న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని, ఈ అవినీతి మూలాలు బయటపడుతున్నందున ఆయనకు సంకెళ్లు చేరువ కానున్నాయని బీజేపీ ఆదివారం ధ్వజమెత్తింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆదివారం పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ కొవిడ్ బాధితులు కేజ్రీవాల్ సహాయం అర్థించిన సమయంలో ఆయన పూర్తిగా అవినీతి కుంభకోణంలో నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఈ అవినీతి మూలాలు కేజ్రీవాల్ ముంగిటకు దారి తీసిందని , చట్టానికి ఎవరూ అతీతులు కారని, అవినీతి పరులైన వారినెవరినీ ఉపేక్షించేది లేదని భాటియా స్పష్టం చేశారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేష్ గుప్తా కూడా ఈ పాత్రికేయ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అవినీతి మయమని రుజువైందని, ఈ స్కామ్ మొత్తానికి సూత్రధాని కేజ్రీవాల్ అని పేర్కొన్నారు.
అవినీతి లేనప్పుడు కొత్త ఎక్సైజ్ పాలసీని ఎందుకు ఉపసంహరించుకున్నారో ఆప్ ప్రభుత్వం 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని బాటియా సవాలు విసిరారు. కొవిడ్ మహమ్మారి రెండో వేవ్ తలెత్తినప్పుడు ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో బీజేపి ఔషధాలు సకాలంలో సరఫరా చేయడంతోపాటు వైద్య, ఆరోగ్య మౌలిక సౌకర్యాలను కూడా అభివృద్ధి చేసిందని, అదే సమయంలో కేజ్రీవాల్ ఔషధాల ఆవశ్యకత, పడకలు, ఆక్సిజన్ సరఫరా వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించి ఉండవలసిందని, కానీ ఆయన అవినీతి కలం ఎక్సయిజ్ పాలసీపై సంతకం పెట్టడంలో బిజీ అయ్యిందని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్, సిసోడియా, సత్యేందర్ జైన్ ఈ ముగ్గురు అత్యంత అవినీతి పరులని బీజేపీ ఆరోపించింది. ఈరోజు ప్రజలంతా “ఇది ఆప్ కాదు పాపం, అవినీతి కూపం, ప్రజలకు శాపం” అని ఎద్దేవా చేస్తున్నారని భాటియా విమర్శించారు.