Sunday, September 8, 2024

కేజ్రీకి జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్

- Advertisement -
- Advertisement -

సుప్రీం కోర్టు ఉపశమనం
ఎన్నికల్లో ప్రచారానికి వీలు
2న లొంగిపోయి, తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశం

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు నుంచి పెద్ద ఉపశమనం లభించింది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వీలుగా జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం మంజూరు చేసింది. ఎక్సైజ్ విధానం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోయి, తిరిగి జైలుకు వెళ్లాలని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. జూన్ 5 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయవలసిందని కేజ్రీవాల్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చేసిన అభ్యర్థనను బెంచ్ తిరస్కరించింది.

ఏడు దశలుగా సాగుతున్న ఎన్నికలల్లో పోలింగ్‌కు జూన్ 1 చివరి రోజు. వోట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరుకు కారణాలు తరువాత వెల్లడిస్తామని బెంచ్ తెలిపింది. ఇంతకు ముందు అటువంటి విధానాలు అనుసరించలేదని అంటూ ఎన్నికల ప్రచారం కారణాలతో ఆప్ చీఫ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు వ్యతిరేకించారు. కేజ్రీవాల్‌కు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం వల్ల అంతగా ప్రభావం చూపదని బెంచ్ వ్యాఖ్యానిస్తూ, ఇడి ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఇసిఐఆర్)ను 2022 ఆగస్టులో నమోదు చేయగా ముఖ్యమంత్రిని ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారని తెలిపింది.

‘ఆయన (కేజ్రీవాల్) ఒకటిన్నర సంవత్సరాల పాటు బయటే ఉన్నారు. ఆయనను అంతకు ముందే లేదా తరువాత అరెస్టు చేసి ఉండవలసింది. కాని అటువంటిది ఏదీ జరగలేదు’ అని బెంచ్ ఇడితో అన్నది. ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ ఏమీ మాట్లాడకపోవడంతో సహా బెయిల్ షరతులు విధించాలని లా ఆఫీసర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసు సందర్భంగా క్రితం నెల బెయిల్ మంజూరైన ఆప్ నాయకుడు సంజయ్ సింగ్‌పై విధించిన షరతులే వర్తిస్తాయని బెంచ్ స్పష్టం చేసింది. కేజ్రీవాల్ తరఫున హాజరైన న్యాయవాది షాదాన్ ఫరాసత్ కోర్టు చాలా చిన్న మౌఖిక ఉత్తర్వు జారీ చేసిందని తెలిపారు. ‘మేము లిఖిత ఉత్తర్వును ఇంకా చూడలేదు.

కనుక లిఖిత ఉత్తర్వులోని అంశాలు మాకు తెలియవు. జూన్ 2 వరకు మధ్యంతర విడుదల/ బెయిల్‌పై కేజ్రీవాల్‌ను విడుదల చేస్తున్నామని, ఈ 20, 22 రోజుల్లో బయల ఉన్నప్పుడు ప్రచార ప్రక్రియలో ఏమి మాట్లాడవచ్చో కూడదో షరతులు ఏవీ లేవు’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఈ ఉత్తర్వు అప్‌లోడ్ అవుతుందని ఆశిస్తున్నాం’ అని ఫరాసత్ తెలిపారు. ఈ కేసులో తన అరెస్టును నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు క్రితం నెల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ పిటిషన్‌పై వాదనలు వచ్చే వారం కొనసాగుతాయని, ఈ నెల 20న వేసవి సెలవులు మొదలయ్యే లోపల పిటిషన్‌పై తీర్పు వెలువరించేందుకు ప్రయత్నిస్తామని బెంచ్ తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News