న్యూఢిల్లీ: ప్రజలకు ఉచిత సౌకర్యాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరు చూస్తుంటే కేంద్ర ఆర్థిక పరిస్థితిపై సందేహాలు కలుగుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం వ్యాఖ్యానించారు. అగ్నిపథ్ సైనిక నియామక పథకాలు, కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా 42 శాతం నుంచి 29 శాతానికి తగ్గింపు, ఆహార వస్తువులపై జిఎస్‌టి విధింపు, ఉపాధి హామీ నిధులలో 25 శాతం కోత తదితర అంశాలను ప్రస్తావిస్తూ ఈ డబ్బంతా ఎక్కడకు పోతోందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై ఏడాదికి రూ.3.5 లక్షలతోసహా కేంద్రం భారీ మొత్తాన్ని పన్నుల రూపంలో వసూలు చేస్తోందని, అయినప్పటికీ దేశ ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఇతర సౌకర్యాల కల్పనను కేంద్రం వ్యతిరేకిస్తోందని ఆయన తెలిపారు. రిటైర్డ్ సైనికులకు పెన్షన్లు చెల్లించడానికి కూడా నిధుల కొరతను కేంద్రం ఎంతుకు ఇంత హఠాత్తుగా చూపుతోందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక పరిస్థితిలో ఎక్కడో ఏదో తేడా జరిగినట్లు కనపడుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దేశంలోని బడా వ్యాపారులు, వారి కంపెనీలకు రూ.10 లక్షల కోట్ల రుణాలను, రూ.5 లక్షల కోట్ల పన్నులను మాఫీ చేసినట్లు చెప్పుకుంటున్న కేంద్రంపై ఆయన మండిపడ్డారు.
Kejriwal Slams Centre Govt over Indian Economy