Friday, January 10, 2025

కేజ్రీవాల్ గ్యారంటీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 10 ఎన్నికల గ్యారంటీలను ప్రకటించారు. ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ గ్యారంటీలను అమలుచేస్తామన్నారు. తానిప్పటి వరకైతే ఈ గ్యారంటీల గురించి ఇండియా బ్లాక్ సహచరులతో నైతే చర్చించలేదన్నారు. కానీ ఇండియా బ్లాక్ లోని ఏ నాయకుడు వీటి వల్ల సమస్యను ఎదుర్కోబోడని అన్నారు.

లోక్ సభ ఎన్నికలు ఇంకా జరగాల్సి ఉన్నప్పటికీ ఆప్ 22 స్థానాల్లో 18 స్థానల నుంచి పోటీచేయనున్నదని తెలిపారు. ఆప్ ఢిల్లీ నుంచి నాలుగు, పంజాబ్ నుంచి 13, హర్యానా నుంచి ఒక స్థానానికి పోటీచేయబోతోందన్నారు. ‘మోడీ గ్యారంటీలకు పోటీగా కేజ్రీవాల్ గ్యారంటీలు ఉంటాయి’ అని ఆయన వివరించారు. ఆదివారం ఆయన న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విషయాలు చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన గ్యారంటీలలో…

విద్యుత్తు: దేశవ్యాప్తంగా 24 గంటలపాటు విద్యుత్తు. మేనేజ్మెంట సరిగా లేనందువల్లే విద్యత్తు కోతలు ఏర్పడుతున్నాయన్నారు. మేము విద్యత్తు కోతలను ఢిల్లీ, పంజాబ్ లో నివారించాము. ఇక దేశ వ్యాప్తంగా కూడా నివారిస్తాం అన్నారు.

విద్య: అందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తాం. పిల్లలకు చదువు అందితేనే దేశం ప్రగతి సాధించగలదు అన్నారు. నేడు పాఠశాలల్లో పరిస్థితులు నాసిరకంగా ఉన్నాయన్నారు.

అందరికీ వైద్యం: సమాజంలోని ప్రతి ఒక్కరికీ వైద్యం అందేలా చూస్తామన్నారు. గ్రామాల్లో, మారుమూలల్లో మొహల్లా క్లీనిక్ లు నడుస్తున్నాయన్నారు. జిల్లా ఆసుపత్రులను మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులుగా మలుస్తామన్నారు. దేశమంతటా హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తామన్నారు.

చైనా ఆక్రమణకు పరిష్కారం: మన సరిహద్దులో చైనా ఆక్రమణలకు శాశ్వత పరిష్కారం కనుగొంటాం. దేశం సర్వప్రథమమైంది. చైనా ఆక్రమిస్తున్నా కేంద్రం మాత్రం మన భూభాగంలోకి ఎవరూ రాలేదంటోంది. శాటిలైట్ల ఇమేజ్ లు లభించే యుగం ఇదని ప్రపంచానికి తెలుసు.

అగ్నివీరులకు శాశ్వత పోస్టింగ్ లు: కాంట్రాక్టు పద్ధతిలో అగ్ని వీరులను తీసుకునే విధానాన్ని రద్దు చేసి వారికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. జీతాల భారానికి వెరచి కేంద్రం ఈ విధానాన్ని తెచ్చిందన్నారు. దేశ రక్షణకు మనం ఎంతైనా ఖర్చు చేయాల్సిందేనన్నారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.

రైతులకు హామీలు: స్వామినాథన్ రిపోర్టు ఆధారంగా రైతుల పంటకు కనీస మద్దతు ధర ఇస్తామన్నారు. రైతులు గౌరవంగా జీవించే వసతి కల్పిస్తామన్నారు.

ఢిల్లీకి రాష్ట్ర హోదా: ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను కల్పిస్తామన్నారు.

ఉపాధి: ఉపాధిని కల్పిస్తామన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చేందుకు సమగ్ర ప్లాన్ ను ఆయన ప్రజెంట్ చేశారు.

అవినీతిపై విరుచుకుపడతాం: నిజాయితీ కల వారిని జైలుకు పంపే స్థితి ఇప్పుడుంది. పైగా అవినీతి పరులను రక్షించే వ్యవస్థ ఉంది. మన దేశంలో అవినీతి ఎక్కువ ఉండడానికి కారణమిదే.

వ్యాపారుల కోసం చర్యలు: జిఎస్ టిని సులభతరం చేస్తామన్నారు. న్యాయంగా వ్యాపారం చేయాలనుకున్నవారికి పరిస్థితులు అనుకూలంగా ఉండాలన్నారు. మా లక్ష్యం చైనాను అధిగమించడమే. తయారీ, అమ్మకం విషయంలో ఆ దేశం మనకన్నా ముందుంది. వ్యాపారులు సులభంగా, బహిరంగంగా తమ వ్యాపారం చేయలేకపోవడమంటే అది దేశ ప్రగతికే అడ్డంకి.

గత 8 నుంచి 10 ఏళ్లలో హై నెట్ వర్త్ ఉన్న 12 లక్షల మంది తమ వ్యాపారాలు మూసేసుకుని దేశం వదిలిపోయారని కేజ్రీవాల్ తెలిపారు. ఎందుకంటే వారిని ప్రభుత్వం వేధించింది కనుక అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News