Friday, December 20, 2024

ఢిల్లీ లిక్కర్ స్కాం బూటకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు బూటకం అని, కేవలం నిజాయితీగల ఆప్‌ను అప్రతిష్టపాలుచేసే బిజెపి యత్నం అని పార్టీ నేత, సిఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసిన దశలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. నిందితులు రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రలపై మోపిన అభియోగాలకు తగు సాక్షాధారాలు లేవని పేర్కొంటూ, వారిపై కేసు ప్రాధమికంగా సరికాదని తెలియచేస్తూ న్యాయస్థానం వీరికి బెయిల్ ఇచ్చింది. ఎటువంటి ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని తాము విశ్వసిస్తున్నామని న్యాయస్థానం పేర్కొనడం తమ పార్టీ నిజాయితీకి తిరుగులేని సర్టిఫికెట్ అయిందని కేజ్రీవాల్ తెలిపారు.

నిజానికి ఈ యావత్తూ లిక్కర్ స్కామ్ పెద్ద బూటకం, అంతకు మించి బిజెపి ప్రోద్బలంతో ఆప్ పట్ల ప్రదర్శిస్తున్న కక్షసాధింపు చర్య అని పేర్కొన్న కేజ్రీవాల్ ఆధారాలు లేకుండా కేసులు పెట్టడం ద్వారా ఏం సాధిస్తారని ఇడిని ప్రశ్నించారు. కేవలం తమ పార్టీని దెబ్బతీసేందుకు బిజెపి పన్నిన కుట్రలో భాగంగానే కేసులు పెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏదో విధంగా లిక్కర్ స్కామ్ రగులుతూ ఉండటం ప్రధాని మోడీ, ఆయన తోటి బిజెపి నేతల ఆలోచన అని, అయితే పసలేని అభియోగాలతో ఈ కేసు ఎంతకాలం ఉంటుందని ప్రశ్నించారు. పలు విధాలుగా ఆప్ ప్రాబల్యం పెరగడం బిజెపికి రుచించని విషయం అయిందన్నారు.

అందుకే తప్పుడు కేసులకు ఇడి, సిబిఐలను ప్రేరేపిస్తోందని విమర్శించారు. ఆప్ ప్రాబల్యం పెరుగుతూ ఉంటే నిరాశానిస్పృహలకు లోనయి బిజెపి ఈ తప్పుడు కేసుల బనాయింపులకు తన పరిధిలోని దర్యాప్తు సంస్థలతో రంగంలోకి దిగుతోందని విమర్శించారు. బిజెపి ఎంత యత్నించినా ప్రతిపక్షం పట్ల జనాదరణ తగ్గదని, మరింత పెరుగుతుందని తెలిపారు. తమ నేతలపై తప్పుడు ఆరోపణలకు దిగుతున్నందుకు బిజెపి బేషరత్ క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని ఆప్ నేత తెలిపారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలను బిజెపి ఖండించింది. ఆప్ సీనియర్ నేతలు పలువురు కోర్టు ఉత్తర్వుల్లోని అంశాలను వక్రీకరిస్తున్నారని తెలిపారు. బెయిల్ దక్కినంతనే నేరం నేరం కాకుండా పోతుందా? అని ప్రశ్నించిన బిజెపి ఆప్ నేతలపై కోర్టు ధిక్కార చర్యలు అవసరం అని పేర్కొంది.

సిసోడియా కస్టడీ 23 వరకూ పొడిగింపు
బెయిల్ దరఖాస్తు తోసివేత..సాక్షాల పరిగణన
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్న ఆప్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు తిరిగి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన జుడిషియల్ కస్టడీని స్థానిక ఢిల్లీ కోర్టు ఈ నెల 23 వరకూ పొడిగించింది. అంతకు ముందటి కస్టడీ గడువు సోమవారం ముగియడంతో ఆప్ నేతను కోర్టు ఎదుట సోమవారం ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదనపు ఛార్జీషీటును దాఖలు చేసిందని, ఇది ఈ నెల 10న పరిశీలనకు రానుందని, ఈ దశలో నిందితుడికి బెయిల్ శ్రేయస్కరం కాదని సంస్థ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్‌కె మట్టా తెలిపారు. సంబంధిత వివరాలను కోర్టుకు సమర్పించారు. దీనితో కస్డడీని పొడిగించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ ఆదేశించారు. దీనితో మరో పదిరోజుల పాటు సిసోడియా జైలులోనే ఉండాల్సి ఉంటుంది.

అంతకు ముందు కోర్టు స్పందిస్తూ నిందితుడి బెయిల్ దరఖాస్తును ఆమోదించడం కుదరదని, ఆర్థిక నేరాల కేసు సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం పడేలా చేస్తుందని తెలిపింది. పైగా ఇప్పుడు ఈ కేసులో జరిగిందని చెపుతున్న నేరంలో ఈ నిందితుడు కమిషన్లు పొందడాన్ని నిరూపించే భారీ స్థాయి సాక్షాధారాలు ఉన్నాయని స్పష్టం అవుతున్నందున దీనికే తాము ప్రాధాన్యత ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు. లిక్కర్ స్కామ్‌లో సిసోడియాను ఇడి మార్చి 9వ తేదీన అరెస్టు చేసింది. సంబంధిత కేసులోనే సిబిఐ అంతకు ముందు సిసోడియాను అరెస్టు చేసింది. ఏకకాలంలో సిసోడియా ఈ రెండు దర్యాప్తు సంస్థల అరెస్టులు తరువాతి కస్టడీలను ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News