Sunday, January 5, 2025

ప్రజలను కాపాడాలని అడిగితే నాపై దాడులు చేయిస్తున్నారు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో శాంతి భద్రతలను గాలికి వదలివేశారు
కేంద్రంపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
మొన్న తనపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ అమిత్ షాపై ఆగ్రహం

న్యూఢిల్లీ : ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజలను కాపాడాలని అడిగినందుకు కేంద్ర ప్రభుత్వం తనను లక్షంగా చేసుకుందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఆదివారం సంచలన ఆరోపణలు చేశారు. శాంతి భద్రతల విషయంలో ఢిల్లీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళితే పరిష్కారం చూపిస్తుందని తాను భావించినట్లు కేజ్రీవాల్ విలేకరుల గోష్ఠిలో చెప్పారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా స్పందించి చర్యలు తీసుకుంటారని భావించానని, కానీ తననే లక్షంగా చేసుకున్నారని, ఇలా దాడులు చేయిస్తారని తాను అనుకోలేదని కేజ్రీ చెప్పారు. శనివారం సాయంత్రం మాలవీయ నగర్‌లో పాదయాత్ర చేసిన కేజ్రీవాల్‌పై ఒక వ్యక్తి దాడికి యత్నించిన విషయం విదితమే.

అతను తన చేతిలోని ఒక ద్రావకాన్ని కేజ్రీవాల్‌పైకి విసిరాడు. దీనితో అప్రమత్తమైన భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. కేజ్రీవాల్ తాజాగా ఆ ఘటనను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ ద్రావకం హానికారకం కాదని, కానీ, అది ప్రమాదభరతం అయి ఉండేదని ఆయన అన్నారు. అది గత 35 రోజుల్లో తనపై మూడవ దాడి అని కేజ్రీ చెప్పారు. కాగా, వచ్చే ఏడాది జరగనున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో గాని, కూటమిలోని ఇతర పార్టీలతో గాని కలసి ఆప్ పోటీ చేసే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఎవరితోను పొత్తు పెట్టుకోదని, ఆ దిశగా తాము ఇంత వరకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదని ఆయన సమాధానం ఇచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

కేజ్రీవాల్‌కు మాత్రమే ఇలా జరుగుతోందేమిటి?: బిజెపి నేత సెటైర్లు

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై శనివారం జరిగిన దాడిని, దీనిపై ఆయన కేంద్రంపై చేసిన ఆరోపణలను బిజెపి ఢిల్లీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ఖండించారు. కేజ్రీవాల్‌కు మాత్రమే ఇటువంటి ఘటనలు జరుగుతాయి ఎందుకని అంటూ ఢిల్లీ వాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారని సచ్‌దేవ ఎద్దేవా చేశారు. మాలవీయ నగర్‌లో కేజ్రీవాల్‌పై జరిగిన ద్రావకం దాడి ఆప్ చేసిన స్టంట్ అని, ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఆ పార్టీ స్వయంగా ఆ ప్లాన్ వేసిందని సచ్‌దేవ ఆరోపించారు. కేజ్రీవాల్‌పై పోసింది నీళ్లే తప్ప ఆప్ నేతలు ఆరోపిస్తున్నట్లు స్పిరిట్ కాదని ఆయన వివరించారు. ఈ విషయంపై పోలీసులు స్పష్టత ఇచ్చారని సచ్‌దేవ గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News