న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో తనను అరెస్ట్ చేయడంపై ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. తనను అవమానించడమే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏకైక లక్షమన్నారు. లోక్‌సభ ఎన్నికల కంటే ముందు తనను నిరోధించడమే వారి ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈడీ అరెస్టును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన ఆయన, మధ్యంతర ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం బుధవారం విచారించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, విక్రం చౌదరీలు వాదనలు వినిపించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన సమయం పలు సందేహాలకు తావిస్తోందన్నారు. ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత అరెస్టు చేయడం శోచనీయమన్నారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్షాధారాలు ఏవీ లేవన్నారు. అరెస్ట్ చేసే ముందు ఆయన నివాసం వద్ద ఎలాంటి స్టేట్‌మెంట్ తీసుకోలేదన్నారు. అరెస్ట్‌కు ముందు ఈడీ అటువంటి ప్రయత్నమే చేయలేదన్నారు. కేజ్రీవాల్ పారిపోయే అవకాశం ఉందా? ఆయన ఒకటిన్నర ఏళ్లలో ఎవరినైనా సాక్షిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారా? ప్రశ్నించడానికి నిరాకరించారా? అని సింఘ్వీ వాదించారు. ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ వీ రాజు హాజరయ్యారు.