Sunday, September 8, 2024

కీసర మాజీ ఎంఆర్‌ఓ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Keesara former MRO commits Suicide

 

చంచల్‌గూడ జైల్లో ఉరివేసుకొని బలవన్మరణం
అవమానం భరించలేకే?

మనతెలంగాణ/హైదరాబాద్ : లంచం కేసులో చంచల్‌గూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కీసర మాజీ ఎంఆర్‌వొ బుధవారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైల్లోని బాత్‌రూం కిటికీకి తన వద్ద వున్న టవల్‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు జైలు వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈక్రమంలో పోస్టుమార్టం పూర్తికాగానే మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలావుండగా రూ. 1.12 కోట్ల నగదు లంచంగా తీసుకుంటూ కీసర మాజీ ఎంఆర్‌వొ నాగరాజు పట్టుబడటంతో ఎసిబి అధికారులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న నాగరాజు గత కొద్ది రోజుగా ఎవరితోనూ మాట్లాడటం లేదని, ముబావంగా ఉంటున్నట్లు తోటి ఖైదీలు వివరిస్తున్నారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగరాజు కేసులో దాదాపు నెలరోజులుగా ఎసిబి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. కాగా కీసరలో ఒక భూమి వ్యవహారంలో ఎన్‌వొసి ఇచ్చేందుకు రూ.కోటి 12 లక్షల లంచం కేసులో నాగరాజు నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే నాగరాజుపై రాంపల్లి దయార గ్రామంలోని 24.12 గుంటల భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృస్టించిన ఘటనపై విచారణ చేపట్టిన ఎసిబి అధికారులు అతనిపై మరో కేసు నమోదు చేశారు. మొదటి కేసులోని నిందితులకు బెయిల్ లభించగా మాజీ తహశీల్దార్ నాగరాజుపై రెండు కేసులు ఉండటంతో బెయిల్ ఇచ్చేందుకు ఎసిబి కోర్టు నిరాకరించింది. అదేవిధంగా రెండు కేసుల్లోన నాగరాజు ప్రధాన నిందితుడిగా ఉండటంతో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించినట్లు తెలుస్తోంది.

అవమానంతో బలవన్మరణం

నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలో మంగళవారం ఎసిబి అధికారులు కీసర మాజీ తహసీల్దార్ నాగరాజును ఆధారాలతో సహా ప్రశ్నించడంతో అవమానానికి గురైనట్లు సమాచారం. అదేవిధంగా తనపై రెండు కేసులు నమోదు చేసిన అధికారులు రెండుసార్లు కస్టడీలోకి తీసుకోవడంతో కలత చెందిన కీసర మాజీ ఎంఆర్‌వొ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు అతని బంధువులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా రియాల్టర్ కందాడి ధర్మారెడ్డి, అతడి కుటుంబ సభ్యులకు, ఇతరులకు కలిపి దాదాపు 24 ఎకరాల భూమికి అక్రమ పద్ధతిలో పాసు పుస్తకాలు ఎలా జారీ చేశారని నాగరాజును ఆధారాలతో సహా ప్రశ్నించడంతో ఆందోళనకు గురైనట్లు సమాచారం.

అసలు హక్కుదారులు, వారసులు ఉండగా నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు? ఇందుకు ఎవరు సహకరించారు? దీని వెనక ఎంత డబ్బులు చేతులు మారిందని ఎసిబి ప్రశ్నలకు నాగరాజు మౌనంగా ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ కేసులో ఎసిబి అధికారులు బలమైన ఆధారాలు సేకరించడం, గతంలో తనపై నమోదైన కేసును తిరగతోడటంతో నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు పలువురు చర్చించుకున్నారు. ధర్మారెడ్డి స్థానికంగా ఉన్న 140 ఎకరాలు స్వాహా చేద్దామని చేసిన ప్రయత్నానికి ఎలాంటి సహకారం అందించారని ఎసిబి అధికారులు ప్రశ్నించడంతో ఆందోళనకు గురై నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

పిరికివాడు కాదు : నాగరాజు బావ శేఖర్

చంచల్‌గూడా జైల్లో నాగరాజు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంపై మృతుని బావ బాధను వ్యక్తం చేశాడు. ఈక్రమంలో శేఖర్ ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో నాగరాజు మృతదేహం వద్ద బోరున విలపించాడు. నాగరాజు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని, అతని మృతి వల్ల తన కుటుంబం ఒంటరి అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నాగరాజుకు ఇద్దరు పిల్లలు, ఓ కుమారుడు, ఒక కూతురు ఉన్నట్లు చెప్పాడు. కుమారుడు పదో తరగతి, కూతురు ఆరో తరగతి చదువుతున్నట్లు వివరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News