Tuesday, January 21, 2025

బెయిల్ కోసం.. జైలులో రోజూ మామిడి పండ్లు తింటున్నారు: ఇడి

- Advertisement -
- Advertisement -

సుగర్ లెవల్స్ పెరిగేందుకు కేజ్రీవాల్ పాట్లు
జైలులో రోజూ మామిడి పండ్లు తింటున్నారు
అనారోగ్య కారణాలతో బెయిల్ కోసం ఎత్తుగడ
కోర్టులో ఇడి వాదన

న్యూఢిల్లీ: టైమ్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సుగర్ లెవల్స్ పెంచుకుని అనారోగ్య కారణాలతో బెయిల్ పొందేందుకు జైల్లో రోజు మామిడి పండ్లు, పూరీ, స్వీట్లు తింటున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురువారం కోర్టులో వాదించింది. డాక్టర్‌ను సంప్రదించడానికి అనుమతి కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు వాదనలు వింటున్న సందర్భంగా ఇడి ఈ మేరకు కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో జుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు ఆయనకు అందచేస్తున్న ఆహారంపై నివేదికను సమర్పించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. ఆప్ అధినేత తీసుకుంటు డైట్ వివరాలను కూడా సమర్పించాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదిని కోర్టు కోరింది. ఇంట్లో వండిన భోజనం తినేందుకు కోర్టు అనుమతి పొందిన కేజ్రీవాల్ అనారోగ్య కారణాలతో బెయిల్ పొందేందుకు హైసుగర్ ఉండే మామిడి పండ్లు, ఆహారాన్ని తీసుకుంటున్నారని కోర్టుకు ఇడి తెలిపింది. చక్కెర కలిపిన టీ, అరటి పండ్లు, మామిడి పండ్లు, సూరీ, ఆలూ సబ్జీ మొదలైనవి తింటున్నారని తెలిపింది.

టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న కేజ్రీవాల్ అటువంటి ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ సుగర్ లెవల్స్ పెరుగుతాయని తెలిసినప్పటికీ వాటినే రోజూ తీసుకుంటున్నారని ఇడి తెలిపింది. అనారోగ్య కారణాలు చూపించి కోర్టు నుంచి సానుభూతి పొందవచ్చని ఆయన భావిస్తున్నట్లు కనపడుతోందని ఇడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జైలులో రాగ్రీపగలూ ఉండే డాక్టర్లు రోజుకురెండుసార్లు కేజ్రీవాల్‌కు బ్లడ్ సుగర్ లెవల్స్ చెక్ చేస్తున్నారని ఇడి తెలిపింది. కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తీసుకువచ్చినపుడు ఆయన బ్లడ్ సుగర్ లెవల్ 139ఎంజి/ డిఎల్ ఉన్నట్లు ఇడి తెలిపింది. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం బ్లడ్ సుగర్ లెవల్ చెక్ చేసినపుడు అది 276ఎంజి/ డిఎల్ ఉన్నట్లు ఇడి తెలిపింది.

దీనికి కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ మీడియా కోసం ఇడి ఇటువంటి ప్రకటనలు చేస్తోందని తెలిపారు. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇలాంటి ఆహార పదార్థాలు వెరైనా ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జైలులో కేజ్రీవాల్ తీసుకుంటున్న ఆహారాన్ని పోల్చడానికి ఆయనకు కోర్టు అనుమతించిన ఆహార పదార్థాల జాబితాను సమర్పించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను శుక్రవారానికి(ఏప్రిల్ 19) వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News