Sunday, January 5, 2025

అధికారిక నివాసం వీడిన కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తాను తొమ్మిది సంవత్సరాల పాటు నివసించిన అధికారిక బంగళాను ఖాళీ చేసి లుటియెన్స్ జోన్‌లోని వేరే బంగళాకు మారిపోయారు. తన భార్య, కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రులతో ఆయన రెండు కార్లలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం నుంచి మండి హౌస్ సమీపంలోని ఫిరోజ్‌షా రోడ్డులో ఉన్న బంగళాకు వెళ్లారు. పంజాబ్‌కు చెందిన ఆప్ రాజ్యసభ సభ్యుడు అశోక్ మిట్టల్‌కు కేటాయించిన బంగళాలో కేజ్రీవాల్ చేరారు.

అధికారిక నివాసం నుంచి బయల్దేరే ముందు అక్కడి సిబ్బంది కేజ్రీవాల్‌కు భావోద్వేగంతో వీడ్కోలు తెలిపారు. అక్కడి సిబ్బందిని ఆలింగనం చేసుకుని కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌కు నంబర్ 6, ఫ్లాగ్‌స్టాఫ్ బంగళాను ఢిలీ ప్రభుత్వానికి చెందిన పిడబ్లుడి శాఖ కేటాయించింది. కాగా..కొత్త బంగళాలోకి కేజ్రీవాల్ కుటుంబం సాంప్రదాయ రీతిలో గృహప్రవేశం చేసింది. రెండు మినీ ట్రక్కులలో కేజ్రీవాల్ కుటుంబానికి చెందిన సామాన్లు కొత్త బంగళాకు చేరుకున్నాయి. గత నెలలో బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన నిజాయితీపై ప్రజల నుంచి ఆమోదం పొందిన తర్వాతే మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపడతానని ఆయన ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News