ఆ బిడ్డ బాగుకు, ఎదుగుదలకు అది దోహదం చేస్తుంది
బాంబే హైకోర్టు స్పష్టీకరణ
ముంబయి: బిడ్డను తల్లి వద్ద ఉంచడం అత్యంత సహజమైన న్యాయమని, అంతేకాకుండా ఆ చిన్నారి సంక్షేమానికి, ఎదుగుదలకు దోహదపడుతుందని బొంబాయి హైకోర్టు గురువారం పేర్కొంది. అంతేకాకుండాతమ అయిదేళ్ల బిడ్డను తనకు అప్పగించేలా ఆదేశించాలంటూ ఓ టీవీ నటి మాజీ భర్త చేసుకున్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. తమ అయిదేళ్ల కుమారుడిని తన కస్టడీకి అప్పగించాలంటూ ఆ భర్త దాఖలు చేసుకున్న హెబియస్ కార్పస్ పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎస్‌ఎస్ షిండే, ఎన్‌ఎ జమాదార్‌లతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. తల్లి పంరక్షణలోనే బిడ్డ ఉండడం ఆ చిన్నారి సంక్షమానికి, ఎదుగుదలకు దోహదపడుతుందని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది.
ఇంత చిన్న వయసులో బిడ్డకు తల్లి ప్రేమ, ఆప్యాయత, రక్షణ అవసరమని, అందువల్ల ఆ బిడ్డను తల్లి వద్దే ఉంచడం న్యాయంగాను, ఆ బిడ్డ అభివృద్ధికి దోహదపడుతుందని తాము భావిస్తున్నామని బెంచ్ పేర్కొంది. తల్లి చూపించే ప్రేమ, ఆప్యాయతలు తండ్రే కాదు, మరే వ్యక్తినుంచి కూడా బిడ్డకు లభించవని బెంచ్ పేర్కొంది. అయితే బిడ్డకు తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమ అవసరమేనని బెంచ్ అభిప్రాయపడుతూ, ప్రతి రోజూ అరగంట పాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, వారానికి రెండు రోజులు నేరుగా బిడ్డను చూడడానికి తండ్రికి అవకాశం ఇవ్వాలని బెంచ్ ఆ నటిని ఆదేశించింది.