ప్రజల కోసం పాటుపడాలని వినతి
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో అధికారం కోల్పోయిన మరునాడు ఆదివారం పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ నగరంలోని తన ఫిరోజ్‌షారోడ్ నివాసంలో కొత్తగా ఎన్నికైన 22 మంది ఎంఎల్‌ఎలతో సమావేశమయ్యారు. ప్రజల కోసం పని చేయవలసిందిగా వారిని ఆయన కోరారు. పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రి, 22 మంది ఆప్ ఎంఎల్‌ఎలలో ఒకరైన ఆతిశీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షం పాత్ర పోషిస్తుందని, కాషాయ పార్టీ తన వాగ్దానాలు అమలు చేసేలా చూస్తుందని చెప్పారు.
ప్రజలకు సేవ చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కొత్తగా ఎన్నికైన ఎంఎల్‌ఎలను కేజ్రీవాల్ ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ‘ఆప్ నిర్మాణాత్మక ప్రతిపక్షం పాత్ర పోషిస్తుంది, బిజెపి వాగ్దానం చేసినట్లు మార్చి 8 లోగా మహిళలకు నెలకు రూ. 2500 ఇచ్చేలా, ప్రజలకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేసేలా, వారికి ఇతర సౌకర్యాలు కొనసాగించేలా ఆప్ చూస్తుంది’ అని ఆతిశీ చెప్పారు.
ఆప్ ప్రభుత్వం గడచిన పది సంవత్సరాల్లో కల్పించిన సౌకర్యాలను, ఉచిత సేవలను బిజెపి ఆపకుండా ఎంఎల్‌ఎలు చూస్తారని ఆమె తెలిపారు. రానున్న రోజుల్లో ఆప్ శాసనసభా పక్షం సమావేశంలో ప్రతిపక్ష నాయకుని నామినేట్ చేయగలమని ఆతిశీ తెలియజేశారు. ఆప్ ఒక దశాబ్దం తరువాత అధికారం కోల్పోగా బిజెపి 70 అసెంబ్లీ సీట్లలోకి 48 సీట్లతో సుమారు 27 ఏళ్ల తరువాత అధికారంలోకి తిరిగి వచ్చింది.