారా మైనారిటీల్లో గతంలో ఎప్పుడూ లేనంతగా పాఠశాలలకు వెళ్తున్నాయని చెప్పారు. మోడల్ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నామని, ప్రతీ జిల్లా కేంద్రంలో ఎస్‌సి,ఎస్‌టిల కోసం ప్రత్యేకంగా హాస్టల్‌తో కూడిన డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని వివరించారు. రిసెర్చ స్కాలర్లకు స్టైఫండ్‌ను మూడు సార్లు పెంచామని, కానీ జాతీయ స్థాయిలో ఆ పరిస్థితి లేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక జీతాలు ఇస్తోందని చెప్పారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాఫిక్ కానిస్టేబుళ్లకుకు 30 శాతం రిస్క్ అలవెన్సు అందిస్తున్నామని, రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ. 20 వేల వేతనం లభిస్తోందని వివరించారు. హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాల గురించి కవిత వివరించారు. సిఎం కెసిఆర్ కృషి వల్ల తెలంగాణ ప్రగతి పథంలో నడుస్తోందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత సిఎం కెసిఆర్ ఆలోచన అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను
సిఎం కెసిఆర్ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేశారని చెప్పడంలో సందేహమే లేదని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కావడమే తన లక్ష్యమని, పదవులు ముఖ్యం కాదని కెసిఆర్ అన్నారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో రాశారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ అలసత్వం వహిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి యుపిఎ కూటమి నుంచి బయటికి వచ్చారని తెలిపారు. ఆ సందర్భంలోనే తెలంగాణ కోసం కరీంనగర్ ఎంపి పదవికి రాజీనామా చేసి తిరిగి కెసిఆర్ పోటీ చేసినప్పుడు తాను మొదటిసారి రాజకీయ ప్రచారం చేశానని గుర్తు చేసుకున్నారు. తాను ప్రచారం చేస్తున్న క్రమంలో ఒక గ్రామీణ మహిళ తనకు ఒక వెయ్యి రూపాయల ఆదాయం ఎక్కువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, ఆ సమయంలోనే ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. అయితే, నేరుగా రాజకీయాల్లోకి రాకుండా తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించానని తెలిపారు. ఆ సంస్థ ద్వారా మహిళా సాధికాతరకు కార్యకలాపాలు చేపట్టడమే కాకుండా తెలంగాణ సంస్కృత, సంప్రదాయాలను ప్రోత్సహించామని, ముఖ్యంగా బతుకమ్మ పండగను ప్రతీ ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వచ్చామని వివరించారు. ప్రస్తుతం 65 నుంచి -70 దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల కోసం చాలా కష్టపడి పనిచేశానని తెలిపారు. ప్రజా జీవితంలో మనం ఏమిటో అన్నది మాత్రమే ప్రజలు చూస్తారని, కుటుంబ నేపథ్యాన్ని కాదని స్పష్టం చేశారు.
భారత్‌లో రాజకీయ పార్టీల్లోనూ మహిళల ప్రాతినిధ్యం తక్కువ
తాను ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తరుచూ లేవనెత్తిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని ఎంఎల్‌సి కవిత తెలిపారు. దేశంలో అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న విషయాన్ని తానే అనేక సందర్భాల్లో గర్తించానని చెప్పారు. భూప్రపంచంలో కేవలం మానవ సమూహంలో మాత్రమే మహిళల పట్ల వివక్ష ఉందని, సమాన అవకాశాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌లో రాజకీయ పార్టీల్లోనూ మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం గతేడాది నవంబర్ నుంచి తాను ఉద్యమాన్ని ఉధృతం చేశానని, ఈ ఏడాది మార్చి నెలలో ఢిల్లీలో భారీ ధర్నా నిర్వహించానని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించానని వివరించారు.
గతంలో మహిళా రిజర్వేషన్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్‌జెడితో సహా దాదాపు 13 పార్టీల నేతలు ధర్నాకు హాజరై మద్ధతు ప్రకటించారని తెలిపారు. ఆ పార్టీల నేతలతో సంతకాలు తసుకొని తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్రపతికి కూడా పంపించామన్నారు. తమ పార్టీ తరఫున పార్లమెంట్‌లో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టామని, ఇతర రాజకీయ పార్టీలపై కూడా ఒత్తిడి తీసుకొచ్చామని చెప్పారు. రాజకీయ పార్టీలు వాటంతట అవే మహిళలకు అవకాశాలు కల్పిస్తాయని భావించలేమని, కాబట్టి చట్టం ద్వారానే రాజకీయ వ్యవస్థలో మహిళలకు అవకాశాలు సాధించగలమన్నది తన అభిప్రాయమన్నారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును డీ లిమిటేషన్‌కు ముడిపెట్టడం సరికాదని సూచించారు. దేశంలో అనేక ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని తెలిపారు. తెలంగాణ స్థానిక సంస్థల్లో 55- నుంచి 57 శాతం మహిళా ప్రజాప్రతినిధులే ఉన్నారని చెప్పారు. కానీ సమావేశాలు నిర్వహిస్తే ఎక్కువ పురుషులు కనిపిస్తారని, ఆ పరిస్థితి మారాలని స్పష్టం చేశారు. ఆ దిశగా బిఆర్‌ఎస్ కృషి చేస్తుందని, మార్పు సాధ్యమని ఆశిస్తున్నానన్నారు. మరోవైపు, మహిళా భద్రత గురించి తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, షీ టీమ్స్ ఏర్పాటు చేసిందని చెప్పారు. రాజకీయ పార్టీలు సమాజంలోని అన్ని వర్గాల గురించి ఆలోచించాలని, అందుకోసమే అన్ని వర్గాలకు అవకాశాలు రావాలని ఎంఎల్‌సి కవిత ఆకాంక్షించారు.