Thursday, January 16, 2025

రెండు రోజుల్లో సిఎం పదవికి రాజీనామా చేస్తా: కేజ్రీవాల్ ప్రకటన

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
జనం ‘నిజాయతీ సర్టిపికేట్’ ఇచ్చే వరకు సిఎం పదవి అధిష్ఠించను

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల తరువాత రాజీనామా చేస్తానని సిఎం అర్వింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. ఢిల్లీలో సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. ప్రజలు తనకు ‘నిజాయతీ సర్టిఫికేట్’ ఇచ్చేంత వరకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించబోనని కేజ్రీవాల్ శపథం చేశారు. ఎక్సైజ్ విధానం అవినీతి కేఉలో శుక్రవారం తీహార్ నుంచి బెయిల్‌పై విడుదలైన కేజ్రీవాల్ వచ్చే రెండు రోజుల్లో తాను ఆప్ ఎంఎల్‌ఎలతో సమావేశం నిర్వహిస్తానని, పార్టీ నేత ఒకరు ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారని తెలియజేశారు.

‘ఢిల్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగవలసి ఉన్నాయి. కానీ మహారాష్ట్రతో పాటే నవంబర్‌లో దేశ రాజధానిలో ఎన్నికలు నిర్వమించాలని కోరుతున్నాను’ అని ఆయన చెప్పారు. ‘ప్రజలు నాకు నిజాయతీ ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తరువాతే సిఎం గద్దెపై కూర్చుంటాను. జైలులో నుంచి బయటకు వచ్చిన తరువాత ‘అగ్నిపరీక్ష’ చేయించుకోవాలని అనుకున్నాను’ అని ఆయన తెలిపారు. ‘ప్రజలు మేము నిజాయతీ పరులం అని ప్రజలు చెప్పినప్పుడే నేను ముఖ్యమంత్రిని, మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రి అవుతాం’ అని ఆప్ జాతీయ కన్వీనర్ స్పష్టం చేశారు. తనను అవినీతిపరునిగా నిరూపించేందుకు బిజెపి ప్రయత్నించిందని కేజ్రీవాల్ ఆరోపిస్తూ, కాషాయ పార్టీ వారు అవినీతిపరులు కనుకే ప్రజలకు మంచి పాఠశాలలు, ఉచిత విద్యుత్ ఇవ్వలేదని అన్నారు. ‘మేము నిజాయతీపరులం’ అని ఆయన స్పష్టం చేశారు.

‘వారు బిజెపియేతర ముఖ్యమంత్రులపై తప్పుడు కేసులు బనాయిస్తారు. వారు అరెస్టయితే రాజీనామా చేయవద్దని, జైలులో నుంచే ప్రభుత్వాన్ని నడపవలసిందని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగం నాకు సర్వోన్నతమైనది కనుకే (ఎక్సైజ్ విధానం కేసులో అరెస్టు తరువాత) నేను రాజీనామా చేయలేదు’ అని కేజ్రీవాల్ చెప్పారు. బిజెపి ‘కుట్రలను’ దీటుగా ఎదుర్కొనేది ఆప్ మాత్రమే అని ఆయన తెలిపారు. 2014లో అధికారాన్ని చేపట్టిన 49 రోజులకే జన్ లోక్‌పాల్ బిల్లుపై ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేయడం గురించి కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ, ‘నా ఆశయాల కోసం అప్పుడు రాజీనామా చేశాను. నాకు అధికార వ్యామోహం లేదు’ అని చెప్పారు. ఎక్సైజ్ విధానం కేసుల దీర్ఘ కాలం సాగుతుందని ఆయన సూచిస్తూ, తాను నిజాయతీపరుడినా లేక అవినీతిపరుడినా అన్నది ఢిల్లీ ప్రజలను అడగాలని అనుకున్నానని తెలిపారు.

తనను నిజాయతీపరుడిగా పరిగణిస్తేనే తనకు అనుకూలంగా వోటు వేయవలసిందని ఆయన ప్రజలను కోరారు. ‘నాకు బిజెపి ముఖ్యం కాదు. ప్రజలే ప్రధానం’ అని ఆయన స్పష్టం చేశారు. ‘మా నేతలు సత్యేంద్ర జైన్, అమానతుల్లా ఖాన్ ఇప్పటికీ జైలులో ఉన్నారు. వారు త్వరలోనే బయటకు వస్తారని ఆశిస్తున్నా’ అని కేజ్రీవాల్ ఆప్ కార్యకర్తలతో చెప్పారు. ‘కష్ట సమయాల్లో మాతో ఉన్నందుకు’ భగవంతునికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. జైలులో తాను గడిపిన సమయం గురించి కేజ్రీవాల్ ప్రస్తావిస్తూ, బ్రిటిష్ నిర్బంధంలో స్వాతంత్య్ర యోధుడు భగత్ సింగ్ రాసిన లేఖలు చదివానని తెలియజేశారు. ‘నేను తీహార్ జైలులో నుంచి లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఒకే ఒక లేఖ రాశాను. నాకు ఒక హెచ్చరిక జారీ అయింది’ అని ఆయన చెప్పారు. ‘మన స్వాతంత్య్ర యోధులను సహచరులతో సమావేశాలకు అనుమతించారు. కానీ మా పార్టీ సహచరుడు సందీప్ పాఠక్‌ను జైలులో నాతో భేటీకి అనుమతించలేదు’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News