న్యూఢిల్లీ: సహచరుడు, ఆప్ అగ్రనేత మనీశ్ సిసోడియా ఢిల్లీ పాలనా ప్రగతిదశలో ఇప్పుడు తనతో పాటు కలిసి ఉండలేకపోవడం బాధా కల్గిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. సిసోడియాను తల్చుకుని భావోద్వేగానికి గురైన కేజ్రీవాల్ కంటతడి పెట్టుకున్నారు. దేశ రాజధానిలోని బవానా ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట వెలిసిన నైపుణ్య పాఠశాల కొత్త శాఖను కేజ్రీవాల్ ప్రారంభించారు. విద్యా విషయంలో మరింత ప్రతిభ అవకాశాల దిశలో తరచూ ఆలోచిస్తూ సాగిన సిసోడియా ఇప్పుడు తనతో లేని లోటు బాధాకరం అయిందని తెలిపారు.
విద్యా సమానతకు సిసోడియా ఆలోచనలు కీలకం అన్నారు. ఆయనను తప్పుడు అభియోగాలతో జైలుకు తరించారని, ఆయనకు త్వరలోనే బెయిల్ దక్కుతుందని తెలిపారు. తొందర్లోనే జైలు నుంచి బయటకు వస్తారని చెప్పిన కేజ్రీవాల్ ఎప్పటికీ సత్యం విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. మంచి విద్యా వ్యవస్థ, అందరికి సరైన చదువు దిశలో ఆయన సాగడం, ఆప్ ప్రతిష్ట పెరగడంతో కుళ్లుకున్న బిజెపి కుట్ర ఫలితంగానే ఆయన కష్టాలు అనుభవిస్తున్నారని ఓ క్షణం కేజ్రీవాల్ బాధతో మాట్లాడలేకపొయ్యారు.