న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ దేశంలోని మధ్య తరగతి ప్రజల కోసం ఏడు సూత్రాల ‘మేనిఫెస్టో’ను బుధవారం ప్రకటించారు. వారిని వరుస ప్రభుత్వాలు అలక్షం చేశాయని, వారు ‘పన్ను ఉగ్రవాదం’ బాధితులు అని ఆయన ఆరోపించారు. మధ్య తరగతి భారతీయ ఆర్థిక వ్యవస్థకు అసలైన ‘సూపర్ పవర్’ అని, కానీ వారు సుదీర్ఘ కాలంగా అలక్ష్యానికి గురయ్యారని, వారిని పన్ను వసూలు కోసం దోపిడి చేశారని కేజ్రీవాల్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. మధ్య తరగతివారం ఆందోళనలను పరిహరించడం లక్షంగా ఏడు సూత్రాల ప్రణాళికను కేజ్రీవాల్ ప్రకటించారు. విద్యా బడ్జెట్‌ను ప్రస్తుత రెండు శాతం నుంచి పది శాతానికి పెంచడం, ప్రైవేట్ పాఠశాలల ఫీజులకు గరిష్ఠ పరిమితి విధించడం ఆ డిమాండ్లలో ఉన్నాయి. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేందుకు ఉన్నత విద్య కోసం సబ్సిడీలను, ఉపకార వేతనాలను కూడా ఆయన ప్రతిపాదించారు.
ఆరోగ్య సేవల వ్యయం పెంచవలసిన అవసరం ఉందని ఆప్ చీఫ్ స్పష్టం చేస్తూ, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్నులు తొలగించడంతో పాటు జిడిపిలో పది శాతం పెరుగుదలను సూచించారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని కూడా కేజ్రీవాల్ పిలుపు ఇచ్చారు. అవి మధ్య తరగతిపై భారీగా ఆర్థిక భారం మోపుతున్నాయని ఆయన తెలిపారు. నిత్యావసర వస్తువులపై జిఎస్‌టిని తొలగించాలన్నది ఆప్ మరొక డిమాండ్. ఆ జిఎస్‌టి మధ్య తరగతి కుటుంబాలకు నష్టం కలిగిస్తోందని ఆయన అన్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ఉచిత ఆరోగ్య సేవలు సహా పటిష్ఠమైన రిటైర్‌మెంట్ ప్లాన్లు మరిన్ని ఉండాలని కూడా ఆయన సూచించారు.
ఇటీవలి సంవత్సరాల్లో నిలిపివేసిన వృద్దులకు రైలు చార్జీల్లో 50 శాతం రాయితీని పునరుద్ధరించాలని కూడా కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. స్వాతంత్య్రం నాటి నుంచి మధ్య తరగతిని ‘బానిస మనస్తత్వం’ స్థాయికి కుదించినందుకు రాజకీయ పార్టీలను ఆయన విమర్శించారు. ఆప్ ఎంపిలు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో మధ్య తరగతి వారి వాణిని వినిపించగలరని కేజ్రీవాల్ తెలియజేశారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనుండగా ఫలితాలు 8న వెలువడుతాయి. 2020లో 70 అసెంబ్లీ సీట్లకు 62 కైవసం చేసుకున్న ఆప్ వరుసగా మూడవ విడత అధికారాన్ని ఆశిస్తోంది.